బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా ఎదిగారు ప్రభాస్ (Prabhas). చాలాకాలంగా మరో హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ నిరాశపరిచాయి. దాంతో, తన తర్వాతి చిత్రం ఆదిపురుష్ పై భారీ ఆశలు పెట్టుకున్నారాయన. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ దసరా సందర్భంగా విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ టీజర్‌పై అనేక విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రభాస్ లుక్ బాగాలేదని, టీజర్‌లో విజువల్ ఎఫెక్ట్స్ తేలిపోయానని సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అభిమానులను సంతృప్తి పరిచేందుకు చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీఎఫ్‌ఎక్స్, సీజీ వర్క్స్ లో జరిగిన తప్పిదాలను సరిచేసుకునే ప్రయత్నాలను చిత్ర యూనిట్ మొదలుపెట్టనుందని సమాచారం.
టైమ్ పట్టే చాన్స్ ఉండడంతోనే..
ఏకంగా రూ. వంద కోట్ల ఖర్చుతో వీఎఫ్ ఎక్స్ షాట్స్ ను సరి చేస్తోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రం విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆదిపురుష్ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.
ఈ మేరకు పోస్టర్స్, టీజర్‌లో విడుదల తేదీని వెల్లడించింది. కానీ, ఇప్పుడు వీఎఫ్ ఎక్స్ తప్పులు సరి చేసేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో సంక్రాంతికి బదులు వేసవిలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. చిత్రం విడుదల వాయిదా పడుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర బృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. చాలాకాలంగా ప్రభాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది ఈ వార్త.
Follow Us