టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). పరిశ్రమలో కథా రచయితగా తన కెరీర్ ప్రారంభించిన త్రివిక్రమ్ .. దర్శకుడిగా బ్లాక్ బాస్టర్ హిట్లను తెరకెక్కించారు. చిన్న చిన్న పదాలతో అద్భుతమైన సంభాషణలు రాయగలిగే సత్తా ఉన్న దర్శకుడు ఈయన.
ఒకవైపు మాటల రచయితగానూ, మరో వైపు దర్శకుడిగానూ భిన్న పాత్రలు పోషిస్తూ..సెల్యూలాయిడ్ మీద అద్భుతాలు చేస్తున్న మేధావి త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా పింక్ విల్లా స్పెషల్ స్టోరీ మీకోసం.
ఎమ్మెస్సీలో గోల్డ్ మెడలిస్ట్
త్రివిక్రమ్ శ్రీనివాస్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 1971 నవంబర్ 7 తేదీన జన్మించారు. ఎమ్మెస్సీ (న్యూక్లియర్ ఫిజిక్స్)లో గోల్డ్ మెడల్ సంపాదించారు. కొంతకాలం విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పారు. ఆ తర్వాత సాహిత్యంపై మీద ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు.
సాహిత్యం అంటే ప్రేమ
సాహిత్యం అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)కు ఎంతో ఇష్టం. అదే ఇష్టం ఆయనను సినిమాల వైపు కూడా నడిపించింది. అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చిన త్రివిక్రమ్, పోసాని కృష్ణమురళి వద్ద సహాయకుడిగా పని చేశారు. నటుడు సునీల్‌తో కలిసి ఒకే గదిలో అద్దెకు ఉండేవారు.
కమెడియన్ కమ్ హీరో సునీల్ త్రివిక్రమ్‌ను తన జీవితంలో ఓ మరిచిపోలేని వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు. తనను ఎంతగానో ప్రభావితం చేసిన వ్యక్తిగా కూడా చెబుతుంటారు. ఒక ప్రముఖ వారపత్రికలో శ్రీనివాస్ రాసిన "ది రోడ్" అనే కథ ప్రచురితమైంది. ఆ కథకు మంచి గుర్తింపు లభించింది.
1999 లో విడుదలైన "స్వయంవరం" సినిమా ద్వారా మాటల రచయితగా త్రివిక్రమ్ సినీ రంగ ప్రవేశం చేసారు. సముద్రం, నువ్వే కావాలి, చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావ్, వాసు, మల్లీశ్వరీ, జై చిరంజీవ, తీన్‌మార్, మన్మథుడు, ఛల్ మోహనరంగ మొదలైన సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా మంచి పేరు సంపాదించారు.
దర్శకుడిగా త్రివిక్రమ్
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా పనిచేస్తూనే దర్శకత్వంలో కూడా తన ప్రతిభను చూపించారు. "నువ్వే నువ్వే" సినిమాతో త్రివిక్రమ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తరుణ్, శ్రియ జోడీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా హిట్ అయ్యాక మహేష్ బాబుతో "అతడు" సినిమాను రూపొందించారు.
"అతడు" సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత విడుదలైన జల్సా, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అరవింద సమేత, అఆ, అత్తారింటిది దారేది సినిమాలు త్రివిక్రమ్ స్థానాన్ని ఇండస్ట్రీలో సుస్థిరం చేశాయి.
అయితే మహేష్ బాబుతో తీసిన "ఖలేజా" ఫ్లాప్ అయ్యింది. కానీ విమర్శకుల ప్రశంసలు పొందిందీ చిత్రం. అలాగే పవన్ కల్యాణ్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన "అజ్ఞాతవాసి" చిత్రం కూడా త్రివిక్రమ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. త్రివిక్రమ్ కెరీర్ ప్రమాదంలో పడిందనే అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత త్రివిక్రమ్ మరింత శ్రమించారు. అలా వైకుంఠపురములో.. లాంటి సినిమాతో మళ్లీ తన స్టైల్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకొని, తానేమిటో నిరూపించారు.
ఎన్నో పురస్కారాలు
'అతడు' సినిమాకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ ఉత్తమ దర్శకుడిగా ఫిలిమ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. అలాగే ఉత్తమ మాటల రచయితగా ఆరు నంది అవార్డులు అందుకున్నారు. చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మల్లీశ్వరీ, అతడు, అత్తారింటికి దారేదీ సినిమాలకు సంభాషణల రచయితగా త్రివిక్రమ్ ఈ పురస్కారాలను అందుకున్నారు.
మాటలతో తూటాలు పేల్చే మేధావి
* యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు.. ఓడించడం
* కన్న తల్లిని, గుడిలో దేవున్నీ మనమే వెళ్లి చూడాలి. వాళ్లే మన దగ్గరకు రావాలనుకోవడం మూర్ఖత్వం.
* మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు.. ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు.. నలుగురు లేనప్పుడు.. యెంత సంపాదించినా..ఎంత పోగొట్టుకున్నా తేడా ఉండదు.
* ప్రేమంటే తేలికగా మర్చిపోయే సంఘటన కాదు.. బ్రతికినంత కాలం గుర్తుండిపోవాల్సిన జ్ఞాపకం. గొంతులో వున్న మాట అయితే నోటితో చెప్పొచ్చు.. కానీ గుండెల్లో ఉన్న మాట కళ్లతోనే చెప్పగలము.
* ఆశ క్యాన్సర్ ఉన్నోడిని కూడా బతికిస్తుంది. భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది. విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది.
ఇలా ఎన్నో ఆలోచింపజేసే సంభాషణలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ నేటి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించారనే చెప్పవచ్చు.
Read More : రచయిత నుంచి దర్శకుడిగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) 20 ఏళ్ల సినీ ప్రయాణం!
Follow Us