విరాట పర్వం (Virata Parvam).. ప్రస్తుతం టాలీవుడ్ కళ్లు అన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంపై నిర్మాతలకు భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు ప్రధానమైన కారణం.. సబ్జెక్టు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
తెలంగాణ జీవితాలకు సంబంధించిన ఈ సినిమాకు, ఒక తెలంగాణ దర్శకుడు డైరెక్షన్ చేయడం ఒక ప్రత్యేకత అయితే.. ఈ సినిమాలోని పాటలకు ఇప్పటికే సోషల్ మీడియాలో సినీ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా..
కథా నేపథ్యం
'విరాట పర్వం' (Virata Parvam) సినిమా కథను దర్శకుడు తను చిన్నతనంలో చూసిన వివిధ సంఘటనల ఆధారంగా రాసుకున్నారు. 1990 ప్రాంతంలో తెలంగాణలో ప్రారంభమైన ఓ నక్సలైట్ ఉద్యమం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
ప్రేమకథా చిత్రం
ఈ సినిమా కథా నేపథ్యం నక్సలిజం అనే అంశాన్ని తీసుకున్నప్పటికీ, ఇదే సినిమా ఓ మంచి ప్రేమకథను కూడా ప్రేక్షకులకు అందిస్తుందని డైరెక్టర్ తెలిపారు. ఓ విప్లవ గాయకుడు రాసిన గీతాలకు ప్రభావితమై, ఆయన అభిమానిగా, తర్వాత ప్రేయసిగా మారే వెన్నెల పాత్రను పోషించే అవకాశం నటి సాయిపల్లవికి ఈ సినిమాలో దక్కడం విశేషం.
గోపీచంద్ వర్సెస్ రానా దగ్గుబాటి
'విరాటపర్వం' (Virata Parvam) చిత్రంలో కామ్రేడ్ రవిశంకర్ అలియాస్ రవన్న పాత్రకు తొలుత గోపీచంద్‌ను తీసుకుంటే బాగుంటుందని దర్శకుడు వేణు అనుకున్నారట. అయితే ఆఖరికి రానా దగ్గుబాటిని ఈ క్యారెక్టర్‌కు ఫైనలైజ్ చేశారు. ఈ పాత్ర కోసం రానా బరువు కూడా తగ్గడం గమనార్హం.
కామ్రేడ్ భారతక్కగా ప్రియమణి
ఈ సినిమాలో కామ్రేడ్ భారతక్క పాత్రలో నటి ప్రియమణి నటించడం విశేషం.
ముఖ్యమైన పాత్రలో నందితా దాస్
విరాట పర్వం చిత్రంలో కథను మలుపు తిప్పే ఓ కీలకమైన పాత్ర కోసం తొలుత టబుని అనుకున్నారట. కానీ తర్వాత అదే పాత్ర జాతీయ అవార్డు గ్రహీత నందితా దాస్‌ను వరించింది. నందితా దాస్‌కు ఇది రెండవ తెలుగు చిత్రం. గతంలో ఆమె కమ్లి అనే ఓ అవార్డ్ విన్నింగ్ తెలుగు చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు.
విదేశీ సినిమాటోగ్రఫర్‌తో ఒప్పందం
మహానటి చిత్రానికి ఛాయాగ్రహణ బాధ్యతలను అందించిన Dani Sanchez-Lopez (డానీ సాంచెజ్ లోపేజ్) అనే విదేశీ కొరియోగ్రఫర్ ఈ చిత్రానికి కూడా కెమెరామెన్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. అలాగే మన తెలుగు కెమెరామ్యాన్ దివాకర్ మణి కూడా ఈ సినిమాలో కొంతభాగానికి వర్క్ చేశారు.
తొలుత గుమ్మడి జయక్రిష్ణ ఈ సినిమాకి ఛాయాగ్రహణ బాధ్యతలు స్వీకరించినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మధ్యలోనే తప్పుకోవడం జరిగింది. దీంతో డానీకి ఆ అవకాశం దక్కింది.
అడవులలో షూటింగ్
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు వరంగల్‌లోని పర్కల్, వికారాబాద్, కేరళ అడవులలో జరగడం విశేషం.
సంగీత దర్శకుడిగా సురేష్ బొబ్బిలి
మహబూబాబాద్ కుర్రాడైన సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి చాలా మంచి పాటలను అందించారని అంటున్నారు. గతంలో నీది నాది ఒకే కథ, తిప్పరా మీసం, జార్జి రెడ్డి, గువ్వ గోరింక లాంటి సినిమాలకు సురేష్ సంగీతాన్ని అందించారు.
నాగాదారిలో.. గీతానికి ప్రత్యేక గుర్తింపు
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రాసిన నాగాదారిలో గేయం సోషల్ మీడియాలో మంచి వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ గేయాన్ని వరం రాయగా, తెలంగాణ జానపద కళాకారులు ద్యావరి నాగేంద్రరెడ్డి, సనపతి భరద్వాజ పాత్రుడు గీతాన్ని ఆలపించారు. అలాగే జిలుకర శ్రీనివాస్ .. ఛలో ఛలో.. అంటూ సాగే వారియర్ సాంగ్ రాశారు. మిగతా రెండు పాటలను చంద్రబోస్ రాశారు.
'విరాటపర్వం' దర్శకుడి గురించి
'విరాటపర్వం' (Virata Parvam) దర్శకుడు వేణు ఊడుగుల 'నీది నాది ఒకే కథ' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. వరంగల్ గ్రామీణ జిల్లా, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామం ఈయన సొంతూరు. చదువంటే ఆసక్తి లేని వేణు తొలుత బస్ కండక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. డైరెక్టర్ మదన్ వద్ద తొలుత అసిస్టెంటుగా చేశాడు. తర్వాత 'జై బోలో తెలంగాణ' చిత్రానికి రచనా సహకారం అందించారు.
Follow Us