Brahmastra Movie Review: 'బ్ర‌హ్మాస్త్రం మొద‌టి భాగం - శివ' రివ్యూ.. అస్త్రాల ప్ర‌పంచంలో అద్భుతాలు

Brahmastra Movie Review : 'బ్ర‌హ్మాస్త్రం' మొద‌టి భాగం - 'శివ' సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా 8,913 స్క్రీన్ల‌లో రిలీజ్ అయింది.

సినిమా - బ్ర‌హ్మాస్త్రం

హీరో - ర‌ణ్‌బీర్ క‌పూర్

హీరోయిన్ -  అలియా భట్

ప్ర‌త్యేక పాత్ర‌లు - అమితాబ్ బ‌చ్చ‌న్, షారూక్ ఖాన్, నాగార్జున‌, మౌనిరాయ్

ద‌ర్శ‌క‌త్వం - ఆయాన్ ముఖ‌ర్జీ

నిర్మాతలు -హిరు యష్ జోహార్, కరణ్ జోహార్, రణబీర్ కపూర్

సంగీతం - ప్రీతమ్

రేటింగ్ - 4 / 5

Brahmastra Movie Review: బాలీవుడ్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన 'బ్ర‌హ్మాస్తం' మొద‌టి భాగం -  'శివ' (Brahmastra) ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో స్టార్ క‌పుల్ ర‌ణ్‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్ హీరో హీరోయిన్లుగా న‌టించారు. 

వీరితో పాటు దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్, షారూక్ ఖాన్, నాగార్జున, మౌనిరాయ్‌లు ప్ర‌త్యేక పాత్ర‌ల్లో క‌నిపించారు.  ప్ర‌ముఖ బాలీవుడ్ దర్శ‌కులు ఆయాన్ ముఖ‌ర్జీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

పాన్ ఇండియా సినిమాగా 'బ్ర‌హ్మాస్త్రం' చిత్రాన్ని ఐదు భాష‌ల్లో రిలీజ్ చేశారు. హిందీతో పాటు తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో బ్ర‌హ్మాస్త్రం ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. 

'బ్ర‌హ్మాస్త్రం' సినిమా ఇండియాలో దాదాపు 5,019 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. ఓవ‌ర్సీస్‌లో దాదాపు 3,894 స్క్రీన్ల‌లో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా 8,913 స్క్రీన్ల‌లో రిలీజ్ అయింది. హిందూ పురాణాల ఆధారంగా 'బ్ర‌హ్మాస్త్రం' సినిమాను ద‌ర్శ‌కుడు ఆయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కించారు. 


'బ్ర‌హ్మాస్త్రం' క‌థ‌
దేవతలకు చెందిన ఓ దివ్య అస్త్రాల క‌థ‌ ఇది. శివ (ర‌ణ్‌బీర్ క‌పూర్) అనే యువ‌కుడు వృత్తి రీత్యా డీజేగా ప‌నిచేస్తుంటాడు. అనుకోకుండా ఓ రోజు తను ఓ ఈవెంట్‌కు వెళ‌తాడు. అక్క‌డ ఇషా (అలియా భ‌ట్‌) అనే అమ్మాయిని చూసిన శివ మొద‌టి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. శివ‌, ఇషాల ప్రేమ ప్ర‌యాణంలో ఓ అనుకోని అద్భుతం జ‌రుగుతుంది. దీంతో శివ‌లో అంతర్లీనంగా ఉన్న అద్భుత శ‌క్తుల గురించి ఇషాకు తెలుస్తుంది. 

శివ అగ్నిని తనలో అంతర్భాగంగా కలిగి ఉంటాడు. అందుకే ఆ అస్త్ర ప్రభావంతో అగ్ని అనేది ఎప్పటికీ శివ‌ను ద‌హించ‌లేదు. అయితే ఈ స‌క‌ల అస్త్రాల‌కు అధిప‌తిగా బ్ర‌హ్మాస్త్రం అనేది ఒకటి ఉంటుంది. దీనిని కొంద‌రు కాపాడుతుంటారు.  

అయితే ఇదే 'బ్రహ్మాస్త్రం' (Brahmastra) మూడు ముక్కల రూపంలో ముగ్గురు వ్యక్తుల వద్ద ఉంటుంది. ఈ మూడు ముక్క‌ల్లో ఒక‌టి సైంటిస్ట్ మోహ‌న్ భార్గ‌వ్ (షారుఖ్‌ఖాన్‌) వద్ద, రెండోది ఆర్టిస్ట్ అనీష్ శెట్టి ( నాగార్జున‌) ద‌గ్గ‌ర ఉంటాయి. మూడో ముక్క‌ ఎక్క‌డ ఉంటుందో తెలియ‌దు. బ్ర‌హ్మాస్త్రాన్ని వ‌శం చేసుకునేందుకు చీక‌టిరాణి (మౌనీరాయ్) ప్ర‌య‌త్నిస్తుంది. ఈమె దేవ్ అనే దుష్ట‌శ‌క్తికి చెందిన మ‌నిషి.

అయితే బ్ర‌హ్మాస్తాన్ని కాపాడే క్ర‌మంలో మోహ‌న్ భార్గ‌వ్‌, అనీష్ శెట్టి పోరాడి మ‌ర‌ణిస్తారు. అప్పుడు ఈ అస్త్రాలకు ఆదిగురువు (అమితాబ్ బ‌చ్చ‌న్) ద్వారా శివ మరిన్ని రహస్యాలను సేకరిస్తాడు. శివ‌ను ఎందుకు దేవ్ మ‌నుషులు టార్గెట్ చేస్తారు? శివ‌, ఇషాలు క‌లిసి వారిని ఎలా అడ్డుకున్నార‌నే విష‌యాలు తెలియాలంటే,  'బ్ర‌హ్మాస్త్రం' సినిమాను థియేట‌ర్‌లో విజువ‌ల్స్ ఎఫెక్ట్స్‌తో చూడాల్సిందే.

ఎవ‌రు ఎలా న‌టించారు?
ఈ సినిమాలో శివ‌గా ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌ట‌న బాగుంది. యువ‌కుడిగా, ప్రేమికుడిగా, వీరుడిగా ర‌ణ్‌బీర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక అలియా స్క్రీన్ మీద ఎంతో అందంగా క‌నిపించారు. ముఖ్యంగా ఓ పోరాట సన్నివేశంలో త‌న ప్రేమికుడి కోసం అలియా చేసిన స‌హాయం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇక షారూక్ ఖాన్, నాగార్జున పాత్ర‌లను 
దర్శకుడు అభిమానుల‌కు న‌చ్చేలా తీర్చిదిద్దారు. ఇక అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. మౌనిరాయ్ విల‌న్ పాత్ర‌లో వెండితెర‌పై అద‌ర‌గొట్టారు. 

ద‌ర్శ‌క‌త్వం
ఆయాన్ ముఖ‌ర్జీ ఈ సినిమాను తెరకెక్కించే ముందు ఎన్నో పురాణాలను స్టడీ చేశారట. అలాగే విజువల్ వండర్‌గా ఈ సినిమా మంచి అనుభూతినే కలిగిస్తుంది. 

ప్ల‌స్ పాయింట్స్
ర‌ణ్‌బీర్ న‌ట‌న‌
గ్రాఫిక్స్
డైలాగులు
పాట‌లు

'బ్రహ్మాస్త్రం' (Brahmastra) చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ బ్యానర్‌లపై తెరకెక్కించారు.  హిరు యష్ జోహార్, కరణ్ జోహార్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, మారిజ్‌కే డెసౌజా మొదలైనవారు నిర్మాతలుగా వ్యవహరించారు. 

ఈ సినిమాను అత్యంత భారీ బ‌డ్జెట్‌ రూ. 410 కోట్ల‌తో తెర‌కెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రీతమ్ అందించా, సినిమాటోగ్రఫీని సుదీప్ ఛటర్జీ, ప్యాట్రిక్ డ్యూరౌక్స్, పంకజ్ కుమార్, మణికందన్, వికాష్ నౌలాఖా హ్యాండిల్ చేశారు. 'బ్ర‌హ్మాస్త్రం' సినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా ఎలాంటి రికార్డులు సృష్టించ‌నుందో? బాలీవుడ్‌కు పూర్వ‌వైభ‌వం బ్ర‌హ్మాస్త్రం సినిమాతో వ‌స్తుందో లేదో చూడాలి.

Read More: Brahmastra : 'బ్ర‌హ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ప్రోమో విడుద‌ల‌.. అంచ‌నాలు మ‌రింత పెంచిన విజువ‌ల్స్

You May Also Like These