‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నిత్యామీనన్ (Nithya Menen). టాలీవుడ్లో ఆమె చేసినవి కొన్ని సినిమాలే అయినా తన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొంతకాలంగా ఆమె తమిళం, మలయాళం చిత్రాలతో బిజీ అయ్యారు. కొంతకాలం తెలుగులో కనిపించలేదు. నిత్యామీనన్ ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతోపాటు ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు ఆహా ఓటీటీలో ప్రసారమైన సింగింగ్ షోకు జడ్జిగా వ్యవహరించారు.
నిత్య తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తుందని ఆశించిన ఫ్యాన్స్‌కు తాజాగా ఆమె షాకిచ్చారు. ఇక తాను సినిమాలకు, నటనకు బ్రేక్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో మాట్లాడిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ తాను యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నానని తెలిపారు. అయితే అది తాత్కాలికంగా మాత్రమేనని స్పష్టం చేశారు.
క్షణం తీరిక లేకుండా..
గడిచిన ఏడాదిగా సినిమా, వెబ్ సిరీస్‌లు, షోలతో క్షణం తీరిక లేకుండా ఉన్నానని, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పారు నిత్య. అయితే ఈ బ్రేక్ పెళ్లి కోసం మాత్రం కాదని కూడా క్లారిటీ ఇచ్చారు.
తన పెళ్లిపై వస్తున్న పుకార్లను కూడా ఖండించారు నిత్యామీనన్. ఇటీవల నిత్యకు పెళ్లంటూ వార్తలు హల్చల్ చేశాయి. మలయాళ స్టార్ యాక్టర్‌ను నిత్య పెళ్లి చేసుకోనున్నారని రూమర్లు వచ్చాయి. అయితే 24 గంటల్లోనే తన పెళ్లి పుకార్లకు చెక్ పెట్టారు నిత్యామీనన్. ప్రస్తుతం తాను కెరీర్‌పైనే ఫోకస్ పెట్టానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పారామె. ప్రస్తుతం నిత్యా.. తను కమిట్ అయిన సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసి బ్రేక్ తీసుకుంటున్నారు. నిత్యామీనన్ (Nithya Menen) నటించిన సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Read More : Nithya Menen: కోలీవుడ్ దర్శకుడి పెళ్లి ప్రపోజల్ ను తిరస్కరించిన నిత్యా మీనన్!
Follow Us