టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు బన్నీ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లు రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ ఒక్క సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్లో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun)కు అరుదైన గౌరవం లభించింది. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా అమెరికాలోని భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన ఇండియా డే పరేడ్ కార్యక్రమానికి భార్య స్నేహారెడ్డి తో కలసి హాజరయ్యారు. ఇందులో భాగంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు ఆయన నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా భారత జాతీయ పతాకాన్ని చేత్తో పట్టుకుని రెపరెపలాడించారు.
అల్లు అర్జున్ కి న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ (Eric adams) ఘన స్వాగతం పలికారు. అలాగే ఈ పరేడ్ కు దాదాపు ఐదు లక్షల మందికి పైగా భారతీయులు వచ్చి, భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని, ఐకాన్ స్టార్ పై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ స్థాయిలో న్యూయర్క్ డే పరేడ్ కు ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ఇండియా డే పరేడ్ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు.
పరేడ్ ను ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'యే భారత్‌కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ..తగ్గేదేలే'.. అంటూ పుష్ప డైలాగ్‌తో (Pushpa Dialouge) ఉత్సాహపరిచాడు. భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నట్లు తెలిపాడు. ఇక గ్రాండ్ మార్షల్‌గా వ్యవహిరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి అక్కడి మేయర్ ఆడమ్స్ సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్ బహుకరించాడు. ఇండియా పరేడ్‌కి అల్లు అర్జున్ రావడంతో న్యూయర్క్ వీధులు కిక్కిరిసిపోయాయి.
అల్లు అర్జున్ (Allu Arjun) మేకోవర్.. యాటిట్యూడ్ ఆకట్టుకున్నాయి. ఇందులో వైట్ డ్రెస్ ధరించిన బన్నీ జాతీయ జెండాను ఎగరవేస్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ‘న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో గ్రాండ్ మార్షల్ కు హాజరవడం గౌరవంగా ఉంది’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Follow Us