'Vikram' Review (విక్ర‌మ్ రివ్యూ) : అడ‌విలో వెలుగు .. నిర్ణ‌యించేది ప్ర‌కృతి కాదు : క‌మ‌ల్ హాస‌న్

లొకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విక్రమ్ (Vikram) సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలైంది. విక్ర‌మ్‌లో క‌మ‌ల్ హాస‌న్ వెండితెర‌పై యాక్టింగ్ అద‌ర‌గొట్టారు.

సినిమా - విక్రమ్
హీరో - క‌మ‌ల్ హాస‌న్
దర్శకుడు - లోకేష్ కనగరాజ్
నటీనటులు - విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్
నిర్మాతలు - కమల్ హాసన్,ఆర్.మహేంద్రన్
బ్యాన‌ర్ - రాజ్‌కమల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ 
విక్ర‌మ్ రేటింగ్ - 3/5

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) చాలా ఏళ్ల త‌ర్వాత 'విక్ర‌మ్' (Vikram) సినిమాతో ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చారు. ఇదే చిత్రంలో నటుడు సూర్య స్పెష‌ల్ రోల్‌లో కనిపించారు.  విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్ కూడా 'విక్ర‌మ్‌' సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌ల్టీ స్టార‌ర్ మూవీగా 'విక్ర‌మ్ ' సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

లొకేష్ క‌న‌క‌రాజ్(Lokesh Kanagaraj ) ద‌ర్శ‌క‌త్వంలో 'విక్రమ్ ' సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన క‌మ‌ల్ హాస‌న్, వెండితెర‌పై యాక్టింగ్ అద‌ర‌గొట్టారు. బిగ్ బాస్ హోస్టింగ్‌ను ప‌క్క‌న పెట్టి మ‌రీ.. ఈ చిత్రంలో న‌టించారు క‌మ‌ల్‌. ఎన్నో క్లాసిక‌ల్, యాక్ష‌న్ చిత్రాల్లో న‌టించిన‌ క‌మ‌ల్ హాస‌న్‌కు విక్ర‌మ్ సినిమా ఓ ఛాలెంజ్‌గా మారింది. అయినా సరే పాత్రలో జీవించేశారు.

విక్ర‌మ్ క‌థేంటి?
విక్ర‌మ్ (Vikram) చిత్రాన్ని యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించారు కమల్. రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ‌డంతో.. అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.  అరుణ్ కుమార్ విక్రమ్ (కమల్ హసన్) ఓ రా ఏజెంట్. డ్ర‌గ్స్‌ కేసులో పోలీస్ ఆఫీస‌ర్ ప్ర‌భంజ‌న్‌ను మాఫియా హ‌త్య చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ప్ర‌భంజ‌న్ తండ్రి  విక్ర‌మ్‌ను కూడా వాళ్లు చంపేస్తారు. దీంతో, డ్ర‌గ్స్ మాఫియా మొత్తం విక్ర‌మ్ మ‌ర‌ణించాడనే అనుకుంటుంది. కానీ నిజానికి అత‌ను బ్ర‌తికే ఉంటాడు.

ఈ డ్ర‌గ్స్ మాఫియా వ్య‌వ‌హారంతో పాటు, వ‌రుస హ‌త్య‌ల క‌థేంటో తేల్చే ప‌నిని ప్రభుత్వం అమ‌ర్ (ఫాహద్ ఫాజిల్ ) అనే ఓ అధికారికి అప్ప‌గిస్తుంది. అమ‌ర్ పోలీస్ డిపార్టుమెంట్‌లో  ఓ అండర్ కవర్ ఆఫీసర్. స్పై ఏజెెంట్‌గా కూడా వ్యవహరిస్తుంటాడు.  ఆఖరికి ఈ మాఫియా మొత్తం సంతానం అనే వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తుందని తెలుసుకుంటాడు.  సంతానమే ఈ మాఫియాకి డాన్. ఈ పాత్రలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)  తనదైన స్టైల్‌లో నటించాడు.

మరోవైపు, అమర్ అందరూ చనిపోయారని భావిస్తున్న,  ఏజెంట్ విక్ర‌మ్ గురించి ఆరా తీస్తాడు. ఏజెంట్ విక్ర‌మ్ అమ‌ర్‌కు ఏమ‌వుతాడు? ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధం ఏమిటి? సంతానం సృష్టించుకున్న నేర సామ్రాజ్యం అంతమవుతుందా? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో, సూర్య పాత్ర కూడా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలవడం విశేషం.

స్క్రీన్ పై ఓ  న‌టుడిగా విశ్వరూపం ఎలా చూపించాలో, తెలిసిన వ్యక్తి క‌మ‌ల్ హాస‌న్‌. ఇక యాక్ష‌న్‌తో క‌లిసిన థ్రిల్ల‌ర్ సినిమా అంటే మాటలా? విక్ర‌మ్‌లో క‌మ‌ల్ హాస‌న్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. 'చిత్తుగా కుమ్ముతా' అంటూ మాస్ స్టెప్పులతో కూడా కమల్ అద‌ర‌గొట్టారు. కళ్ల‌తో కూడా యాక్టింగ్ చేయ‌గ‌లిగిన టాలెంట్ ఉన్న నటుడు క‌మ‌ల్. ఇక ఫైట్లతో పాటు, పంచ్ డైలాగ్స్‌తో విక్ర‌మ్ థియేట‌ర్‌ను మారుమ్రోగించేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక వర్గం ప్రేక్షకులకు ఈ చిత్రం చాలా బాగా నచ్చుతుంది. 

విక్రమ్ టీమ్
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్.. ఈ ముగ్గురి న‌ట‌న‌ విక్ర‌మ్ (Vikram )సినిమాకు ప్ల‌స్ అయింది. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వ బాధ్యతలు స్వీకరించడంతో పాటు.. తానే క‌మ‌ల్‌కు స్వ‌యంగా మేక‌ప్ కూడా వేశారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ  గిరీష్ గంగాధరన్ అందించగా.. అనిరుధ్ రవిచంద్రన్ మాస్ బీట్ ఉన్న వైవిధ్యమైన సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ , ఆర్.మహేంద్రన్‌లు సంయుక్తంగా రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించారు. 

ఫైన‌ల్ టాక్
క‌మ‌ల్ సినిమా అంటేనే ఓ ప్ర‌భంజ‌నం. 'విక్ర‌మ్‌'తో వెండితెర‌పై క‌మ‌ల్ హాస‌న్ ఇర‌గ‌దీశార‌ని టాక్. అంతేకాదు క‌మ‌ల్ లుక్ కూడా ఈ సినిమాకు ప్ల‌స్ అయింది. 1986లో క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన విక్ర‌మ్ సినిమాకు.. ఈ సినిమాకు ఓ లింక్ ఉంటుందని క‌మ‌ల్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఆనాటి తరానికి పరిచయమైన 'విక్ర‌మ్' సినిమాతో ప్రేరణ చెంది.. అలాంటి చిత్రాన్నే నేటి తరానికి అందివ్వాలని క‌మ‌ల్ అనుకున్నారట‌. అప్పుడే లోకేష్ ఓ కొత్త క‌థ‌తో క‌మ‌ల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చార‌ట‌. అప్పుడు క‌మ‌ల్ చెప్పిన 'విక్ర‌మ్' క‌థ న‌చ్చ‌డంతో.. లోకేష్ త‌న క‌థ‌ను ప‌క్క‌న పెట్టార‌ట‌. 'విక్ర‌మ్' సినిమాను తెర‌కెక్కించార‌ట. మాస్ యాక్ష‌న్ సినిమాగా విక్ర‌మ్ (Vikram), కమల్ అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుంది. 
 

Read Also ఈ అడ‌విలో వెలుగు ఎక్క‌డ, ఎప్పుడు అని నిర్ణ‌యించేది ప్ర‌కృతి కాదు.. నేను : విక్రమ్ ( Vikram) ట్రైలర్‌లో కమల్ హాసన్

You May Also Like These