పక్కా కమర్షియల్ (Pakka Commercial).. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. యూవీ క్రియేషన్స్, జీ2ఏ పిక్చర్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు నిర్మించిన ఈ సినిమా జులై 1 తేదిన విడుదల అవుతోంది. ఇటీవలే ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా విచ్చేశారు. కోర్ట్‌రూమ్ యాక్షన్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బన్నీ వాస్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టడం గమనార్హం.
ఈ క్రమంలో మనం కూడా ఈ సినిమా గురించి టాప్ 10 విశేషాలను తెలుసుకుందాం..
సాయిపల్లవి, ఇషా రెబ్బా పేర్లు..
తొలుత ఈ సినిమాలో కథానాయిక పాత్ర ఎంపిక గురించి నిర్మాతలు తర్జనభర్జనలు పడ్డప్పుడు.. సాయిపల్లవి, ఇషా రెబ్బా లాంటి వారి పేర్లు లిస్టులోకి వచ్చాయట. కానీ ఆఖరికి అదే పాత్ర రాశిఖన్నాని వరించడం విశేషం.
గోపీచంద్‌తో (Gopichand) రాశిఖన్నా చేస్తున్న మూడో చిత్రం
నటుడు గోపీచంద్‌తో గతంలో రాశిఖన్నా జిల్, ఆక్సిజన్ లాంటి చిత్రాలలో కలిసి నటించారు. ఇప్పుడు పక్కా కమర్షియల్‌లో కూడా నటిస్తున్నారు. వీరు గతంలో కలిసి నటించిన చిత్రాలు ఓ మాదిరి కలెక్షన్లను మాత్రమే రాబట్టాయి. ఈ క్రమంలో ఈ జంటను మళ్లీ ప్రేక్షకులు, సినీ అభిమానులు ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి.
యాక్షన్ కామెడీ వర్కవుట్ అవుతుందా?
రొమాంటిక్ కామెడీ చిత్రాలు తీయడంలో దర్శకుడు మారుతిది ఓ ప్రత్యేక స్టైల్. గతంలో భలేభలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు సినిమాలతో ఆ జానర్‌లో తనది అందెవేసిన చేయి అని మారుతి నిరూపించుకున్నాడు. మరి ఈయన తొలిసారిగా తీస్తున్న యాక్షన్ కామెడీ చిత్రం మారుతికి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.
జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అదుర్స్
ఈ మలయాళీ కుర్రాడు ఇప్పటికే తెలుగులో టాక్సీవాలా, చావు కబురు చల్లగా లాంటి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. రణం, క్వీన్, మాన్సూన్ మాంగోస్ లాంటి సినిమాలు మలయాళంతో ఇతనికి మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం పక్కా కమర్షియల్ (Pakka Commercial) సినిమాకి కూడా జేక్స్ మంచి ఖతర్నాక్ సంగీతాన్ని అందించాడు.
టైటిల్ సాంగ్ రాసింది స్వర్గీయ సిరివెన్నెల
ప్రస్తుతం 'పక్కా కమర్షియల్' (Pakka Commercial) టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. అయితే ఇంతగా విజయవంతమైన పాటను రాసిన గేయరచయిత ఈ రోజు మన మధ్య లేకపోవడం విషాదభరితం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. పదాల అల్లికలతో ఆయన చేసే ప్రయోగాలు ఎన్నో. పాటలో కొత్త భావం ఉట్టిపడేలా ఆయన వ్రాసే చరణాలు ఉంటాయి.
ఎస్బీ ఉద్దవ్
ఎస్బీ ఉద్దవ్‌కి ఎడిటింగ్‌లో మంచి అనుభవం ఉంది. గతంలో మారుతితో కలిసి ఈయన ఈ రోజుల్లో, భలే భలే మగాడివోయ్, ప్రేమకథాచిత్రం లాంటి సినిమాలకు పనిచేశారు. ఈయనే మళ్లీ పక్కా కమర్షియల్ చిత్రానికి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కర్మ్ చావ్లా కెమెరా పనితనం సూపర్
కన్నడంలో అవనే శ్రీమన్నారాయణ, ఉలిదవరు కండంతే లాంటి పాపులర్ సినిమాలకు పనిచేసిన కర్మ్ చావ్లా తెలుగు చిత్రం పక్కా కమర్షియల్‌కు తొలిసారిగా కెమెరామ్యాన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ట్రైలర్‌లో ఈ ఛాయాగ్రహకుడి పనితనాన్ని మనం చూడచ్చు. కొన్ని సన్నివేశాలను అందంగా, అద్భుతంగా తీశాడు.
సాంగ్స్ మామూలుగా లేవుగా..
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాటల గురించి. సిరివెన్నెల వ్రాసిన టైటిల్ సాంగ్‌ని సంగీత దర్శకుడితో పాటు గాయకుడు హేమచంద్ర పాడడం విశేషం. అలాగే భాస్కరభట్ల రాసిన గీతం 'అదిరింది మాస్టారు'ను శ్రీకృష్ణ, సాహితీ చాగంటి ఆలపించారు. కృష్ణకాంత్ వ్రాసిన 'అందాలరాశి' పాటను శ్రీచరణ్, రమ్యబెహరా ఆలపించారు. కృష్ణకాంత్ వ్రాసిన మరో గీతం 'లెహంగాలో లేడీ'ని విజయ్ ప్రకాష్, ఎంఎం శ్రీలేఖ ఆలపించడం విశేషం.
రెండు పెద్ద సంస్థలు కలిసి ..
యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ కలిసి ఈ పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమాని తెరకెక్కిస్తున్నాయి. గతంలో గీతా ఆర్ట్స్‌గా చెలామణీ అయిన సంస్థే ప్రస్తుతం జీఏ2 పిక్చర్స్‌గా రూపాంతరం చెందడం విశేషం.
ఓటీటీ రైట్స్ వీరికే
పక్కా కమర్షియల్ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్‌తో పాటు ఆహా ఓటీటీ కూడా దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదలైన అయిదు వారాల తర్వాత, ఈ చిత్రం ఓటీటీలో సినీ అభిమానులను కనువిందు చేస్తుందని టాక్.
ఏదేమైనా, ఒక డిఫరెంట్ టీమ్‌తో జనాల ముందుకు వస్తున్న, పక్కా కమర్షియల్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో తెలుసుకోవాలంటే, రిలీజ్ వరకూ వేచిచూడాల్సిందే !
Read More: చిరంజీవితో 'మారుతి' సినిమా .. పక్కా కమర్షియల్ (Pakka Commerical) దర్శకుడికి చిరు ప్రామిస్ !
Follow Us