సినిమా - 'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1)
విడుదల తేదీ - సెప్టెంబర్ 30, 2022
నటీ నటులు - విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ
దర్శకత్వం - మణిరత్నం
నిర్మాత - మణిరత్నం, సుభాస్కరన్ అల్లిరాజా
సంగీతం - ఏ ఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ - రవి వర్మన్
ఎడిటర్ - ఎ. శ్రీకర్ ప్రసాద్
పింక్ విల్లా రేటింగ్ - 3/5.
'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 30 వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కార్తీ, త్రిష, శోభిత ధూళిపాళ కీలక పాత్రలలో నటించారు.
చోళ రాజుల చరిత్రకు సంబంధించిన నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఏ పాత్రలో ఎవరు నటించారు
ఈ చిత్రంలో చక్రవర్తి ఆదిత్య కరికాలన్ పాత్రలో చియాన్ విక్రమ్ నటించారు. యోధ యువరాజు వల్లవరైయన్ వంతీయతేవన్ పాత్రలో కార్తీ, రాణి నందినిగా ఐశ్వర్య రాయ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అలాగే చోళ యువరాణి కుందవై పిరత్తియార్ పాత్రలో త్రిష కనిపించారు.
చరిత్ర ప్రకారం చూస్తే, రాజ రాజ చోళగా పొన్నియన్ సెల్వన్ తన రాజ్యంలో అసామాన్యమైన గౌరవం అందుకున్నారు. ఆ క్యారెక్టర్ అనగా అరుల్మొళి వర్మన్ (పొన్నియన్ సెల్వన్) పాత్రను జయం రవి పోషించారు.
పొన్నియిన్ సెల్వన్ - మొదటి భాగం కథ
పరాంతక చోళుడు (ప్రకాశ్ రాజ్) అనే రాజుకు ఆదిత్య కరికాలన్ ( విక్రమ్), కుందవై (త్రిష), అరుల్ మొలి వర్మన్ (జయం రవి) అనే ముగ్గురు సంతానం ఉంటారు. ఆదిత్య కరికాలన్ రాజుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటాడు. ఈ చక్రవర్తి ఓ బంగారు కోటను నిర్మించుకుంటాడు. ఆ కోటలో తన తండ్రితో కలిసి నివసించాలని ఆదిత్య భావిస్తాడు. ఈ క్రమంలో తన తండ్రిని తన దగ్గరకు తీసుకురావాలని చోళ రాజ్య సైనికాధికారి వందియతేవన్ (కార్తీ)ని ఆజ్ఞాపిస్తాడు.
వందియతేవన్ తన ప్రయాణ మార్గమధ్యంలో ఓ భవనంలో విశ్రాంతి తీసుకుంటాడు. అక్కడే చోళ రాజ కోశాధికారి పలువెట్టరైయార్ (శరత్ కుమార్) ఆదిత్య కరికాలన్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడని తెలుసుకుంటాడు. తర్వాత పరాంతక చోళుడిని కలిసి ఆదిత్య కరికాలుడి కోరికను చెబుతాడు వందియతేవన్. మరో వైపు, పొన్నియన్ సెల్వన్‌ను శ్రీలంక నుంచి తోడ్కొని రావాలని రాణి కుందావై సైన్యాధికారి వందియతేవన్‌ను ఆదేశిస్తుంది.
కానీ ఇదే సమయంలో 'పొన్నియిన్ సెల్వన్'ను (Ponniyin Selvan 1) బందీగా తీసుకురావాలనే యోచనతో పలువెట్టరైయార్ కూడా రెండు ఓడలను శ్రీలంకకు పంపుతాడు. అయితే అతన్ని తీసుకొచ్చే క్రమంలో తుఫాను వల్ల ఓడలు సముద్రంలో చిక్కుకుంటాయి. ఆ సమయంలో పొన్నియన్ సెల్వన్‌ను ఓ జాలరి మహిళ (ఐశ్వర్య లక్ష్మీ) కాపాడుతుంది. పొన్నియన్ సెల్వన్ అనారోగ్యం బారిన పడడంతో, అతన్ని మెరుగైన చికిత్స కోసం ఓ బౌద్ధ మందిరానికి తీసుకెళతారు. ఆ సమయంలో పలువెట్టరైయార్ తన చిన్నాన్న మధురాంతకన్ (రెహమాన్) ను గద్దె ఎక్కించాలని భావిస్తాడు. ఆదిత్యను సింహాసనం నుంచి తప్పించాలని ప్రయత్నిస్తాడు. ఈ కుట్రలో నందిని పాత్ర కూడా ఉంటుంది. పలువెట్టరైయార్ ఆదిత్య కరికాలుడిని హత్య చేస్తాడు. ఈ హత్యానేరం వందియతేవన్‌పై పడుతుంది.
ఈ నేరం నుంచి వందియతేవన్ ఎలా బయట పడతాడు?. కుందవై రాణితో వందియతేవన్ ప్రేమకథ సుఖాంతం అవుతుందా అనే విషయాలు తెలియాలంటే "పొన్నియిన్ సెల్వన్" సినిమా చూడాల్సిందే.
నటీనటులు మెప్పించారా!
ఆదిత్య పాత్రలో విక్రమ్ అద్భుతంగా నటించారు. ఇక నందినిగా ఐశ్వర్యరాయ్ ఆ పాత్రలో జీవించారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ , విక్రమ్‌ల లవ్ ట్రాక్ బాగుంది. ఇక కార్తీ, త్రిషల నటన ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. శోభితా ధూళిపాళ నటించిన సరదా సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. శరత్ కుమార్ ప్రతినాయకుడిగా, ప్రకాశ్ రాజ్ ఆదిత్య కరికాలుడి తండ్రిగా తమ పాత్రలకు న్యాయం చేశారు.
మణిరత్నం సంగతి?
దర్శకుడు మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' (Ponniyin Selvan 1) చిత్రాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. డైలాగులు, ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. స్టార్ నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించి మణిరత్నం పెద్ద సాహసమే చేశారు.
సినిమా ప్లస్ పాయింట్ప్
పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రానికి బలమైన కథ ఉంది. ఓ నవల ఆధారంగా ఈ సినిమాను మణిరత్నం భారీ బడ్జెట్‌తో చిత్రీకరించారు. ముఖ్యంగా పాత్రధారుల నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం "పొన్నియిన్ సెల్వన్ 1" చిత్రానికి మరో ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
మైనస్ పాయింట్స్
"పొన్నియిన్ సెల్వన్ 1" సినిమాలో అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మరీ కథను సాగదీసినట్టుగా కనిపిస్తాయి. ప్రేక్షకులను గందర గోళానికి గురి చేస్తాయి. బాహుబలి సినిమాతో ఈ చిత్రానికి పోలికే లేదని మేకర్స్ తెలిపినా.. అక్కడక్కడ బాహుబలిని టచ్ చేసిందంటూ పలువురు ప్రేక్షకులు రివ్యూ ఇవ్వడం గమనార్హం.
Follow Us