Movie Review: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన "నేను మీకు బాగా కావాల్సిన వాడిని" సినీ సమీక్ష !

కొద్దిరోజుల క్రితమే సమ్మతమే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)

నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, సంజన ఆనంద్‌, సోనూ ఠాకూర్‌

దర్శకత్వం : శ్రీధర్‌ గాదె

నిర్మాత: కోడి దివ్య దీప్తి

మాటలు, స్క్రీన్‌ప్లే: కిరణ్‌ అబ్బవరం

సంగీతం: మణిశర్మ

విడుదల తేదీ: సెప్టెంబర్‌ 16, 2022

రేటింగ్‌: 2.5 / 5

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. రాజావారు రాణిగారు, ఎస్‌ఆర్ కల్యాణ మండపం, సెబాస్టియన్, సమ్మతమే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొద్ది రోజుల క్రితమే 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.  అయితే ఆ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సరైన హంగామా చేయలేదు. దీంతో ఈసారి 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కిరణ్.

'నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా' నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. మూవీ ప్రమోషన్స్‌ను కూడా గ్రాండ్‌గానే నిర్వహించింది చిత్ర యూనిట్. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మంచి అంచనాల మధ్య ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కథ ఏంటంటే..

వివేక్‌ (కిరణ్‌ అబ్బవరం) క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. అతనికి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేసే అమ్మాయి తేజుతో (సంజనా ఆనంద్‌) పరిచయం ఏర్పడుతుంది. ప్రతి రోజు రాత్రి డ్రింక్‌ చేసి.. వివేక్‌ క్యాబ్‌లోనే ఇంటికి చేరుకుంటుంది ఆమె. ఈ క్రమంలో ఒక రోజు రాత్రి.. కొంతమంది రౌడీలు తేజూను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. వాళ్ల నుంచి తేజును కాపాడి రోజూ అతిగా మద్యం తాగడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.

తనను సిద్దు (సిధ్ధార్ద్‌ మీనన్) అనే వ్యక్తి ప్రేమించి మోసం చేశాడని, తన అక్క తప్పు చేస్తే, ఆ శిక్ష తనకు పడిందని చెప్తుంది తేజు. ఈ విషయాలు తెలుసుకున్న వివేక్.. తేజుని ఒప్పించి ఇంటికి పంపిస్తాడు. చాలాకాలం తర్వాత ఇంటికి వచ్చిన తేజుని కుటుంబసభ్యులు ఒక్కమాట కూడా అనకుండా ఇంట్లోకి ఆహ్వానిస్తారు.

తనను ఫ్యామిలీకి దగ్గర చేసిన వివేక్‌ను తేజూ ఇష్టపడటం మొదలుపెడుతుంది. తన ప్రేమను వివేక్‌కు చెప్పాలని అనుకున్న తేజుకి వివేక్‌ తన గతం గురించి చెప్పి షాకిస్తాడు. మలేషియాలో ఉండే పవన్‌ క్యాబ్‌ డ్రైవర్‌ వివేక్‌గా ఎందుకు మారాడు?  తేజును ప్రేమించి మోసం చేసిందెవరు? ఆమె అక్క చేసిన తప్పేంటి? చివరకు తేజు, వివేక్‌ ఎలా ఒక్కటయ్యారు అనేది మిగిలిన కథ.

 

ఎలా ఉందంటే..

‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ కథ పాతదే. అయితే ఆ పాత కథను కొత్తగా చూపించాలని ప్రయత్నించారు. ఆ విషయంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యారు. ట్విస్టులతో సినిమాపై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేశారు. కథ పాతది కావడంతో దానిని నడిపించే విధానం ఆకట్టుకోలేదు. హీరోయిన్‌ ఫ్లాష్‌ బ్యాక్, ఫ్యామిలీకి దగ్గరయ్యే క్రమం, అందులో వచ్చే ట్విస్టులు.. వీటితో సినిమా ఫస్టాఫ్‌లో హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గెస్ట్‌ రోల్‌ చేసినట్టుగా అనిపిస్తుంది.  ఇక సెకండాఫ్‌లో వివేక్‌ లవ్‌ స్టోరీ ఫన్నీగా ఉంటుంది. చివరకు ఆమె ఇచ్చే ట్విస్ట్‌ నవ్వులు పూయిస్తుంది. కొన్ని డైలాగ్స్‌ మాత్రం అవసరం లేకపోయినా తీసుకొచ్చి అతికించినట్టుగా అనిపిస్తాయి. అయితే క్లైమాక్స్‌ ట్విస్ట్‌ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. సగటు ప్రేక్షకుడికి కిరణ్‌ అబ్బవరం నటించిన 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా' సరదాగానే ఉంటుంది. 

ఎవరు ఎలా చేశారంటే..

క్యాబ్‌ డ్రైవర్‌ వివేక్‌ క్యారెక్టర్‌‌లో కిరణ్‌ అబ్బవరం ఒదిగిపోయారు. ఇప్పటికే నటించిన సినిమాలతో పోలిస్తే నేను 'మీకు బాగా కావాల్సిన వాడిని' సినిమాలో కిరణ్‌ నటన మెరుగుపడిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన సంజనా ఆనంద్‌ తన క్యారెక్టర్‌‌కు న్యాయం చేశారు. లాయర్‌ దుర్గగా సోనూ ఠాకూర్‌ మెప్పించారు.

సినిమాలో ఆమె క్యారెక్టర్‌‌ కనిపించేది తక్కువ సమయమే అయినా.. తన అందం, నటనతో ఆకట్టుకున్నారు.  చాలాకాలం తర్వాత వెండితెరపై కనిపించిన ఎస్వీ కృష్ణారెడ్డి.. సంజు తండ్రిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. సెకండాఫ్‌లో బాబా భాస్కర్‌ కామెడీతో బాగున్నా.. ఒక్కో సన్నివేశంలో అతిగా అనిపిస్తుంది. మణిశర్మ అందించిన సంగీతం 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' సినిమాకు ప్లస్‌ అనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్‌ :

కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram), సంజనా ఆనంద్‌, ఎస్వీ కృష్ణారెడ్డి నటన, మణిశర్మ అందించిన సంగీతం, ట్విస్ట్‌లు.

మైనస్ పాయింట్స్‌ :

కథ పాతది కావడం, నెమ్మదిగా కొనసాగడం

ఒక్క మాటలో..  ఈ ‘కావాల్సిన వాడు’లో కొత్తదనం లేదు

Read More : Rules Ranjann First Look: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.. ఫస్ట్ లుక్ రిలీజ్!

You May Also Like These