సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న నటి కీర్తి సురేష్ (Keerthy Suresh). "మహానటి" సినిమాతో భారతీయ సినిమా రంగంలోనే ఈమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. "మహానటి"లో అలనాటి నటి సావిత్రి పాత్రలో నటించి, ప్రేక్షకుల ప్రశంసలతో పాటు ఏకంగా జాతీయ అవార్డును సైతం అందుకున్నారు.
తమిళ సినిమాల్లో బాల నటిగా సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన కీర్తి సురేష్, ఆ తరువాత కథానాయికగా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా పింక్ విల్లా స్పెషల్ స్టోరి మీకోసం.
బాల్యం
కీర్తి సురేష్ 1992 అక్టోబర్ 17 తేదీన జన్మించారు. తండ్రి తమిళ నిర్మాత సురేష్ కుమార్. తల్లి ప్రముఖ తమిళ నటి మేనక. తల్లిదండ్రులు సినిమా రంగానికి చెందిన వారు కావడంతో కీర్తి సురేష్ కూడా చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తిని పెంచుకున్నారు. బాల నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
'పైలెట్స్', 'అచనయికిస్టం', 'కుబేరన్' సినిమాల్లో బాల నటిగా కీర్తి సురేష్ మంచి పేరు సంపాదించుకున్నారు. కీర్తి సురేష్ అక్క రేవతీ సురేష్ ఓ వి.ఎఫ్.ఎక్స్ స్పెషలిస్టు. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ కంపెనీలో రేవతి పని చేశారు.
ఫ్యాషన్ డిజైనర్‌గా..
కీర్తి సురేష్ (Keerthy Suresh) తమిళనాడులోని చెన్నైలో చదువుకున్నారు. పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత లండన్, స్కాట్లాండ్ నగరాల్లో ఆ కోర్సుకు సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్నారు. ఒకవేళ తాను నటి కాకుంటే, ఫ్యాషన్ డిజైనర్ అయి ఉండే దానినని కీర్తి పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.
కథానాయికగా ప్రస్థానం..
కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా "గీతాంజలి" అనే మలయాళ సినిమాతో ప్రేక్షకులకు పరచయమయ్యారు. తెలుగులో "నేను శైలజ" అనే సినిమాలో రామ్ సరసన నటించిన కీర్తి సురేష్.. అదే చిత్రంతో టాలీవుడ్‌లోకి తొలిసారిగా అడుగుపెట్టారు. అప్పటికే ఆమె నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. 'రైల్', 'రెమో' లాంటి సినిమాలతో కీర్తి సురేష్ అప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత 'నేను లోకల్', 'అజ్ఞాతవాసి' లాంటి సినిమాలలో నటించారు.
మహానటిగా జాతీయ అవార్డు
అలనాటి స్టార్ హీరోయిన్ సావిత్రి బయోపిక్ "మహానటి" చిత్రంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించారు. ఆ చిత్రంలో కనబరిచిన విశేషమైన నటనకు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం అందుకున్నారు.
"మహానటి" తరువాత కీర్తి సురేష్ ఎన్నో లేడీ ఓరియెంటెండ్ సినిమాలలో నటించారు. 'పెంగ్విన్', 'మిస్ ఇండియా', 'గుడ్ లక్ సఖి' వంటి సినిమాలు కీర్తి సురేష్‌కు అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. ఆ క్రమంలో మళ్లీ కమర్షియల్ సినిమాలలో నటించాలని భావించారు కీర్తి సురేష్.
'రంగ్ దే', 'పెద్దన్న' వంటి కమర్షియల్ చిత్రాలతో కీర్తి సురేష్ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే విడుదలైన "సర్కారు వారి పాట" చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా నటించిన కీర్తి సురేష్.. తన ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ హిట్‌ను జమ చేసుకున్నారు. ఈ చిత్రంలో కీర్తి పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తరువాత కీర్తి సురేష్‌ను అభిమానులందరూ "మహానటి"కి బదులుగా "కళావతి" అని పిలవడం విశేషం.
కొత్త ప్రాజెక్టులు
కీర్తి సురేష్ ప్రస్తుతం నానితో "దసరా" సినిమాలో నటిస్తున్నారు. అలాగే "భోళా శంకర్" మూవీలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కనిపించనున్నారు. అలాగే మరో రెండు తమిళ చిత్రాలకు సైతం కీర్తి సైన్ చేశారు.
పెళ్లి వార్తలు
ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే తల్లిదండ్రులు చూసిన సంబంధమే కీర్తి చేసుకుంటారట. ఆ విషయాన్ని ఆమె గతంలో అనేకసార్లు చెప్పారు. అయితే ప్రస్తుతం కీర్తి త్వరలోనే వధువు కాబోతున్నారని.. వరుడు ఓ ప్రముఖ వ్యాపారవేత్త అనే టాక్ కూడా ప్రచారంలో ఉంది.
Follow Us