మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) నటించిన ‘గాడ్‌ఫాదర్’ (GodFather) చిత్రం దసరా కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కమ్‌బ్యాక్‌లో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న చిరుకు.. ‘గాడ్‌ఫాదర్’ సక్సెస్‌తో ఊరట కలిగింది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. దీంతో మెగా ఫ్యాన్స్ ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ఆనందంలో మునిగిపోయారు.
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ‘గాడ్‌ఫాదర్’ సినిమా తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ ఉండటంతో నార్త్ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హిందీ బెల్ట్‌లో మరో 600 స్క్రీన్స్‌ను పెంచారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇకపోతే, ‘గాడ్‌ఫాదర్’ సక్సెస్‌తో సంతోషంలో ఉన్న చిరు.. ఓ మ్యాగజీన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు విషయాల గురించి ఆయన మాట్లాడారు. రీమేక్‌లు చేయడం సవాలుతో కూడుకున్నదని చిరు అన్నారు.
రీమేక్స్ చేయడం ఓ ఛాలెంజ్
‘ఒక భాషలో విజయవంతమైన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం ఛాలెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒరిజినల్ స్టోరీని అప్పటికే ప్రేక్షకులు చూసి ఉంటారు. దానికి ఏమాత్రం తగ్గకుండా.. ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా కథను నడిపించాలంటే కత్తి మీద సామే. గతంలోనూ నేను రీమేక్స్ చేశా. అయితే, రామ్ చరణ్ చెప్పడం వల్లే ఈసారి ‘గాడ్‌ఫాదర్’లో యాక్ట్ చేశా. ఈ మూవీ నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఇందులో నా పాత్రకు డ్యాన్స్‌లు, కామెడీ డైలాగ్‌లు ఉండవు. ఇక, నా వరకూ గొప్ప విమర్శకురాలు నా భార్య సురేఖ. ఏదైనా నచ్చకపోతే తను వెంటనే చెప్పేస్తుంది. ఆమె అభిప్రాయాన్ని నేనెప్పుడూ గౌరవిస్తా’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఆ ట్యాగ్స్ వదిలేయాలి
సౌత్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం గురించి కూడా చిరంజీవి స్పందించారు. ‘ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయన్నది ఎంత వాస్తవమో.. ప్రతి దక్షిణాది చిత్రం విజయం సాధించలేకపోతోందనేది కూడా అంతే వాస్తవం. అదేవిధంగా బాలీవుడ్ నుంచి వచ్చిన ప్రతి సినిమా ఫెయిల్ అవ్వడం లేదు. మూవీ ఏ ప్రాంతానిదనేది కాదు.. కంటెంట్ ఎలా ఉందనేదే ముఖ్యం. అదే ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పిస్తుంది. ఇకపై మనం ప్రాంతీయ చిత్రం అనే ట్యాగ్స్ వదిలి ముందుకు సాగాలి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ అని కాకుండా ఇండియన్ సినిమాగా అభివర్ణించాలి’ అని చిరు పేర్కొన్నారు.
Follow Us