అందం, తీయనైన గాత్రంతో సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు గాయని శ్రీపాద చిన్మయి (Chinmayi Sripada). సింగర్‌గానే కాకుండా మహిళలకు సంబంధించిన పలు అంశాలపై తన మనసులోని భావాలను పంచుకుంటుంటారు చిన్మయి. వివక్ష ఎదుర్కొనే మహిళల తరఫున నిలబడుతుంటారు కూడా. అనవసరంగా తనపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మరోసారి తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన కామెంట్లకు తనదైన శైలిలో జవాబిచ్చి.. కామెంట్ చేసిన వ్యక్తికి చురకలంటించారు చిన్మయి.
గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు చిన్మయి. కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలోనే నటుడు రాహుల్ రవీంద్రన్‌ను 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మహిళా అంశాలపై నిర్మొహమాటంగా, నిర్భయంగా మాట్లాడారు. ‘మీటూ’ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు కూడా. సోషల్ మీడియాలో ఎదురయ్యే కామెంట్లకూ తనదైన శైలిలో స్పందిస్తుంటారు.
అమ్మనయ్యాను..
తన వ్యక్తిగత జీవితంలో మరో మెట్టు ఎక్కిందీ అందాల గాయని. తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చారు చిన్మయి. ద్రిప్తా, శార్వాస్ అనే కవల పిల్లల(పాప, బాబు)కు జన్మనిచ్చి.. ఈ శుభవార్తను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ చిన్నారులిద్దరూ ప్రపంచంలోకి అడుగుపెట్టి మా జీవితాలను పరిపూర్ణం చేశారు’ అంటూ ఇద్దరు పిల్లల చేతులు ఉన్న ఫొటోలను షేర్ చేశారు చిన్మయి. తాము తల్లిదండ్రులం అయ్యామనే వార్తను చిన్మయి, రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. అనంతరం సెలబ్రిటీలు, నెటిజన్లు వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
భజన పాటలు పాడుతూ..
శుభాకాంక్షల పోస్టుల సంగతి అటుంచితే ఒక నెటిజన్ చేసి కామెంట్‌పై ఫైర్ అయ్యారు చిన్మయి.‘ప్రెగ్నెన్సీ ఫొటోలు పెట్టలేదంటే సరోగసీ ద్వారా జన్మనిచ్చారా?’ అనే ఉద్దేశంతో కామెంట్ చేశారు ఒక నెటిజన్. దీంతో ఈ కామెంట్‌కు తనదైన రీతిలో జవాబిచ్చారు అందాల గాయని. ‘గర్భంతో ఉన్న ఫొటోలు పెట్టకపోవడం వల్ల నేను సరోగసీ పద్ధతిలో బిడ్డలకు జన్మనిచ్చానేమోనని కొంతమంది అనుకుంటున్నారు.
నా ప్రెగ్నెన్సీ విషయం కేవలం నా సన్నిహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా ఉంచాలనుకున్నా. ఇందుకు తగ్గట్లే నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు వ్యవహరించారు. నా పిల్లల ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని అనుకుంటున్నా.
మరో విషయం ఏమిటంటే.. నాకు సిజేరియన్ జరిగే సమయంలోనూ భజన పాటలు పాడుతూ.. నా చిన్నారుల్ని ఈ లోకంలోకి ఆహ్వానించా. నేను గర్భం ధరించానని చెప్పడానికి ఇది చాలనుకుంటా..’ అంటూ తనపై కామెంట్ చేసిన వారికి సున్నితంగానే చురకలంటించింది చిన్మయి. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మహిళలపై కామెంట్లు చేసే వారికి బాగా బుద్ధి చెప్పారు అని చిన్మయి (Chinmayi Sripada)ని ప్రశంసిస్తూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
Read More : పుస్తకాల కంటే స్క్రిప్టులే ఎక్కువగా చదువుతున్నా: రెజీనా కాసాండ్రా (Regina Cassandra)
Follow Us