అందం, అభినయానికి సినీ తారలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరపై మెరవాలంటే సెలబ్రిటీలు అందాన్ని కాపాడుకోల్సిందే. అయితే అందం మాత్రమే ఉంటే సరిపోదు.. అభినయంలోనూ సత్తా చూపాల్సిందే. అప్పుడే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే అందాన్ని కాపాడుకోవడం అంత సులువు కాదు. పాత్రల కోసం నటులు బరువు తగ్గడం, పెరగడం లాంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి లావుగా మారిపోతుంటారు. అలాంటి వారిపై నెటిజన్స్ విమర్శలు గుప్పించడాన్నీ చూస్తూనే ఉన్నాం.
నటనకు అందం, బరువుతో పెద్దగా సంబంధం లేనప్పటికీ.. ఇవాళ వాటికే ప్రాధాన్యం పెరిగిపోయిందని సినీ విమర్శకులు కూడా అంటున్నారు. శరీరాకృతిని బట్టి నటులు విమర్శలను ఎదుర్కోవడం ఈమధ్య పెరిగిపోయింది. తానూ ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నానని నటి మంజిమా మోహన్ (Manjima Mohan) అన్నారు. ఇటీవల గౌతమ్ కార్తిక్‌ను పెళ్లాడిన సమయంలోనూ పలువురు పెళ్లిలోనే తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారని ఆమె చెప్పారు.
‘నిజం చెప్పాలంటే.. మా పెళ్లిలోనూ కొంతమంది నేను లావుగా ఉన్నానని కామెంట్ చేశారు. శరీరాకృతి విషయంలో ఎంతోకాలం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నా. అయితే, మొదట్లో కాస్త బాధపడ్డా. కానీ, ఇప్పుడు నేను ఫిట్‌గా, సంతోషంగా ఉన్నా. నాకు తగ్గాలనిపించినప్పుడు తప్పకుండా బరువు తగ్గుతా’ అని మంజిమ తెలిపారు. తాను నటిగానే కొనసాగాలనుకుంటున్నానని, మంచి కథల్లో చాన్స్ వస్తే తప్పకుండా యాక్ట్ చేస్తానని ఆమె అన్నారు.
ఇకపోతే, కోలీవుడ్ యంగ్ పెయిర్ గౌతమ్ కార్తిక్ (Gautham Karthik)–మంజిమా మోహన్ వివాహబంధంలోకి అడుగు పెట్టారు. ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబసభ్యుల అంగీకారంతో ఈ సోమవారం మ్యారేజ్ చేసుకున్నారు. కుటుంబసభ్యులతోపాటు కొందరు సన్నిహితుల సమక్షంలో చెన్నైలోని ఓ హోటల్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని గౌతమ్, మంజిమను అభినందించారు.
Read more: Mukhachitram: చెడ్డోడికి భయాన్ని పుట్టించాలంటున్న విశ్వక్ సేన్!.. ఆకట్టుకుంటున్న ‘ముఖచిత్రం’ ట్రైలర్
Follow Us