Ratan Tata Biopic: రతన్ టాటా బయోపిక్‌ను తీయనున్న సుధ కొంగర!.. ప్రధాన పాత్రల్లో సూర్య (Suriya), అభిషేక్ బచ్చన్?

రతన్ టాటా (Ratan Tata) జీవితంపై సుధ కొంగర తీసే మూవీలో ప్రధాన పాత్రల్లో సూర్య (Suriya), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) నటిస్తారని సమాచారం

దర్శకురాలు సుధ కొంగర (Sudha Kongara) ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా ఆమె పేరు సంపాదించారు. ‘గురు’ మూవీతో మంచి హిట్ అందుకున్న సుధ.. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో జాతీయ స్థాయిలో మెరిశారు. ఓటీటీలో రిలీజైన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. వ్యూస్‌తోపాటు అవార్డులనూ కొల్లగొట్టింది. ఇందులో నటించిన సూర్య జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. హీరోయిన్ అపర్ణా బాలమురళి ఉత్తమ నటి, సుధ కొంగర ఉత్తమ దర్శకుడి పురస్కారాలను దక్కించుకున్నారు.

ప్రస్తుతం ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను హిందీలో ఖిలాడీ అక్షయ్ కుమార్‌తో సుధ కొంగర రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే మరో క్రేజీ ప్రాజెక్టును ఆమె తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ మూవీ తర్వాత మరో కొత్త మూవీకి సుధ కొంగర ప్లాన్ చేస్తున్నారు. ఈసారి మరో బయోపిక్‌ను ఆమె రూపొందించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల  సమాచారం. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన రతన్ టాటా (Ratan Tata Biopic) జీవిత కథను తెరపైకి తీసుకురావాలని సుధ అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ కథకు సంబంధించిన పరిశోధనలు కీలక దశలో ఉన్నాయని, వచ్చే ఏడాది అక్టోబరులో సినిమా కార్యరూపం దాల్చనుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

రతన్ టాటా జీవితంపై సుధ కొంగర తీస్తున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. ఇందులో కోలీవుడ్ బిగ్ స్టార్ సూర్య (Suriya), బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే సుధ ఓ హింట్ కూడా ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సూర్యతో త్వరలో ఓ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ‘కేజీఎఫ్’ చిత్ర నిర్మాతలతో వాస్తవ సంఘటన ఆధారంగా ఓ మూవీ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఒకవేళ టాటా జీవిత కథ తెరరూపం దాల్చితే మాత్రం అంచనాలు భారీ రేంజ్‌లో ఉంటాయని చెప్పొచ్చు. మరి, ఈ మూవీ మీద వస్తున్న వార్తలపై సుధ కొంగర త్వరలో స్పందిస్తారేమో చూడాలి. 

Read more: ‘అవతార్ 2’ (Avatar 2) మూవీ: మరీ అంత రేటా?.. బెంగళూరులో ఒక్కో టికెట్ ధర రూ.1,400.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?

You May Also Like These