నటీనటులు : శివకార్తికేయన్, మరియా, సత్యరాజ్, ప్రేమ్‌జీ
సినిమాటోగ్రఫర్ : మనోజ్ పరమహంస
సంగీతం : తమన్
నిర్మాతలు : సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుష్కర్ రామమోహనరావు
దర్శకుడు : కేవీ అనుదీప్
రేటింగ్ : 3/5
'జాతి రత్నాలు' లాంటి భారీ సక్సెస్‌ను ఎంజాయ్ చేసిన దర్శకుడు అనుదీప్ .. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్‌తో చేయించిన కామెడీ సినిమానే ఈ 'ప్రిన్స్' (Prince). వరుణ్ డాక్టర్, డాన్ సినిమాల సక్సెస్ తర్వాత శివ కార్తికేయన్‌కు (Siva Karthikeyan) కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఈ క్రమంలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన ఈ 'ప్రిన్స్'చిత్రం మరి ప్రేక్షకులకు నవ్వుల రసాన్ని సరిగ్గా పంచిందో లేదో మనమూ విశ్లేషిద్దాం
కథ
ఆనంద్ (శివ కార్తికేయన్) ఓ స్కూల్ టీచర్. ఈయన తండ్రి విశ్వనాథ్ (సత్యరాజ్) ఓ సామ్యవాది. కుల, మతాలను వ్యతిరేకిస్తూ సమతా భావనను చాటుతుంటాడు. వీరిది ఓ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం. ఆనంద్ బోధిస్తున్న పాఠశాలలోనే జెస్సికా (మరియా) అనే బ్రిటీష్ అమ్మాయి కూడా టీచర్‌గా పనిచేస్తుంది.
జెస్సికా ప్రేమలో పడిన ఆనంద్.. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. కానీ అందుకు జెస్సికా తండ్రి అడ్డుచెబుతాడు. భారతీయులంటే ఆయనకు గల చిన్నచూపే అందుకు కారణం. మరి ఈ క్రమంలో కథానాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నదే ఈ సినిమా కథ.
సానుకూల అంశాలు
ఈ సినిమా ప్రధానంగా కామెడీ చిత్రమైనా సరే.. కాస్త మానవీయ కోణాలను కూడా దర్శకుడు టచ్ చేయడం అభినందనీయం. శివకార్తికేయన్ (Siva Karthikeyan) కూడా పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. దర్శకుడు అనుదీప్ (Anudeep) రాసుకున్న స్క్రిప్ట్ ఒక ఆసక్తికరమైన పాయింట్ మీద నడుస్తుండడంతో, జనాలకు క్యూరియాసిటీ పెరుగుతుంది. దానిని క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.
అలాగే ఈ సినిమాకి మరో ప్రధానమైన బలం సత్యరాజ్ (Satyaraj) నటన. హీరోయిన్ మరియా కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. నిర్మాణ విలువలు కూడా ఈ సినిమాలో బాగున్నాయి. ఇక మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్లస్ అయ్యింది. తమన్ (Thaman) అందించిన సంగీతం కూడా ఫరవాలేదు.
ప్రతికూల అంశాలు
ఈ సినిమాలో దర్శకుడు ప్రేక్షకుడిని నవ్వించడమే పనిగా పెట్టుకున్నట్లు మనకు తోస్తుంది. అందుకోసమే కంటెంట్ రాసుకున్నట్లు తోస్తుంది. అప్పుడప్పుడు ఆ కామెడీ కాస్త అతిగా ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. ఈ క్రమంలో కథలో ఉండాల్సిన సీరియస్‌నెస్ తగ్గినట్లు కూడా ప్రేక్షకుడికి అనిపించక మానదు.
దర్శకుడు "జాతిరత్నాలు" మ్యాజిక్‌నే ఈ సినిమాలో కూడా రిపీట్ చేయాలని భావించాడు. అయితే అది కొన్ని చోట్ల వర్కవుట్ కాలేదన్నది వాస్తవం. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఈ సినిమా మరీ డల్ ఫీలింగ్‌నైతే కలిగించదు.
ఫైనల్ వర్డ్
ఒక మెసేజ్‌తో కూడిన కామెడీ చిత్రం కాబట్టి, ఈ సినిమా కుర్రకారుతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఓ మాదిరిగా అలరిస్తుందని చెప్పవచ్చు.
Follow Us