మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు చెబితే అభిమానులంతా ఆనందంతో ఉరకలేస్తారు. సినిమాలతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న చిరు.. సమాజ సేవ ద్వారా కూడా ఎంతో మంది ఆదరాభిమానాలను పొందుతున్నారు. చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం చిరు.. భోళాశంకర్, మెగా154 సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.
ఇక, టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరు అల్లు అరవింద్ (Allu Aravind). దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య కొడుకైన అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నారు. అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి అల్లు స్టూడియోస్‌ను ఓపెన్ చేశారు. ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైన అల్లు అరవింద్.. తన వ్యక్తిగత విషయాలతోపాటు చిరంజీవితో తనకు ఉన్న అనుబంధం గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కొడితే.. 13 కుట్లు పడ్డాయి..
నేను ఎవరినైనా ఇష్టపడితే వాళ్లను ఎవరైనా ఒక్క మాట అన్నా సరే ఒప్పుకోను. చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి దేవి థియేటర్ దగ్గర ఒక పెద్దాయన చిరంజీవి గురించి అమర్యాదగా మాట్లాడారు. దాంతో నాకు కోపం వచ్చి కొట్టాను. ఆయనకు 13 కుట్లు పడ్డాయి. కాలేజీలో చదువుతున్న సమయంలో బస్సు కండక్టర్‌తో గొడవ అయ్యింది. డ్రైవర్‌ను, కండక్టర్‌ను దింపేసి నేను బస్సు నడిపాను. కాలేజీలో అందరినీ వదిలిపెట్టి.. బస్సును ఒక చోట ఆపేసి ఇంటికి వచ్చేశాను. ఆ తర్వాత పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. మా నాన్న బెయిల్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చారు.
దాదాపు అన్నీ హిట్లే..
గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఎక్కువ సినిమాలు చేసింది చిరంజీవి. దాదాపుగా అన్ని సినిమాలూ హిట్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన చూడాలని ఉంది సినిమాను నేను, అశ్వనీదత్ కలిసి హిందీలో తెరకెక్కించాం. సినిమా ఆడలేదు. దాంతో ఇద్దరికీ భారీ నష్టం వచ్చింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద అమౌంట్. రిస్క్ చేసి డబ్బు సంపాదించిన రోజులూ ఉన్నాయి. అలాగే పోగొట్టుకున్నాను కూడా’ అని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్ (Allu Aravind).
Follow Us