తెలుగు సినిమా గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు మన దర్శక ధీరుడు, జక్కన్న ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli). ‘బాహుబలి–1, 2’ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలతో హాలీవుడ్‌లోనూ పేరు సంపాదించుకున్నారు రాజమౌళి. మార్చి నెలలో విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్, విజువల్స్, తెరకెక్కించిన విధానానికి హాలీవుడ్ మేకర్స్ ప్రశంసల వర్షం కురిపించారు.
నెట్‌ఫ్లిక్స్ ఏర్పాటు చేసి వర్చువల్ కాల్‌లో రాజమౌళితో బాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ మాట్లాడారు. కాగా, ఇప్పుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు ప్రదర్శించనున్నారు. బియాండ్ ఫెస్ట్ అనేది హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో విశేష ఆదరణ పొందిన ఫిల్మ్ ఫెస్టివల్. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అంగరంగవైభవంగా వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.
సినిమాల ప్రదర్శన షెడ్యూల్ ఇదే
ఈ నెల 27 నుంచి అక్టోబర్ 11 వరకు జరగనున్న ఈ ఫెస్ట్‌లో.. టాలీవుడ్ టు హాలీవుడ్ అనే పేరుతో ఏర్పాటు చేసిన వేదికపై రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘బియాండ్ ఫెస్ట్’ టీమ్ గురువారం ట్వీట్ చేసింది.
సెప్టెంబర్ 30న ‘ఆర్‌ఆర్‌ఆర్’, అక్టోబర్ 1న ‘ఈగ’, ‘బాహుబలి’, ‘బాహుబలి–2’, అక్టోబర్ 21న ‘మగధీర’, అక్టోబర్ 23న ‘మర్యాద రామన్న’ సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది టీమ్. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. ఆ క్రేజ్‌తో ఆయన చిత్రాలను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారనే కారణంగా బియాండ్ ఫెస్ట్ నిర్వాహకులు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమాలను ఫెస్ట్ వేదికపై ప్రదర్శించాలని నిర్ణయించారని టాక్.
Follow Us