తమిళ నటుడు అరవింద్ స్వామి (Arvind Swamy) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడు. 'దళపతి ' సినిమాలో గెస్ట్ రోల్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అరవింద్.. ఆ తర్వాత రోజా, బొంబాయి సినిమాలతో ఎంతో మందికి అభిమాన హీరో అయ్యారు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషలలో కూడా నటించారు. తొంభైలలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. అరవింద్ స్వామి పుట్టిన రోజు (జూన్ 18) సందర్భంగా పింక్ విల్లా అందిస్తున్న స్పెషల్ స్టోరి..
పాకెట్ మనీ కోసం యాడ్స్ చేసిన అరవింద్(Arvind Swamy)
అరవింద్ స్వామి తండ్రి వి.డి. స్వామి ప్రముఖ డాక్టర్. వి.డి స్వామి చెన్నైలోని శంకర నేత్రాలయం హాస్పిటల్ అధినేత. తల్లి ప్రముఖ భరతనాట్యం నృత్యకారిణి వసంత స్వామి. అరవింద్ స్వామి 1970 జూన్ 18న జన్మించారు. డిగ్రీ వరకు అరవింద్ మద్రాసులో చదివారు. ఆ తర్వాత అమెరికాలో ఇంటర్నేషనల్ బిజినెస్‌లో మాస్టర్స్ చేశారు.
అరవింద్ స్వామి తొలుత డాక్టర్ కావాలనుకున్నారట. దీంతో పాకెట్ మనీ కోసం అప్పడప్పుడు యాడ్స్ చేసేవారట. అదే ఆయన జీవితాన్ని మార్చింది. ఓ వ్యాపార ప్రకటనలో అరవింద్ స్వామిని దర్శకుడు మణిరత్నం చూశారు. వెంటనే అతనిని పిలిపించి తన సినిమాలో నటించమని కోరారు. ఆ విధంగా 1991లో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు అరవింద్ స్వామి. 'దళపతి ' చిత్రంలో కలెక్టర్ పాత్రలో అరవింద్ అద్భుతంగా నటించారు. ఇక ఆ తర్వాత, సినిమా ఆఫర్లతో బిజీ హీరోగా మారారు.
అరవింద్ (Arvind Swamy) హీరోగా నటించిన మొదటి సినిమా 'రోజా '. ఈ సినిమా విడుదలై రికార్డులు సృష్టించింది. 'వినరా వినరా.. దేశం మనదేరా ' అంటూ సాగిన పాట ఇప్పటికీ ఎవరికైనా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 'నా చెలి రోజావే ' అంటూ సాగే పాటలో అరవింద్ నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఈ సినిమాతో అరవింద్‌కు లేడీస్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది.
'రోజా ' తర్వాత .. 'బొంబాయి ' సినిమాతో అరవింద్ స్వామి పాన్ ఇండియా లెవల్‌లో మంచి పేరు సంపాదించారు. రోజా, బొంబాయి.. ఈ ,రెండు సినిమాలకు మణిరత్నం దర్శకత్వం వహించడం విశేషం.
బొంబాయికి అవార్డుల పంట
మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి నటించిన 'బొంబాయి' సినిమాకు అవార్డుల మీద అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడుగా అరవింద్ సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు సైతం అందుకున్నారు.
ఇక దేశ, విదేశాల్లో 'బొంబాయి' సినిమాకు లెక్కలేనన్ని పురస్కారాలు వచ్చాయి. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా ఈ సినిమా నర్గీస్ దత్ అవార్డును కూడా గెలుచుకుంది. ముఖ్యంగా, అరవింద్ స్వామి నటనకు విమర్శకుల ప్రశంసలు కూడ లభించాయి.
'బొంబాయి' సినిమాకు రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, నాలుగు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. ఎడిన్ బర్గ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'గాలా' అవార్డు కూడా లభించింది. అమెరికాలో నిర్వహించిన పొలిటికల్ ఫిల్మ్ సొసైటీ అవార్డ్స్‌లో ప్రత్యేక బహుమతిని కూడా ఈ సినిమా సాధించింది. జెరూసలేం ఫిల్ం ఫెస్టివల్‌లో 'విం వాన్ లీర్ ఇన్ స్పిరిట్ ఫర్ ఫ్రీడమ్ అవార్డు'ను మణిరత్నం అందుకున్నారు.
అరవింద్ స్వామి (Arvind Swamy) తెలుగులో కూడా 'మౌనం' అనే ఓ సినిమాలో నటించారు. సి.ఉమామహేశ్వరరావు ఈ సినిమాకి దర్శకుడు. అలాగే మిన్సారా కనవు అనే తమిళ సినిమాలో కూడా అరవింద్ నటించారు. అదే సినిమా 'మెరుపు కలలు' పేరుతో తెలుగులో డబ్ చేయబడి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం విశేషం. ఆ తర్వాత అరవింద్ తమిళం, మళయాళం, హిందీ భాషల్లో నటించిన చిత్రాలు ఫ్లాపులుగా మిగిలాయి.
ఆ తర్వాత అరవింద్ స్వామి చాలా సంవత్సరాలు సినిమాలకు దూరమయ్యారు. టాలెంట్ మాక్సిమస్ అనే కంపెనీకి సీఈఓగా కొనసాగారు. వ్యాపారవేత్తగా మంచి స్థాయికి చేరుకున్నారు.
రామ్ చరణ్ సినిమా 2016లో తీసిన 'ధృవ' సినిమాలో విలన్‌గా అరవింద్ స్వామి రీ ఎంట్రీ ఇచ్చారు. 'తని ఒరువన్' అనే తమిళ చిత్రానికి రీమేక్ ఈ చిత్రం.
అరవింద్ కుటుంబం
మన దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరైన అపర్ణ ముఖర్జీని 2012 లో అరవింద్ స్వామి రెండో పెళ్లి చేసుకున్నారు. ఇతర దేశాల్లో కూడా అపర్ణ ముఖర్జీ న్యాయవాదిగా కేసులు వాదిస్తారట. అరవింద్ స్వామికి చెందిన కంపెనీలకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు అపర్ణ.
అరవింద్ మొదట గాయత్రీ రామమూర్తిని వివాహం చేసుకున్నారు. వీరి కూతురు అధిర, కుమారుడు రుద్ర. 2010లో గాయత్రికి విడాకులు ఇచ్చారు.
అరవింద్ స్వామి ప్లే బ్యాక్ సింగర్ కూడా. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా కొన్ని ప్రాజెక్టులకు వర్క్ చేశారు. 'ది లయన్ కింగ్' ఇంగ్లీష్ సినిమాకు తమిళ్‌లో డబ్బింగ్ చెప్పారు. 'దిల్ సే' సినిమాలో షారూక్ ఖాన్ వాయిస్‌కు.. తమిళ్‌లో డబ్బింగ్ చెప్పింది అరవింద్ స్వామినే. అలాగే ఓ టీవీ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు. అరవింద్ స్వామికి నటన అంటే ఎంతో ఇష్టం. అలాగే ఆయనకు దర్శకత్వం చేయాలనే ఆశ కూడా ఉండేదట.
Follow Us