Independence Day Special: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా .. తెలుగులో చూడాల్సిన టాప్ 10 దేశభక్తి చిత్రాలు !

Independence Day Special : అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి, సైరా నరసింహారెడ్డి లాంటి చిత్రాలు స్వాతంత్య్ర వీరుల బయోపిక్స్‌గా తెరకెక్కాయి

ఈ రోజు ఆగస్టు 15.. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజు (Independence Day). నేటితో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ ప్రత్యేకమైన రోజున మనం కూడా దేశభక్తి నిండిన గుండెలతో, మన మహనీయుల త్యాగనిరతిని గుర్తుచేసుకుందాం. 

తెలుగు సినీ చరిత్రలో ఇప్పటికి ఎన్నో చిత్రాలు, జనాలలో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో తెరకెక్కాయి. అందులో కొన్ని వాస్తవ కథలతో పాటు, పలు కల్పిత కథలు కూడా ఉన్నాయి. అటువంటి దేశభక్తి చిత్రాలలోని ఎంపిక చేసిన టాప్ 10 చిత్రాలు ఈ రోజు మీకోసం ప్రత్యేకం. 

అల్లూరి సీతారామరాజు (Alluri Seetaramaraju) : నటశేఖర కృష్ణ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించారు. విశాఖ మన్యంలో స్వాతంత్ర్య సమరయోధుడైన సీతారామరాజు ఏ విధంగా బ్రిటీష్ వారి ఆగడాలను ఎదుర్కొని, గిరిజనుల జీవితాలలో వెలుగులు నింపాడన్న కోణంలో ఈ సినిమా కథ సాగుతుంది. వి. రామచంద్రరావు ఈ సినిమాకి దర్శకుడు

ఆంధ్ర కేసరి (Andhra Kesari) : తెలుగువారి కీర్తి కీరిటం, స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం గారి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ఘనత దర్శకుడు విజయ్ చందర్‌కి దక్కుతుంది. తెలుగు రాష్ట్రాలలో స్వాతంత్ర సంగ్రామ భేరిని మోగించి, ఒక న్యాయవాదిగా తెల్లదొరల అరాచకాలను ఎండగట్టిన టంగుటూరి ప్రకాశం జీవితంలోని ముఖ్యమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ చందర్ ఈ సినిమాలో ప్రకాశం పాత్రను పోషించారు. 

డాక్టర్ అంబేద్కర్ (Dr Ambedkar) : భరత్ పారేపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల ఆధారంగా తెరకెక్కింది. ఆకాష్ ఖురానా ఈ చిత్రంలో అంబేద్కర్ పాత్రలో నటించారు. భారతదేశంలో అంటరానితనాన్ని రూపుమాపే క్రమంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎదుర్కొనే సవాళ్లను గురించి ఈ చిత్రం తెలియజేస్తుంది. 

ఖడ్గం (Khadgam) : కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. దేశభక్తిని పుణికి పుచ్చుకున్న ముగ్గురు యువకులు ఏ విధంగా మత కలహాలను ప్రేరేపించే అసాంఘిక శక్తులను తుదముట్టిస్తారనే కోణంలో ఈ సినిమా కథ సాగుతుంది. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. 

సైరా నరసింహారెడ్డి (Syeraa Narasimha Reddy) : రేనాటి చోళుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రేనాడులో పాలెగాడిగా తన ప్రజలకు సేవలందిస్తూ, తన ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించడానికి వచ్చిన బ్రిటీష్ మూకలను నరసింహారెడ్డి ఏ విధంగా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్రకథ. మెగాస్టార్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. 

మహాత్మ (Mahatma) : ఈ సినిమాకి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ఓ బజారు రౌడీని మహాత్మగాంధీ సిద్ధాంతాలు ఏ విధంగా మార్చాయన్నది ఈ సినిమా కథ. శ్రీకాంత్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటించారు. 

మేజర్ (Major) : 26/11 ముంబయి దాడులలో అసువులు బాసిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ముంబయిలో మారణహోమానికి పాల్పడిన టెర్రరిస్టు మూకలను అంతమొందించే క్రమంలో, ఎందరో అమాయకుల ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాలను పణంగా పెట్టిన ఓ మేజర్ కథ ఇది. అడివి శేష్ ఈ చిత్రంలో మేజర్ పాత్ర పోషించారు. శశికిరణ్ తిక్కా ఈ సినిమాకి దర్శకుడు.  

ఘాజీ (Ghazi) : విశాఖ తీరంలో భారత నౌకాదళాలను అంతమొందించడానికి సిద్ధమైన పాకిస్తాన్ నౌక ఘాజీ ఎటాక్‌ను ఇండియన్ నేవీ అధికారులు ఎలా తిప్పికొట్టారన్నదే ఈ సినిమా కథ. సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో లెఫ్ట్‌నెంట్ కమాండర్ అర్జున్ వర్మ పాత్రలో నటించారు. 

రాజన్న (Rajanna) : వి. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలంగాణ ప్రాంత స్వాతంత్ర్ర యోధుడు రాజన్న కథను గురించి చెబుతుంది. నేలకొండపల్లి ప్రాంతంలో దొరసాని ఆగడాలకు బలైపోయిన రాజన్న బిడ్డ మల్లమ్మ జీవితం ఈ సినిమా. మల్లమ్మ ఏ విధంగా తన పాట ద్వారా ప్రజలలో ప్రేరణను నింపి, వారిలో దేశభక్తిని రగిలిస్తుందో ఈ సినిమా తెలియజేస్తుంది. నాగార్జున ఈ సినిమాలో రాజన్న పాత్ర పోషించారు. 

ఆర్ఆర్ఆర్ (RRR) : ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లను పోలిన క్యారెక్టర్లతో ఈ సినిమా కథను తయారుచేశారు దర్శకుడు రాజమౌళి. రెండు వేరు లక్ష్యాలతో ప్రయాణాన్ని ప్రారంభించిన ఇద్దరు యోధులు, స్వాతంత్య్ర సంగ్రామ భేరిని మోగించడం కోసం ఎలా ఒక్కటవుతారన్నదే ఈ సినిమా కథ. 

 

 

మిత్రుల్లారా.. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని, మీరు కూడా మనలోని దేశభక్తిని అనువనువునా రగిలించే ఈ సినిమాలను తప్పక చూసేస్తారు కదూ 

Read More:  సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు : చిరంజీవి (Chiranjeevi) నటించిన టాప్ 10 సినిమాలు.. ఫ్యాన్స్‌కు ప్రత్యేకం

Credits: Instagram
You May Also Like These