దక్షిణ చిత్ర పరిశ్రమలో హీరో సూర్య (Suriya) ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరుగుతోంది. హీరో పాత్రలతో పాటు సూర్య గెస్ట్ రోల్స్‌లో కూడా నటించి మెప్పిస్తున్నారు. కమల్ హాసన్ నటించిన 'విక్రమ్'లో రోలెక్స్ సర్‌గా సూర్య నటించారు. రోలెక్స్ పాత్రతో సూర్య పాపులారిటీ మరింత పెరిగింది. ప్రస్తుతం అభిమానులు అందరూ సూర్యను రోలెక్స్ సర్ అని పిలుస్తున్నారు. అంతేకాకుండా ఆస్కార్ అవార్డుల కమిటీ నుంచి సూర్యకు ఆహ్వానం కూడా అందింది. దీంతో సూర్య అభిమానుల ఆనందం ఆకాశాన్ని తాకిందనే చెప్పాలి.
సౌత్‌లోనే మొదటి హీరో సూర్య (Suriya)
ప్రపంచ సినిమా రంగంలోనే అత్యుత్తమ అవార్డు ఆస్కార్. ఆస్కార్ అవార్డును ఒక్కసారైనా అందుకోవాలన్నది సినీ సెలబ్రిటీల ప్రతీ ఒక్కరి కల. దక్షిణాది నటుడు సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలు ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లాయి. తన సినిమాలతో ఆస్కార్ అకాడమీ దృష్టిలో పడిన సూర్యకు ఓ అరుదైన గౌరవం కూడా అందింది. ఆయన ఆస్కార్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుండి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 397 మంది కార్యనిర్వాహకుల జాబితాను ఆస్కార్ అకాడమీ విడుదల చేసింది. అందులో సూర్య ఒకరు. ఆస్కార్ కమిటీ సభ్యత్వానికి ఇండియా నుంచి సూర్యను ఆహ్వానించారు. నార్త్ నుంచి హీరోయిన్ కాజోల్ దేవగన్‌కు కూడా ఈ ఆహ్వానం అందింది. ఈ క్రమంలో ఆస్కార్ కమిటీలో చేరిన మొదటి దక్షిణాది నటుడిగా సూర్య (Suriya) అరుదైన గౌరవం అందుకున్నారు.
Follow Us