Hombale Films:హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ కేజీఎఫ్ సినిమాలను నిర్మించి రికార్డులు సృష్టించింది. ఇదే క్రమంలో కొత్త రికార్డులను సాధించే దిశగా ముందుకు సాగుతోంది. తన భవిష్యత్తు ప్రాజెక్టులలో భాగంగానే, టాప్ హీరోలతో ఓ మల్టీస్టారర్ సినిమాను కూడా తెరకెక్కించనుంది. ఎవరా హీరోలు.. ఏంటా సినిమా..? అనే విషయం మనమూ తెలుసుకుందాం.
కన్నడ సినీ రంగంలో హోంబలే ఫిలిమ్స్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సంస్థ అతి తక్కువ సినిమాలే నిర్మించినా.. భారతీయ సినీ రికార్డులను తిరగరాసింది. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన నాల్గవ సినిమా కేజీఎఫ్ చాప్టర్ 1. ఆ తర్వాత నిర్మించిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాతో వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. కేజీఎఫ్ చిత్రాలతో హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్లుగా మారారు.
హోంబలే ఫిలిమ్స్ మొదటి సారి తెలుగులో 'సలార్' సినిమాను నిర్మిస్తోంది. ప్రభాస్, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా 'సలార్' సినిమాలో నటిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ 'సలార్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నిర్మాత విజయ్ కిరంగన్‌దూర్ రూ. 200 కోట్లతో నిర్మిస్తున్నారు.
తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) సంస్థ మల్టీ స్టారర్ సినిమాలను నిర్మించనుంది. స్టార్ హీరోలు సూర్య, దుల్కర్ సల్మాన్‌లతో సైతం ఓ చిత్రం నిర్మిస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా సినిమాగా ఈ ప్రాజెక్టును తెరకెక్కించాలని భావిస్తున్నారట. సూర్యకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా తన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందారు.
త్వరలో ప్రకటన
సూర్య, దుల్కర్ సల్మాన్ కాంబోలో సినిమా అంటే హిట్టే అంటున్నారు అభిమానులు. "ఆకాశమే నీ హద్దురా" సినిమా ఫేమ్ సుధా కొంగర ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారట. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తారట. ఈ నిర్మాణ సంస్థ ప్రస్తుతానికి కన్నడ సినిమాలు మాత్రమే నిర్మించింది. త్వరలోనే తెలుగు, తమిళ మలయాళ చిత్రాల మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టనుంది.
సూర్య (suriya) ప్రస్తుతం తమిళంలో బాల దర్శకత్వంలో 'వనంగాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో 'అచలుడు'గా రీమేక్ చేస్తున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన 'సీతారామం' చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో 'స్వప్న సినిమాస్' బ్యానర్‌పై స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కానుంది.
Read More: Salaar : 'డార్లింగ్' ప్రభాస్ (Prabhas) నటిస్తున్న.. సలార్ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే ?
Follow Us