Akkineni Nagarjuna: టాలీవుడ్ 'కింగ్' అక్కినేని నాగార్జున కెరీర్ లో టాప్ 10 సినిమాలివే..!

టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున (Tollywood Hero King Nagarjuna)

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున కెరీర్‌లో రొమాంటిక్ హీరో, యువ సామ్రాట్, మన్మథుడు, కింగ్ అని చాలా పేర్లు ఉన్నాయి. అక్కినేని వారసత్వాన్ని విజయవంతంగా తన భుజస్కంధాలపై మోస్తున్నాడు. నాగార్జున లుక్స్ గురించి చాలా మంది మాట్లాడుకుంటారు కానీ నాగ్ కూడా అద్భుతమైన పెర్ఫార్మర్. నాగార్జున 1986లో విక్రమ్ సినిమాతో అరంగేట్రం చేశారు. పైగా, ఇన్ని సంవత్సరాలలో, నాగార్జున అనేక చిరస్మరణీయ చిత్రాలలో నటించారు. అతని సినిమాల ఎవర్‌గ్రీన్ జాబితాలో, పది ఉత్తమ చిత్రాలను ఎంచుకొని మీ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాము. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.

మజ్ను (Majnu-1987) - ఇది ఒక శృంగార విషాద చిత్రం. తారక ప్రభు ఫిల్మ్స్ పతాకంపై దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, రజని ప్రధాన పాత్రల్లో నటించగా, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతం అందించారు. ఈ చిత్రం 1987 జనవరి 14 న శోభన్ బాబు పున్నమి చంద్రుడు, బాలకృష్ణ భార్గవ రాముడు, కృష్ణ తాండ్రి కొడుకుల ఛాలెంజ్ లతో పాటు విడుదలై, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నమోదైంది. ఈ చిత్రాన్ని తమిళలో ఆనంద్ పేరుతో పునర్నిర్మించారు.
 

గీతాంజలి (Geetanjali-1989) - ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇది. అక్కినేని నాగార్జున, గిరిజ ప్రధాన పాత్రలు పోషించారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం తమిళం, మలయాళం భాషలలోకి కూడా అనువదించబడింది. ఈ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి.

శివ (Shiva-1989) - అక్కినేని నాగార్జున హీరోగా నటించన 'శివ' సినిమా మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించారు. ఆయనే సంభాషణలు కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబీఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. ఇళయరాజా స్వరాలని సమకూర్చారు. రాంగోపాల్ వర్మకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం సికింద్రాబాద్ లోని కీస్ ఉన్నత పాఠశాలది.

అంతం (Antham-1992) - ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా..  నాగార్జున, ఊర్మిళ ప్రధాన పాత్రలు పోషించారు. శివ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన రెండో సినిమా ఇది. ఇందులో పాటలు జనాన్ని ఆకట్టుకున్నప్పటికీ సినిమా మాత్రం అంతగా ప్రజాదరణ పొందలేదు. ఇదే సినిమాను హిందీలో నాగార్జునతోనే ద్రోహి గా రూపొందించారు.

హలో బ్రదర్ (Hello Brother-1994) - ‘కింగ్’ నాగార్జున కెరీర్ లో ఆల్ టైం హిట్స్ గా నిలిచిన సినిమాల్లో ‘హలో బ్రదర్’ తప్పకుండా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బుల్లితెర పై ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది ఈ చిత్రం. ఇ.వి.వి.సత్య నారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున… దేవా మరియు రవి వర్మ పాత్రల్లో డబుల్ రోల్ చేసి అలరించాడు. ‘సుర్రు సుమ్మైపోద్ది’ అనే మాస్ డైలాగ్ ఇప్పటికీ అందరి నోట్లో నానుతూనే ఉంది. కోట శ్రీనివాసరావు, మల్లికార్జున రావు, బ్రహ్మానందం,అలీ ల కామెడీ, హీరోయిన్లు రమ్యకృష్ణ.. సౌందర్య ల గ్లామర్, కోటి సంగీతం.. సినిమాకే ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. 

నిన్నే పెళ్ళాడతా (Ninne Pelladatha-1996) - క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఇది.ఇందులో అక్కినేని నాగార్జున సరసన టబు హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు అప్పట్లో.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి విభాల్లో ఫిల్ం ఫేర్ (దక్షిణాది) పురస్కారాలు, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా అక్కినేని పురస్కారం, ఉత్తమ గాయకుడిగా రాజేష్ కు నంది పురస్కారం లభించాయి. ఎటో వెళ్ళిపోయింది మనసు పాటకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది.

అన్నమయ్య (Annamaiah-1997) - 15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి పౌరాణికచిత్రం అన్నమయ్యే కావడం విశేషం. కాగా, ఈ సినిమాను తమిళంలో అన్నమాచారియర్ గానూ, హిందీలో తిరుపతి శ్రీ బాలాజీగానూ అనువదించి విడుదల చేశారు. అప్పటిదాకా రొమాంటిక్ హీరో లేదా యాక్షన్ పాత్రలే చేసిన నాగార్జునను ఆధ్యాత్మిక పాత్ర అయిన అన్నమయ్యకు ఎంపిక చేసుకోవటం అప్పట్లో సాహసవంతమైన నిర్ణయంగా తెలుగు సినీ పరిశ్రమలో అనుకున్నారు. కానీ తన అద్భుతమైన నటనతో విమర్శకులకు సమాధానం చెప్పాడు నాగార్జున.

నువ్వు వస్తావని (Nuvvu Vasthavani-2000) - నాగార్జున, సిమ్రన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘నువ్వు వస్తావని’ చిత్రానికి వి.ఆర్. ప్రతాప్ దర్శకత్వం వహించారు. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి నిర్మించారు. ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ‘కలలోనైనా కలగనలేదు నువ్వు వస్తావని..’, ‘పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి..’, ‘మేఘమై నేను వచ్చాను..’, ‘కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తోంది..’, ‘రైలు బండిని నడిపేది..’ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిజానికి ఇది రీమేక్ మూవీ. తమిళంలో 1999లో విడుదలైన ‘తుల్లద మనముం తుల్లం’ అనే సినిమాను తెలుగులో ‘నువ్వు వస్తావని’ పేరిట రీమేక్ చేశారు. తమిళంలో విజయ్, సిమ్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు.

మన్మథుడు (Manmathudu-2002) - విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రెండు షేడ్స్ కలిగిన పాత్రని నాగార్జున పోషించారు.ఓ పాత్రలో లవర్ బాయ్ గా మరో పాత్రలో అమ్మాయిల్ని అసహ్యించుకునే పాత్రలో నటించి ప్రేక్షకులకి బోలెడంత ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చారు నాగ్. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అందించిన క‌థ‌, మాటలు హైలెట్ అని చెప్పాలి. ఇప్పటికీ ‘మన్మథుడు’ సినిమా టీవీల్లో టెలికాస్ట్ అవుతుంది అంటే రిమోట్లు పక్కన పెట్టేసి మరీ ఈ చిత్రాన్ని చూస్తుంటారు ప్రేక్షకులు. 

 

మనం (Manam-2014) - అక్కినేని వారి సొంత పతాకమైన అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున స్వయంగా నిర్మించిన మల్టీస్టారర్ మూవీ మనం. అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన ఈ అరుదైన చిత్రంలో కథానాయికలుగా శ్రియా, సమంత నటించారు. విక్రమ్ కుమార్ ఈ సినిమాకి కథ, చిత్రానువాదం, దర్శకత్వాన్ని అందించగా అమృతం ధారావాహికలో ముఖ్యపాత్ర పోషించిన హాస్యనటుడు హర్షవర్ధన్ సంభాషణలు రచించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా పి. ఎస్. వినోద్, ప్రవీణ్ పూడి ఛాయాగ్రహణం, కూర్పులను సమకూర్చారు. 

Read More: Sardar Movie: కార్తీ 'సర్దార్' మూవీ తెలుగు హక్కులను దక్కించుకున్న అన్నపూర్ణ స్టూడియోస్..!

You May Also Like These