వెబ్ సిరీస్ : అహ నా పెళ్ళంట
నటీనటులు : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి
దర్శకత్వం : సంజీవ్ రెడ్డి
సంగీతం : జుడా శాండీ
నిర్మాతలు : సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా
విడుదల తేదీ : నవంబర్ 17, 2022
ఓటీటీ : జీ 5
ఎపిసోడ్స్ : 8
రేటింగ్ : 3 / 5
యంగ్ హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun) ఓటీటీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఉయ్యాల జంపాలా సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన రాజ్‌తరుణ్.. యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయనకు సరైన హిట్ దక్కలేదు. ఇటీవల పలు సినిమాలతో పలకరించినా అవి అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదు. దాంతో రాజ్ తరుణ్ వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్‌తో కలిసి ఆయన నటించిన వెబ్‌సిరీస్ ‘అహ నా పెళ్లంట’. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్ ‘జీ5’ (Zee5)లో గురువారం విడుదలైంది.
కథ ఏంటంటే?
శ్రీను (రాజ్ తరుణ్) స్కూల్‌లో చదువుతున్న సమయంలో జరిగిన చిన్న సంఘటనతో అమ్మాయిల వైపు కన్నెత్తి చూడనని, మాట్లాడనని తల్లి (ఆమని)కి మాట ఇస్తాడు. పెళ్లి వరకు హనుమంతుడిలా, పెళ్లి తర్వాత రాముడిలా ఉంటానని చెబుతాడు. పెళ్లి జరిగే వరకు అలాగే ఉంటాడు కూడా! అమ్మానాన్నలతో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో చాలా సంబంధాలు చూసి ఒకటి ఫైనల్ చేస్తారు. సరిగ్గా పెళ్లి రోజున అమ్మాయి కనిపించదు. ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోతున్నానని లేఖ రాసి వెళ్లిపోతుంది. పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోవడంతో శ్రీను ఫ్యామిలీ పరువు పోతుంది. అందుకు కారణం మహా (శివానీ రాజశేఖర్) అని తెలుస్తుంది. ఆ అమ్మాయి, ఆమె కుటుంబానికి కూడా తాను అనుభవించిన బాధ తెలియాలని సరిగ్గా పెళ్లికి ముందు రోజు ఆమెను కిడ్నాప్ చేస్తాడు శ్రీను. ఆ తర్వాత ఏమైంది? శ్రీను ఫ్లాట్‌లో ఉండటానికి మహా ఎందుకు వచ్చింది? వాళ్లిద్దరూ ఎప్పుడు, ఎలా ప్రేమలో పడ్డారు? తనను కిడ్నాప్ చేసింది శ్రీను అని ఆమెకు తెలిసిందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే?
'అహ నా పెళ్ళంట' సిరీస్ కామెడీ నేపథ్యంతో మొదలవుతుంది. కొంత సమయం చూసేసరికి మన వెబ్‌సిరీస్ చూస్తున్నామని మర్చిపోతాం. సినిమా తరహాలో సరదాసరదాగా, స్పీడ్‌గా సాగుతున్న కథ, రాజ్‌తరుణ్ ఎంటర్‌టైనింగ్ ఎనర్జీ దానికి ప్రధాన కారణం. కామెడీ, మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. రెండో ఎపిసోడ్ మాత్రం కాస్త రెగ్యులర్ వెబ్ సిరీస్‌లాగే అనిపిస్తుంది.
మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌లో తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్‌లో రెండు, మూడు ఎపిసోడ్స్‌లో కథ కాస్త నెమ్మదించడంతో బోర్ అనిపిస్తుంది. అయితే, రాజ్‌తరుణ్ ఫ్లాట్‌లోకి శివానీ రాజశేఖర్ రావడం దగ్గర నుంచి మరోసారి ఆసక్తి పెరుగుతుంది. రాజ్‌తరుణ్ తండ్రిగా నటించిన హర్షవర్దన్.. సిరీస్ బిగినింగ్ నుంచి నవ్వులు పూయిస్తుంది. రాజ్‌తరుణ్ అమ్మాయిలను చూసిన ప్రతిసారీ దెబ్బ తగలడం అనే కాన్సెప్ట్ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. సినిమాలకు ఉండే టైమ్ కారణంగా ప్రతి సీన్‌ను వివరంగా చూపించే అవకాశం ఉండదు. వెబ్ సిరీస్ కావడంతో ప్రతి సన్నివేశాన్ని ఎక్కువ సేపు చూపించడానికి ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. సరిసీ మొత్తం సరదాసరదాగా ఏం జరుగుతుందో అనే ఆసక్తితో ఉంటుంది. అయితే చివరి ఎపిసోడ్‌లో ఎమోషనల్ సీన్లు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. కథతోపాటు జరిగే పాటలు బాగున్నాయి. కామెడీ, లవ్, ఎమోషన్స్... అన్నీ కలగలిసిన సిరీస్ ఇది.
ఎవరెలా నటించారంటే ?
రాజ్ తరుణ్‌కు సరిగ్గా సరిపోయే క్యారెక్టర్ ఇది. ఆయన కామెడీ టైమింగ్, ఎమోషన్స్ క్యారెక్టర్‌కు ప్లస్ అయ్యాయి. తల్లి, తండ్రి దగ్గర తను చేసిన తప్పు తెలిస్తే ఎలా అని టెన్షన్ పడే సన్నివేశాల్లో రాజ్ తరుణ్ నటన బావుంది. అబ్బాయిలను డామినేట్ చేసే అమ్మాయి క్యారెక్టర్‌లో శివాని రాజశేఖర్ నటన ఆకట్టుకుంటుంది. ప్రేమలో పడిన తర్వాత, సిరీస్ చివరిలో వచ్చే ఎమోషనల్ సీన్లలో ఆమె బాగా నటించారు. ఆమని, పోసాని కృష్ణమురళి, హర్షవర్ధన్ ఎటువంటి క్యారెక్టర్లు ఇచ్చినా వాటికి కచ్చితంగా న్యాయం చేస్తారని మరోసారి నిరూపించుకున్నారు.
రెండు మూడు సన్నివేశాల్లోనే కనిపించినా రాజ్ కుమార్ కసిరెడ్డి నటన బాగుంది. గోదావరి యాసతో ఎంటర్‌టైన్ చేశారు. పెళ్లికి ముందు వెళ్లిపోయిన అమ్మాయిగా దీపాలి శర్మ, హీరోతో పెళ్లికి ఓకే చెప్పిన అమ్మాయిగా కృతికా సింగ్, పెళ్లిళ్ల పేరయ్యగా భద్రమ్, ఇతర పాత్రల్లో రఘు కారుమంచి, తాగుబోతు రమేష్ తదితరులు వాళ్ల పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
ప్లస్ పాయింట్స్ : రాజ్‌తరుణ్ (Raj Tarun), శివానీ రాజశేఖర్ నటన, కామెడీ
మైనస్ పాయింట్స్ : కొన్ని ఎపిసోడ్స్ నెమ్మదిగా సాగడం
ఒక్క మాటలో.. లవ్ + కామెడీ ఎంటర్‌టైనర్ ‘అహ నా పెళ్లంట’
Read More : EXCLUSIVE: "నటనలో సెంచరీలు ఉండాలే కానీ.. బౌండరీలు ఎందుకు ?" : రాజ్ తరుణ్ (Raj Tarun)
Follow Us