సినిమా : నేనే వస్తున్నా
నటీనటులు: ధనుష్, ఎలీ అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్
మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా
దర్శకత్వం: సెల్వ రాఘవన్
నిర్మాత: కలైపులి ఎస్.థాను
సమర్పణ: గీతా ఆర్ట్స్
విడుదల తేదీ: 29–09–-2022
రేటింగ్ : 3 / 5
తమిళస్టార్ హీరో ధనుష్ (Dhanush)కు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. రఘువరన్ బీటెక్, వీఐపీ, మారి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఆయా సినిమాల నుంచి వచ్చిన క్రేజ్‌తో ధనుష్ నటించిన పలు సినిమాలు తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదలవుతున్నాయి. సార్ అనే సినిమాతో నేరుగా తెలుగులో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తాజాగా ధనుష్ నటించిన సినిమా ‘నానే వరువెన్’. ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో ‘నేనే వస్తున్నా’ అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు. సుమారుగా 11 సంవత్సరాల తర్వాత ధనుష్ – సెల్వ రాఘవన్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. నేనే వస్తున్నా సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కథ ఏంటంటే : ప్రభు (ధనుష్)ది చాలా అందమైన కుటుంబం. బాగా అర్ధం చేసుకునే భార్య, మంచి కూతురు. ఇద్దరే ప్రభు ప్రపంచం. సంతోషంతో సాగిపోతున్న కుటుంబం. అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో జరిగిన అనుకోని సంఘటనతో ఆ కుటుంబంలో కలవరం రేగుతుంది. ప్రభు కూతురిని సోనూ అనే దెయ్యం ఆవహిస్తుంది. దాంతో ఆ పాప రోజురోజుకూ కుంగిపోతుంటుంది. ఆ పాపను విడిచి పోవాలంటే ఖదీర్ (ధనుష్)ను చంపేయాలని అడుగుతుంది. అసలు ఖదీర్ ఎవరు? ఖదీర్‌ను చంపాలని ఎందుకు షరతు విధిస్తుంది అనేదే సినిమా కథ.
ఎలా ఉందంటే: ఒక సైకో థ్రిల్లర్ కథకు హర్రర్ టచ్ ఇస్తూ ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించేలా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు దర్శకుడు సెల్వ రాఘవన్. కవల పిల్లల్లో ఒకరు అతి మంచితనం కలిగిన వాడు అయితే మరొకరు సైకో. తన చిన్నప్పుడే తండ్రిని దారుణంగా చంపేస్తాడు. దాంతో తల్లి, తమ్ముడు ఆ సైకోను వదిలేసి వెళ్లిపోతారు. ఒంటరిగా పెరిగిన అతను పెద్దయ్యాక ఎలా తయారయ్యాడు? అతని కారణంగా తల్లి, తమ్ముడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు? అనేది ఇంట్రెస్టింగ్‌గా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు.
మంచి భావోద్వేగాలు ఉన్న కథను తెరకెక్కించడంలో సెల్వ రాఘవన్ పెద్దగా సక్సెస్ కాలేదు. థ్రిల్లింగ్ అంశాలను తెరపై చూపించడంలో కూడా తడబడ్డారు. సినిమా మొదట్లో ఖదీర్ చిన్నతనంలోని అంశాలను చూపిస్తూ ఆసక్తి రేకెత్తించిన దర్శకుడు క్రమంగా ప్రభు కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లారు. అయితే ఇవన్నీ చూపించే క్రమంలో కథ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో ప్రేక్షకుడు కొంచెం బోర్ ఫీలవుతాడు. ప్రభు కూతురికి దెయ్యం పట్టిన తరువాత సినిమా కథలో వేగం పెరిగి కొంచెం ఆసక్తి నెలకొంటుంది.
ప్రభు కూతురుకి దెయ్యం పట్టే ముందుగా వాళ్ల ఇంట్లో జరిగే సంఘటనలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. అసలు పాప గదిలో దెయ్యం ఉందని అనుమానం వచ్చి దానిని కన్ఫమ్ చేసుకోవడానికి ప్రభు చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా సాగుతాయి. ఖదీర్‌ను చంపితేనే తన కూతురును వదిలిపెడతానని దెయ్యం చెప్పిన తర్వాత.. దాని కోసం ప్రభు చేసే పనులు ఆకట్టుకుంటాయి.
ఈ క్రమంలో చూపించే ఖదీర్ గతం ప్రేక్షకుడిని ఏ మాత్రం మెప్పించదు. అసలు ఖదీర్ సైకోగా మారడానికి కారణం ఏమిటనే లాజిక్ ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. దాంతో ప్రభు, ఖదీర్ మధ్య జరిగే సన్నివేశాలు అంతగా రక్తికట్టలేదు. అయితే క్లైమాక్స్ మాత్రం ఫర్వాలేదనిపిస్తుంది. యువన్ శంకర్‌రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.
ఎవరెలా నటించారంటే : ఫ్యామిలీ మేన్‌గా, సైకోగా రెండు క్యారెక్టర్లలో ధనుష్ (Dhanush) చక్కగా నటించారు. సైకోగా విలనిజాన్ని కూడా బాగానే పండించారు. సైకోగా ధనుష్ పలికించిన ఎక్స్‌ప్రెషన్స్, మర్డర్లు చేసేటప్పుడు యాక్టింగ్ షాకింగ్‌గా ఉంటాయి. ఇద్దరు హీరోయిన్లు వారివారి పరిథిలో బాగానే నటించారు. కథ సీరియస్‌గా సాగిపోయే సమయంలో కూడా గుణ (యోగిబాబు) క్యారెక్టర్ కామెడీ కొద్దిగా నవ్వులు తెప్పిస్తుంది. ధనుష్ కూతురుగా నటించిన అమ్మాయి నటన బాగుంది.
పాజిటివ్ అంశాలు : ధనుష్ (Dhanush) నటన, కథ
నెగెటివ్ అంశాలు : కథ నెమ్మదిగా కొనసాగడం, ట్విస్ట్‌లు లేకపోవడం.
చివరిగా : నేనే వస్తున్నా.. మంచి హర్రర్ థ్రిల్లర్ కథ
Read More : ధనుష్ (Dhanush) 'సార్' డిసెంబర్‌లో వచ్చేస్తున్నారు!.. అక్షరమే ధనుష్ ఆయుధమా!!
Follow Us