కత్రినా కైఫ్ (Katrina Kaif).. ఈ పేరు ఇండియాలోనే చాలా పాపులర్. బాలీవుడ్ సామ్రాజ్యాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఏలిన నటీమణి కత్రినా. గత సంవత్సరమే నటుడు విక్కీ కౌశల్‌ని పెళ్లి చేసుకొని, ఎట్టకేలకు తాను కూడా ఓ ఇంటికి ఇల్లాలైంది ఈ స్టన్నింగ్ బ్యూటీ. అలాగే తరచూ ఏదో ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం ఈమెకు అలవాటు.
సింగ్ ఈజ్ కింగ్, న్యూయార్క్, ఏక్ థా టైగర్, జబ్ తక్ హై జాన్.. ఇలా చెప్పకుంటూ పోతే ఆమె నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రాలు ఎన్నో. దాదాపు బాలీవుడ్‌లోని అగ్రహీరోలందరితోనూ కత్రినా నటించింది.
ఈ ఏడాదితో 39 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ అందాల తార గురించి పెద్దగా ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనమూ తెలుసుకుందాం.
తల్లి బ్రిటీషర్, తండ్రి కాశ్మీరీ
కత్రినా కైఫ్ (Katrina Kaif) బ్రిటీష్ హాంగ్ కాంగ్‌లో పుట్టింది. అలాగే లండన్‌లో పెరిగింది. కత్రినా తల్లి సుజాన్ ఓ బ్రిటీష్ లాయర్. అలాగే తండ్రి మహ్మద్ కైఫ్ ఓ బిజినెస్ మ్యాన్. సుజాన్‌కు కలిగిన ఏడుగురు సంతానంలో కత్రినా కూడా ఒకరు. ఈమెకు సెబాస్టియన్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. కత్రినా బాల్యంలో ఉన్నప్పుడే, ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.
తొలి చిత్రం అట్టర్ ఫ్లాప్
లండన్ బిజినెస్ వీక్‌లో మోడల్‌గా కత్రినా (Katrina Kaif) ఫోటోలు పబ్లిష్ అయ్యాక, ఆమెకు బాలీవుడ్ నుండి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన తొలి చిత్రం 'బూమ్' ఫ్లాప్ అవ్వడంతో ఆమె కెరీర్ దాదాపుగా ముగిసిపోయినట్టే అనుకున్నారు అంతా.
తెలుగులో అత్యధిక పారితోషికం
దాదాపు బాలీవుడ్‌లో తన కెరీర్ ముగిసిపోతుంది అనుకున్న సమయంలోనే కత్రినా కైఫ్‌కి తెలుగు సినిమా 'మల్లీశ్వరి'లో ఛాన్స్ వచ్చింది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో కథానాయికకు దాదాపు రూ. 78 లక్షలను పారితోషికంగా చెల్లించారట నిర్మాతలు. ఒక కొత్త కథానాయికకు ఆ రోజులలో అంత మొత్తం చెల్లించడమంటే అది రికార్డే.
దక్షిణాదిలో మూడు సినిమాలే
కత్రినా కైఫ్ (Katrina Kaif) తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు చిత్రాలలో నటించాక.. మలయాళంలో బలరామ్ వర్సెస్ తారాదాస్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం తర్వాత ఆమె ఏ ఇతర దక్షిణాది చిత్రంలోనూ నటించకపోవడం గమనార్హం.
ఐటం సాంగ్స్‌తో ప్రత్యేక గుర్తింపు
కత్రినా కైఫ్ (Katrina Kaif) అనేక సూపర్ హిట్ హిందీ చిత్రాలలో నటించినప్పటికీ కూడా, ఐటం సాంగ్స్ ఆమెకు మంచిపేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా చికినీ చమేలి (అగ్నిపథ్), షీలా కీ జవానీ (బొంబాయి టాకీస్) మొదలైన పాటలలో కత్రినా పెర్ఫార్మెన్స్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు.
అవార్డులు రివార్డులు
కత్రినాకు పురస్కారాలు కొత్తేమీ కాదు. 2008 లో ఐఫా సంస్థ కత్రినాను స్టైల్ దివా ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. అలాగే రొమాంటిక్ సినిమాల్లోని నటనకు ప్రత్యేకంగా అందించే ఉత్తమ కథానాయిక పురస్కారాన్ని 2012 లో 'జబ్ తక్ హై జాన్' సినిమాకి గాను బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా అందుకున్నారు కత్రినా. అలాగే ఇప్పటి వరకూ నాలుగు సార్లు స్టార్ స్క్రీన్ అవార్డులు, రెండు సార్లు స్టార్ గిల్డ్ అవార్డులు, మరో నాలుగు సార్లు స్టార్ డస్ట్ అవార్డులు, జీ సినీ అవార్డులను అందుకున్నారామె.
సల్మాన్‌తో డేటింగ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో కత్రినా (Katrina Kaif) డేటింగ్ చేస్తోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ జంట తర్వాత విడిపోయారు. సల్మాన్ తనకు కొన్ని విషయాలలో ప్రేరణను అందించారని కూడా కత్రినా పలుమార్లు మీడియా ఇంటర్వ్యూలలో తెలిపారు.
పర్సనల్ లైఫ్
కత్రినా లైఫ్‌లోకి నటుడు రణ్‌బీర్ కపూర్ వచ్చారని.. వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరు కొన్ని ఫంక్షన్లకు కలిసే వెళ్లేవారు. దీంతో వీరి రిలేషన్ షిప్ పై మీడియాలో అనేక కథనాలు హల్చల్ చేసేవి. అయితే తన ప్రైవేట్ లైఫ్ గురించి ఇతరులకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని కత్రినా పలుమార్లు ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం గమనార్హం
విక్కీ కౌశల్‌తో వివాహం
కత్రినా వివాహం నటుడు విక్కీ కౌశల్‌తో 9 డిసెంబర్ 2021 తేదిన రాజస్థాన్‌లో జరగడం విశేషం. పెళ్లయ్యాక కూడా కత్రినా సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఫోన్ బూత్, మెర్రీ క్రిస్మస్, టైగర్ 3 చిత్రాలలో ఆమె నటిస్తున్నారు. ఈమె నటించిన ఆఖరి చిత్రం సూర్యవంశీ 2021 లో విడుదలైంది.
ఏదేమైనా... నలభై ఏళ్ళకు చేరువవుతున్నా కూడా.. కత్రినా ఇంకా గ్లామర్ పాత్రలను చేస్తూ, మరింతమంది అభిమానులను పొందుతున్నారనడంలో సందేహం లేదు.
Read More: హీరో గోపీచంద్ జన్మదినం : తండ్రి విప్లవ చిత్రాల దర్శకుడు.. కొడుకు కమర్షియల్ హీరో !
Follow Us