డైరెక్టర్‌గా నా తొలి చిత్రాన్ని అన్నయ్య సూర్య (Suriya)తోనే తీస్తా: కార్తి (Karthi) 

స్పై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ‘సర్దార్’ (Sardar) మూవీ అందరికీ నచ్చుతుందని కోలీవుడ్ స్టార్ హీరో కార్తి (Karthi) ఆశాభావం వ్యక్తం చేశారు

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి (Karthi) వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తూ ఆడియెన్స్‌కు మంచి వినోదాన్ని పంచుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘విరుమన్’ (Viruman)తో పాటు ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan) చిత్రాలతో కార్తి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇందులో పీఎస్ 1 తెలుగులో డబ్ అయ్యి విడుదలైంది. కానీ ‘విరుమన్’ను తెలుగు నాట థియేటర్లలో రిలీజ్ చేయలేదు.

‘విరుమన్’ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం ‘పసలపూడి వీరబాబు’ (Pasalapoodi Veerababu)గా ఓటీటీలో అందుబాటులో ఉంచారు. పీఎస్ 1తోపాటు ‘విరుమన్’ చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో కార్తి సంతోషంలో ఉన్నారు. ఇప్పుడు ‘సర్దార్’గా మరోమారు బిగ్ స్క్రీన్స్‌లో అందర్నీ అలరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ‘సర్దార్’ (Sardar Movie) ప్రమోషన్స్‌లో భాగంగా ఈ  సినిమా విశేషాలతోపాటు పలు ఆసక్తికరమైన విషయాలను కార్తి పంచుకున్నారు. 

దర్శకత్వం చేయాలన్న ఆలోచన ఉందని కార్తి తన మనసులోని మాటను బయటపెట్టారు. దిగ్దర్శకుడు మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్ ఎలా ప్రారంభమైందో ఆయన గుర్తు చేసుకున్నారు. తన అన్నయ్య సూర్య సినిమాతోనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్ మొదలైందన్నారు. అందుకే తన దర్శకత్వంలో తొలి చిత్రాన్ని కూడా ఆయనతోనే తీస్తానని కార్తి పేర్కొన్నారు. 

‘నేను దర్శకత్వం వహించే ఫస్ట్ మూవీలో అన్నయ్యే హీరోగా ఉంటారు. ఎందుకంటే ఆయన నన్ను బాగా అర్థం చేసుకుంటారు. నా చెయ్యి పట్టుకుని చిత్ర పరిశ్రమలోకి తీసుకొచ్చింది ఆయనే. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే మా అన్నయ్య మూవీకి దర్శకత్వం వహించాలనే కోరిక ఉండేది’ అని కార్తి చెప్పుకొచ్చారు. 

దీపావళి కానుకగా రిలీజ్ కానున్న తన చిత్రం ‘సర్దార్’ గురించి కూడా కార్తి కొన్ని ఇంట్రెస్టింగ్ కబుర్లు పంచుకున్నారు. ఇదో స్పై ఫిల్మ్ అని ఆయన అన్నారు. ‘సర్దార్ ఓ భారీ బడ్జెట్ సినిమా. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాతలు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథకు ఉన్న అవసరాన్ని మన దేశంలోని చాలా లోకేషన్లతో పాటు కజకిస్థాన్, బంగ్లాదేశ్‌లోనూ ఈ సినిమాను షూట్ చేశాం’ అని కార్తి తెలిపారు.  

‘నా ఫిల్మ్ కెరీర్‌లోని భారీ ప్రాజెక్టుల్లో ఇదొకటి. ఈ మూవీ స్క్రిప్ట్ రాసేందుకు దర్శకుడు పీఎస్ మిత్రన్ రెండేళ్లు సమయం తీసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కు మరో ఆర్నెళ్లు.. షూటింగ్‌కు దాదాపు ఏడాది సమయం పట్టింది. ఈ సినిమాను అద్భుతమైన థ్రిల్లర్‌గా మిత్రన్ రూపొందించారు’ అని కార్తి వివరించారు. ఇక, స్పై బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘సర్దార్’ చిత్రంలో కార్తి సరసన హీరోయిన్లుగా రాశి ఖన్నా, రజీషా విజయన్ నటిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ కానుంది. 

Read more: మహేష్ బాబు (Mahesh Babu)తో రాజమౌళి (rajamouli ss) మూవీ.. విలన్‌గా కోలీవుడ్ హీరో కార్తి (Karthi)?

You May Also Like These