నమస్తే ప్రకాష్ రాజ్ గారు.. "ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో.. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో" అని మహాకవి దాశరథి గారన్నట్లు.. ఈ దేశం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రాణాలర్పించిన వారెందరో ఉన్నారు. ఎందరో యోధులు, సైనికులు, గూఢాచారులు మన దేశం కోసం అసువులు బాసారు. అయితే వీరిలో ప్రపంచానికి తెలియకుండా మరుగున పడిపోయిన వారు అనేకం. మీరు ప్రస్తుతం నటించిన "ముఖ్బీర్" (Mukhbir) వెబ్ సిరీస్ కూడా ఇలాంటి ఇతివృత్తమే కదా. మరి దీనిపై మీ స్పందన ఏమిటి ?
నిజానికి గూఢచారి లేదా స్పై అనే పదం నేడు ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. కానీ వారి జీవితం ఏమిటి ? అజ్ఞాతవాసంలో ఉంటూ దేశం కోసం పనిచేసే Unsung Heroes ఎలాంటి కష్టాలు పడుతుంటారు? అనే విషయాలు మనకు తెలియవు. వారి జీవనశైలి ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. కేవలం మన ఊహలతో కథలు అల్లేస్తుంటాం.
ఎప్పుడూ శత్రు దేశాలలో తిరుగుతూ, ఎల్లప్పుడూ చావుకి సిద్దపడుతూ జీవించే వీరి ఉనికి కూడా ప్రశ్నార్థకమే. కొన్ని సందర్భాలలో వీరు మరణించినా బాధపడే వారుండరు. దొరికినా పట్టించుకొనే వారుండరు. ఒకవేళ దేశం కోసం ఏదైనా సాధించినా, వారికి గుర్తింపు ఉండదు. ఈ కోణాలన్నింటినీ చాలా నిజాయతీగా చూపించిన వెబ్ సిరీస్ “ముఖ్బీర్”.
ఈ రోజు దేశాన్ని నడిపేవారంటే మనకు టక్కున గుర్తుకొచ్చేది రాజకీయ నాయకులు. కానీ దేశం కోసం నిజాయతీగా, నిస్వార్థంగా పాటుపడే వారే నిజమైన అన్‌సంగ్ హీరోస్. వారు దేశం బయట జీవించే మన గూఢచారులైనా కావచ్చు.. లేదా దేశం లోపల జీవించే కష్టజీవులైనా కావచ్చు. మనకు తిండి పెట్టే రైతు కూడా ఒక హీరోనే. అలాగే బండి నడిపేవాడు, పారిశుద్ధ్య కార్మికుడు, మూటలు మోసే వ్యక్తి.. వీరందరూ కూడా హీరోలే. వీరందరూ తమ శ్రమతో బతుకును వెళ్లదీస్తూ, దేశాన్ని కూడా బతికిస్తున్నారు.
“ముఖ్బీర్” అనే వెబ్ సిరీస్ యువతలో కచ్చితంగా దేశభక్తిని నింపుతుందని భావించవచ్చా ? పేట్రియాటిక్ మూవీస్‌లో ఇది ఒక సరికొత్త ప్రయోగమని మనం అనుకోవచ్చా ?
ఒక సినిమా లేదా సిరీస్ ద్వారానే జనాలలో దేశభక్తిని పెంపొందించవచ్చనే భావనతో నేను ఏకీభవించను. పేట్రియాటిజం అనే పదంలోనే ఒక తిరకాసు ఉంది. సమాజంలో కష్టపడే ప్రతీ వ్యక్తి కూడా గొప్ప పేట్రియాటే. మరి ఆ పదాన్ని కొందరికే ఎందుకు అంకితం చేయాలి. గొప్ప నైతిక విలువలతో కూడిన విద్యను పిల్లలకు బోధించే టీచర్‌ను కూడా ఓ గొప్ప పేట్రియాట్‌గానే నేను భావిస్తాను.
ఈ సినిమాలో మీరు ప్రధాన పాత్రకు ట్రైనింగ్ ఇచ్చే ఎస్‌కేఎస్ మూర్తి అనే క్యారెక్టర్‌ను పోషిస్తున్నారు? ఈ పాత్ర చేస్తున్నప్పుడు మీరు స్టడీ చేసిన అంశాలేమిటి? ఈ పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు “జో హర్ జంగ్ కో బినా లడే జీత్నా జాంతే హై” అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు ? అసలు దీని అర్థం ఏమిటి ?
కొన్ని సార్లు యుద్ధాన్ని బలంతో కన్నా, చాణక్యతతో గెలవాల్సిన అవసరం ఉంది. దేశం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు.. శత్రు సైన్యం యుద్ధం ప్రకటిస్తే తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి? చాలా తక్కువ ఖర్చుతో ఇంటెలిజెన్స్ అందించే సమాచారం సహాయంతో.. శత్రుమూకల ఆట కట్టించాలి. 1960 ల్లో మన భారతదేశం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. అప్పుడు మన దేశానికి చెందిన కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు ఎలాంటి వ్యూహాన్ని పన్నారో “ముఖ్బీర్” (Mukhbir) మనకు తెలియజేస్తుంది. ఇందులో నేను పోషించిన మూర్తి పాత్ర కోసం చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది.
ముఖ్యంగా ఆనాటి రాజకీయ పరిస్థితులను స్టడీ చేయాల్సి వచ్చింది. అలాగే భారతదేశం ఎలాంటి సాంకేతికతను వాడింది? ఆర్థికంగా మనం ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి ? ఇలా అనేక విషయాలను సేకరించి స్టడీ చేశాం.
నేడు ప్రపంచ వ్యాప్తంగా వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ సిరీస్‌లను తెరకెక్కించడంలో ముందంజలో ఉంది. ఆ సిరీస్‌లు మన భాషలలోకి కూడా అనువాదమై వస్తున్నాయి ? మరి మనం తెరకెక్కిస్తున్న చిత్రాలు ఈ పోటీని తట్టుకోగలవా ?
ఎక్కడైనా సరే కంటెంట్ అనేదే ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కాంతారా, బాహుబలి, ఆర్‌ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్ లాంటి మన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాయి. వెబ్ సిరీస్‌ల విషయంలో కూడా మనం భవిష్యత్తులో కచ్చితంగా అంతర్జాతీయ మార్కెట్‌కి గట్టి పోటీ ఇస్తాం. అయితే సమయం పడుతుంది. ఓటీటీల వల్ల నేడు మనకు ఇతర దేశాలలో నిర్మితమవుతున్న చిత్రాలను కూడా చూసే అవకాశం లభిస్తోంది.
మీరు నిర్మాతగా ఇప్పటికే కొన్ని చిత్రాలు చేశారు ? భవిష్యత్తులో మీరే ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించే అవకాశం ఉందా ?
ఆ సమయం, సందర్భం వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తాను. ప్రస్తుతం నటనకే సమయం చాలడం లేదు. దాంతో పాటు తీరిక వేళలలో వ్యవసాయం చేయాలి. కానీ నాకు నచ్చిన సబ్జెక్టు దొరికి, ప్రొడ్యూస్ చేయాలన్న ఆలోచన కలిగితే తప్పకుండా చేస్తాను.
“ముఖ్బీర్” అనే వెబ్ సిరీస్ ఒక నవల ఆధారంగా తెరకెక్కింది ? ఆ నవలను మీరు చదివారా?
ఈ సిరీస్ మలయ్ కృష్ణధర్ గారు రచించిన “మిషన్ టు పాకిస్తాన్” (Mission to Pakistan) అనే నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ నవలను చదివాకే నేను ప్రాజెక్టుకి సైన్ చేశాను.
చరిత్రలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా చిత్రాలను నిర్మిస్తున్నప్పుడు, అందులో ఫిక్షన్ ఎలిమెంట్స్‌కు చోటివ్వడం ఎంతవరకు సబబు ? కొన్నిసార్లు విమర్శలు వచ్చే అవకాశం ఉంది కదా?
సృజనశీలత అనేది కూడా ఒక చిత్రానికి అవసరమే. ఒక చిత్రాన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినప్పటికీ.. దానిని ప్రేక్షకుడికి ఆసక్తికరంగా చేరవేయడంలోనే దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. ఎవరైనా ఒక ఎజెండాతో వచ్చి, విమర్శ చేస్తే మనం చేసేదేమీ లేదు. నిజాయతీతో చేసే విమర్శలను మేం ఎల్లప్పుడూ స్వీకరిస్తాం. విమర్శలు చేసే అధికారం అందరికీ ఉంది. అలాగే ప్రశ్నించే అధికారం కూడా ఈ సమాజంలో అందరికీ ఉంది.
“ముఖ్బీర్” దర్శకుడు శివమ్ నాయర్ గురించి ఏదైనా చెప్పండి? ఆయనతో మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ?
శివమ్ నాయర్ (Shivam Nair) ఓ అద్భుతమైన దర్శకుడు. మంచి ఆలోచనా పరుడు. ఆయనలోని పట్టుదల, నిజాయతీ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. గతంలో ‘నామ్ షబానా, స్పెషల్ ఆప్స్’ లాంటి ప్రాజెక్టులకు ఆయన పనిచేశాడు. “ముఖ్బీర్”కు సంబంధించి ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు.. నేను కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు ఆయన మంచి మిత్రుడు.
ఒక సినిమాకి సంబంధించి కొందరు వ్యక్తులు పనిచేస్తున్నారంటే.. అది కేవలం కృత్రిమమైన బంధం అనుకోవడానికి వీలులేదు. సినిమా దర్శకుడు కూడా రైతు లాంటి వాడే. ఒక రైతు వ్యవసాయం చేస్తున్నప్పుడు తనకు తన పరిసరాలతో, పక్షులతో, పాములతో, మట్టితో, మనుషులతో, చెమట చుక్కతో, ఆయాసంతో, ఆకలితో, ప్రేమతో కూడా ఏదో ఒక తెలియని బంధం ఏర్పడిపోతుంది. అలాగే ఒక దర్శకుడు కూడా ఏదైనా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు.. తనతో పనిచేసే ప్రతీ మనిషితోనూ తనకు ఓ ప్రత్యేక బంధం ఉంటుంది. ఈ ప్రక్రియను మనం కాదనడానికి వీలులేదు.
మీరు ఒక వైపు సినిమాలు చేస్తూ కూడా, మరో వైపు వ్యవసాయ రంగం మీద కూడా దృష్టి కేంద్రీకరిస్తున్నారు? మీ టైమ్‌ను మీరేలా మేనేజ్ చేస్తున్నారు ?
నిజం చెప్పాలంటే, బిజీగా ఉన్న మనిషికే టైం ఉంటుంది. ఎందుకంటే, తనకు టైం విలువ తెలుసు కాబట్టి, సాధ్యమైనంత వరకు దానిని సద్వినియోగపరచుకోవడానికే ప్రయత్నిస్తాడు.
మీరు జాతీయ అవార్డు గ్రహీత. మీ నటనా జీవితంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. అయితే అజయ్ దేవగన్ పోషించిన భగత్ సింగ్ పాత్రలా.. చిరంజీవి పోషించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలా మీకు ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా? ఎవరైనా గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రను పోషించే ఛాన్స్ వస్తే ఒప్పుకుంటారా?
ఒక పాత్రలో ఎవరైనా నటించాలంటే.. తనకు ఆ పాత్రను పోషించడానికి ఎంతవరకు అర్హత ఉందో తెలుసుకోవాలి. నటుడనే వాడు మట్టిలా, నీళ్ళలా ఉండాలి. తన శిల్పి ఆలోచనలకు తగినట్లు మారడానికి ప్రయత్నించాలి. నేను ఏ పాత్రనైనా పోషించగలననే నమ్మకం కేవలం నాకు ఉంటేనే సరిపోదు.. దర్శకుడికి కూడా అదే నమ్మకం ఉండాలి.
మన దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో పాటుపడ్డారు కదా ? అందులో మీకు బాగా ఇష్టమైన పోరాట యోధుల గురించి చెప్పండి ?
ఒక మనిషి గురించి చెప్పే కన్నా.. ఒక మనిషి చేసే ప్రయాణాల గురించి చెప్పడం నాకు ఇష్టం. నేను వ్యక్తుల కన్నా, వారి వ్యక్తిత్వాలను ఇష్టపడతాను. ఎందుకంటే వారి వ్యక్తిత్వం వెనుక కనిపించని ఓ ప్రయాణం ఉంటుంది. భగత్ సింగ్, తిలక్.. ఇలా చాలామంది వ్యక్తిత్వాలు నాకు ఇష్టం.
నేటి యువతకు మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు ?
ఒకరికి సలహాలు ఇచ్చేంత పెద్దవాడిని ఏమీ కాదు. అయితే ఒక్క విషయం. ప్రేమించండి.. ప్రేమించబడండి. మీరు బతకడానికి చాలా కారణాలు ఉన్నాయి. మీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది. దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి మీరు కారణం కాకూడదు. అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చేయండి. మీరు నమ్మిందే చేయండి.
నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న మరో రుగ్మత డ్రగ్స్. సెలబిట్రీల దగ్గర నుండి సామాన్య యువత వరకు చాలా వరకు ఆ ఉచ్చులో పడిపోతున్నారు. మీరు కూడా ఒక సామాజిక కార్యకర్తగా అనేక ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొన్నారు కాబట్టి, ఈ సమస్యకు సంబంధించి ఏం సమాధానమిస్తారు ?
ఏమని సమాధానమివ్వాలి. ఎలా సమాధానమివ్వాలి. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది. ఒక చట్టం ఉంది. డ్రగ్స్ మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ? ప్రజల మీదా ? ప్రభుత్వం మీదా? మనం మంచి నాయకులను ఎన్నుకుంటే, వారు మంచి పనులు చేస్తారు. అన్ని మాఫియాలపైనా ఉక్కు పాదం మోపుతారు. జనాలను వాటి బారి నుండి రక్షిస్తారు.
ఒకవేళ మనం చెడ్డవారిని ఎన్నుకుంటే వారు చెడ్డపనులే చేస్తారు. మరి మనం చెడ్డ నాయకులను ఎందుకు ఎన్నుకోవాలి? మంచి వాళ్ళకు, సమాజ హితం కోసం పాటుపడేవారికి ఓటు వేయడం మన బాధ్యత కాదా? చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆపలేని ప్రభుత్వాలకు ఓటు వేసి ఏం లాభం? అలా ఓటు వేశాక, బాధపడితే మాత్రం ఉపయోగమేముంది ?
మీకు తెలుగుభాష మీద మంచి పట్టు ఉంది? అలాగే తెలుగు సాహిత్యం గురించి కూడా మంచి అవగాహన ఉందని పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. మీ అభిమాన తెలుగు రచయితలు ఎవరు?
దేవరకొండ బాల గంగాధర్ తిలక్, ఆత్రేయ, చలం, శ్రీశ్రీ.. ఇలా ఒక్కరని ఎలా చెప్పను? చాలా మంది ఉన్నారు. సినిమా సాహిత్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారంటే ఇష్టం. భాషంటే కేవలం వ్యాకరణం, పద బంధమే కాదు కదా. భాష గర్భంలో ఉన్న భావాలను కూడా మనం అవగతం చేసుకోగలగాలి. అర్థం చేసుకోగలగాలి. అప్పుడే ఆ భాషకు, మనకు ఒక సార్థకత ఏర్పడుతుంది.
మీరు సీనియర్ నటులు. నటనలో అపారమైన అనుభవాన్ని సంపాదించారు. నేటి తరం యువ దర్శకులతో పనిచేస్తున్నప్పుడు మీకు ఏమని అనిపిస్తుంది?
చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ల దిగంతాలు, ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాను. వారు రూపకల్పన చేసే పాత్రలకు నేను అవసరం పడ్డానంటే అది నా అదృష్టమే.
మీకు తెలుగు నేలతో ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పండి ?
తెలుగులో చాలా సినిమాలు చేశాను కాబట్టి, ఇక్కడ కూడా నాకు అందరూ సొంత మనుషుల్లాగే కనిపిస్తారు. కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్ లాంటి వారితో మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రత్యేకించి నాకు గోదావరి తీరం అంటే చాలా ఇష్టం. ఆ ప్రాంతం చుట్టు పక్కల కనిపించే పంట పొలాలు, వాగులు, వంకలు, సెలయేళ్లు, మనుషులు చాలా ఇష్టం.
ఇటీవలే ఎల్ బి శ్రీరామ్ గారు తెలుగులో ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ గారి బయోపిక్‌ను “కవి సామ్రాట్” పేరుతో తెరకెక్కించారు. ఒకవేళ ఎవరైనా దర్శకులు లేదా నిర్మాతలు మహాకవి శ్రీశ్రీ గారి బయోపిక్‌ను తెరకెక్కిస్తూ, ఆ పాత్రకు మిమ్మల్ని సంప్రదిస్తే ఒప్పుకుంటారా?
మంచి మాట. అంత అద్భుతమైన అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు.
Read More : ఓపిక, తెగువ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలం : డైరెక్టర్ వి. జయశంకర్ ఇంటర్వ్యూ
Follow Us