ఆప్తులు దూరమైతే తట్టుకోవడం అంత సులువు కాదు. మనకు బాగా కావాల్సిన వారు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణించలేం. కన్నవారు, తోబుట్టువులు తిరిగిరాని లోకాలకు వెళ్లడం నిజంగా మాటలకందని విషాదమనే చెప్పాలి. నిన్నటి వరకు మనతో ఉన్నవారు.. హఠాత్తుగా మనల్ని వదిలేసి, కానరాని లోకాలకు వెళ్లిపోతే ఆ బాధ నుంచి కోలుకోవడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది నెలల వ్యవధిలోనే ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయారు ప్రముఖ నటుడు మహేష్ బాబు.
ఘట్టమనేని కుటుంబంలో కొన్ని నెలల వ్యవధిలోనే ముగ్గురు మరణించారు. తన సోదరుడు రమేష్ బాబును పోగొట్టుకున్న బాధలో ఉన్న మహేష్.. అందులో నుంచి కోలుకునేలోపే తల్లి ఇందిరా దేవీని కోల్పోయారు. ఈ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో తండ్రి కృష్ణ మరణం ఆయన్ను మళ్లీ విషాదంలోకి నెట్టేసింది.
మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటుండటంతో ఘట్టమనేని అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ కష్టకాలంలో మహేష్‌కు శక్తినివ్వాలంటూ ఫ్యాన్స్ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు ధైర్యాన్నిస్తున్నారు. ఈ ఏడాది జవనరి 8న మహేష్ సోదరుడు రమేశ్ బాబు (నటుడు, నిర్మాత) చనిపోయారు. కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన మరణించారు. ఇక మహేష్ తల్లి ఇందిరా దేవి అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 28న కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ.. మహేష్‌కు దూరమయ్యారు.
ఇకపోతే, కృష్ణ అంత్యక్రియలను మంగళవారం నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు స్పందించారు. కృష్ణ పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఇవ్వాళ సాయంత్రం గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నామని ఆయన తెలిపారు. రేపు ఉదయం స్టేడియం నుంచి పద్మాలయ స్టూడియోస్‌కు భౌతికకాయాన్ని తరలిస్తామన్నారు. పద్మాలయ స్టూడియోస్‌లో కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక.. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు ఆదిశేషగిరి రావు పేర్కొన్నారు.
Read more: SuperStar Krishna: సూపర్‌స్టార్ కృష్ణ చనిపోవడానికి కారణం అదే.. వెల్లడించిన డాక్టర్లు !
Follow Us