మాస్, యాక్షన్, కామెడీ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో హీరోగా ఎదిగారు గోపీచంద్ (Gopichand). హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. తరువాత వరుసగా విలన్ పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవలి కాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న గోపీచంద్‌కు సీటీమార్ సినిమా ఆ లోటును భర్తీ చేసింది. ఆ సినిమా హిట్ ఇచ్చిన కిక్‌తో పక్కా కమర్షియల్ సినిమాలో నటించారు.
అభిమానులు ‘మాచో స్టార్’గా పిలుచుకుంటున్న గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షయల్ సినిమా జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ ముచ్చట్లు మీకోసం.
ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు దగ్గరలోని చిన్న పల్లెటూరు మాది. అన్నయ్యను, నన్ను జాయిన్ చేయడానికి మా ఊరికి దగ్గర్లో స్కూల్స్ లేవు. దాంతో మంచి స్కూల్ పెట్టాలని అనుకున్నారు నాన్న (టి.కృష్ణ). అనుకున్న వెంటనే స్కూల్ పెట్టారు. ఆ స్కూల్‌లో మూడో క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత మా కుటుంబం మొత్తం చెన్నై షిఫ్ట్ అయ్యింది.
టి.కృష్ణ మెమోరియల్ స్కూల్ పేరుతో ఇప్పటికీ ఆ స్కూల్ పని చేస్తోంది. సంవత్సరానికి ఒకసారైనా ఆ స్కూల్‌కి వెళ్లి వస్తుంటాను. నేను చదువుకునే రోజుల్లో, మన వాళ్లలో చాలా మంది రష్యాకి వెళ్లి చదువుకునే వారు. నేను కూడా ఇంజినీరింగ్ అక్కడే పూర్తి చేశాను. దాదాపు 5 సంవత్సరాలు రష్యాలో ఉన్నాను.
ఇండస్ట్రీలోకి ఎందుకు అన్నారాయన..
సినిమాల్లోకి రావడానికి కారణం నిర్మాత నాగేశ్వరరావు. 'సినిమాల్లోకి వద్దామని అనుకుంటున్నాను' అని చెబితే బాబాయి పోకూరి బాబూరావు (ఈ తరం ఫిలింస్ అధినేత) 'ఈ ఇండస్ట్రీకి ఎందుకు' అని ప్రశ్నించారు. నాన్న, అన్నయ్య కూడా దర్శకులుగా ఉన్నప్పుడే మరణించడంతో బాబాయి ఆ మాట అన్నారు. 'సినిమాలు చేస్తాను' అని చెప్పడంతో నా ఆసక్తిని గమనించిన ముత్యాల సుబ్బయ్య నన్ను హీరోగా పెట్టి ‘తొలివలపు’ అనే సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాకు నాగేశ్వరరావు నిర్మాతగా వ్యవహరించారు.
అయితే ఆ సినిమాకు మంచి టాక్ రాలేదు. దాంతో దాదాపు ఆరు నెలలు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను. సినిమాల్లోకి వచ్చి 'తప్పు చేశానా' అని కూడా ఒక్కోసారి అనిపించేది. ఒకరోజు సాయంత్రం దర్శకుడు తేజ ఫోన్ చేసి ఆఫీసుకు రమ్మని పిలిచారు. 'జయం' సినిమా కథకు సంబంధించిన స్టోరీ లైన్ చెప్పారు. వెంటనే చేస్తానని ఒప్పుకున్నాను. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత వరుసగా విలన్ క్యారెక్టర్లు చేశాను.
వరుసగా విలన్ ఆఫర్లే..
విలన్‌గా సక్సెస్ కావడంతో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాను. దాంతో హీరోగా కూడా మంచి సినిమా ఆఫర్లు వచ్చాయి. సక్సెస్ అయ్యాను. హీరోగా నా సక్సెస్‌ను నాన్న, అన్నయ్య చూస్తే సంతోషించేవారు. వాళ్లిద్దరూ ఇప్పుడు లేకపోవడం బాధాకారం.
నా సినిమాలకు రణం, యజ్ఞం, లక్ష్యం, లౌక్యం, సౌఖ్యం అనే టైటిల్స్ పెట్టడం వెనుక ఎటువంటి సెంటిమెంట్స్ లేవు. సౌఖ్యం సినిమాకు టైటిల్ విషయంలో కొంత చర్చ నడిచింది. నేను వద్దని చెప్తున్నా..కలిసొస్తుందని కావాలనే అలా పెట్టారు.
లవ్ రిజక్ట్ చేసింది..
ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత లవ్ వంటివి ఏమీ లేవు. అయితే కాలేజీలో చదువుతున్న రోజుల్లో మాత్రం చిన్న లవ్ స్టోరీ ఉండేది. అందంగా ఉందని రష్యన్ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశాను. దేశాలు ఒకటి కాదు.. అని ప్రేమను రిజక్ట్ చేసింది. సరేలే అని లైట్ తీసుకున్నాను.
కథ నచ్చితే..
హీరోగా మంచి స్టేజ్‌లోనే ఉన్నాను. అయితే మంచి క్యారెక్టర్ అనిపించి, హీరోకు ధీటుగా ఉండే పాత్ర వస్తే విలన్‌గా అయినా చేస్తాను. ఇది వరకు చేసిన విలన్ క్యారెక్టర్లన్నీ, హీరో క్యారెక్టర్‌కు సమానంగా పవర్‌ఫుల్‌గా ఉన్నవే. యజ్ఞం సినిమాలో హీరోగా నన్ను సెలక్ట్ చేయడంతో ఆశ్చర్యపోయాను. ముందుగా యజ్ఞం సినిమా కథను ప్రభాస్‌కు, ఆ తర్వాత కల్యాణ్‌రామ్‌కు చెప్పారు. వాళ్లు రిజెక్ట్ చేశారు.
తర్వాత పోకూరి బాబూరావు నన్ను పిలిచి 'యజ్ఞం' సినిమా చేస్తావా అని అడిగారు. చేస్తానన్నాను. ఆ సినిమా ఒప్పుకునే సమయానికి ‘వర్షం’, ‘నిజం’ సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. 'ఒక్కడు' సినిమాలో విలన్‌గా కూడా ఆఫర్ వచ్చింది. ముందు ప్రకాష్‌రాజ్‌ను సినిమా యూనిట్ సంప్రదించినా.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ సబ్జెక్ట్ నా దగ్గరకు వచ్చింది. ఇంట్రెస్టింగ్‌గా అనిపించి చేస్తానని చెప్పాను. అయితే ఆ తర్వాత ప్రకాష్‌రాజ్ డేట్స్ సర్దుబాటు చేసుకున్నారు.
ఫుల్ టైం కామెడీ చేశా..
'పక్కా కమర్షియల్' సినిమా చాలా వినోదాత్మకంగా ఉంటుంది. చాలా కాలం క్రితమే నా దగ్గరకు రావాల్సిన కథ ఇది. రణం, లౌక్యం సినిమాల తర్వాత ఫుల్ టైం కామెడీ ఈ సినిమాలోనే చేశాను. ప్రేక్షకుడు ఎంటర్‌టైన్ కావడానికి అవసరమైన అన్ని ఎలిమెంట్స్ పక్కా కమర్షయల్ సినిమాలో ఉన్నాయి. సినిమా షూటింగ్ మొత్తం చాలా సరదాగా జరిగిపోయింది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ సినిమాలో నటించాం అని చెప్పారు గోపీచంద్ (Gopichand).
Read More : Pakka Commercial : పక్కా కమర్షియల్ చిత్రం వైపే అందరి చూపు.. ఈ సినిమాకి సంబంధించిన టాప్ 10 విశేషాలు మీకోసం !
Follow Us