ఓటీటీకి ‘షాడో’ మధుబాబు (Madhu Babu) నవలలు!.. రైట్స్ దక్కించుకున్న దర్శకుడు శరత్ మండవ (Sarath Mandava)?

రచయిత మధుబాబు (Madhu Babu) రాసిన ‘షాడో’ నవలల ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు డైరెక్టర్ శరత్ మండవ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం

నవలల స్ఫూర్తితో సినిమాలు తీయడం తెలుగులో పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. 1970ల కాలంలో నవలలకు ఉన్న క్రేజ్‌తో వాటిని వెండతెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు ఉత్సాహం చూపేవారు. ఈ క్రమంలో నవలల ఆధారంగా తెరకెక్కిన పలు చిత్రాలు మంచి విజయాలు కూడా సాధించడం గమనార్హం. 

నవలల ఆధారంగా సినిమాలు తీసే ట్రెండ్‌కు తెలుగులో పూర్తిగా తెరపడినట్లే కనిపిస్తోంది. కొత్త దర్శకులు సొంత కథలు లేదా అరువు తెచ్చుకున్న రీమేక్ స్టోరీలపై ఆధారపడుతూ సినిమాలు రూపొందిస్తున్నారు. కానీ మన సాహిత్యంలో నుంచి కథలను తీసుకునేందుకు ఫిల్మ్ మేకర్స్ అంతగా ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఒకప్పటి పాపులర్ రచయిత రాసిన నవలలతో వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

సీనియర్ రచయిత మధుబాబు (Madhu Babu) రాసిన ‘షాడో’ నవలల (Shadow Novels)ను దర్శకుడు శరత్ మండవ (Sarath Mandava) దక్కించుకున్నారని తెలిసింది. మధుబాబు రాసిన సుమారు 146 ‘షాడో’ నవలలకు సంబంధించిన మేధోసంపత్తి హక్కుల (ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ - ఐపీఆర్‌)ను శరత్ మండవ సొంతం చేసుకున్నారని సమాచారం. వెబ్ సిరీస్ రూపంలో ఆ నవలలను ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెరకెక్కే తొలి సీజన్‌లోని పలు ఎపిసోడ్‌లకు సౌత్ ఇండియాకు చెందిన పలువురు ప్రముఖ దర్శకులు పని చేయనున్నారని వినికిడి. వీటి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

ఇకపోతే, 1970-90 మధ్యకాలంలో ఇన్వెస్టిగేటివ్ నవలలతో సాహితీ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు మధుబాబు. ‘ఏ బుల్లెట్‌ ఫర్‌ షాడో’, ‘ఏ డెవిల్‌ ఏ స్పై’, ‘ఏంజెల్‌ ఆఫ్‌ డెత్‌’, ‘ఏ జర్నీ టు హెల్‌’, ‘బ్లడీ బోర్డర్‌’, ‘సీఐడీ షాడో’, ‘డర్టీ డెవిల్‌’, ‘డాక్టర్‌ షాడో’, ‘ఫ్లయింగ్‌ బాంబ్‌’, ‘గోల్డెన్ రోబ్‌’, ‘నైట్‌ వాకర్‌’, ‘రెడ్‌ షాడో’, ‘రన్‌ షాడో రన్‌’ తదితర షాడో నవలలతో మధుబాబు పాపులర్ అయ్యారు. అలాగే ఫాంటసీ నవలలతోనూ పాఠకులకు ఆయన కొత్త అనుభూతిని పంచారు. 

ఇక, షాడో నవలల హక్కులు దక్కించుకున్న శరత్‌ మండవ ఎవరో కాదండీ.. రవితేజ హీరోగా వచ్చిన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా ఫలితం నిరాశపర్చడంతో తర్వాత చేసే ప్రాజెక్టులపై శరత్ దృష్టి సారిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే షాడో నవలల హక్కులను ఆయన దక్కించుకోవడం ఆసక్తిగా మారింది. మరి, ఈ వెబ్ సిరీస్‌తోనైనా శరత్ ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాలి. 

Read more: ఇండస్ట్రీకి హిట్ ఇద్దామనుకున్నా.. కానీ కుదర్లేదు: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)

You May Also Like These