యూట్యూబ్ స్టార్‌గా తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కుర్రాడు (Shanmukh Jaswanth) షణ్ముఖ్ జస్వంత్. ఆ ఇమేజ్‌తోనే ఆయనకు బిగ్గెస్ట్ రియాలిటీ షో `బిగ్‌బాస్ 5` లో పాల్గొనే అవకాశం దక్కింది. కాగా, ఈ షో లో షణ్ముఖ్ తనదైన ఆట తీరుతో ప్రత్యేక స్థానంలో నిలిచారు. బిగ్ బాస్ లో చివరి వరకు వచ్చి ట్రోఫీకి అడుగు దూరంలో ఫైనల్ లో రన్నరప్‌గా నిలిచాడు. అదే షో లో మరో కంటెస్టెంట్ సిరి హన్మంత్‌తో కలిసి ఆయన కెమిస్ట్రీ బాగా పండించాడు. దీంతో వారిద్దరి మధ్య ఈ కెమిస్ట్రీ అనేక విమర్శలను ఎదుర్కొంది. చివరికి తన సొంత ప్రేయసిని కోల్పోయేలా చేసింది. కాగా, షణ్ముఖ్ తన తోటి యూట్యూబర్ దీప్తి సునయనాతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా ఎంతగానో పాపులర్ అయ్యారు. కానీ బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక ఈ కెమిస్ట్రీ వల్లే షణ్ముఖ్‌కి బ్రేక్ చెప్పింది దీప్తి.
ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు కాస్త సైలెంట్‌గా ఉన్న షణ్ముఖ్‌కి తాజాగా జాక్ పాట్ తగిలింది. ఆయనకు ఏకంగా తెలుగు నెం.1 ఓటీటీ `ఆహా`లో (Aha OTT) ఓ ఆఫర్ వచ్చింది. షణ్ముఖ్ `ఆహా` ఒరిజినల్‌లో నటించే ఛాన్స్ ని దక్కించుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలో `ఏజెంట్ ఆనంద్ సంతోష్` పేరుతో ఓ వెబ్ సిరీస్‌ని రూపొందిస్తుంది `ఆహా`. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ఆహా ప్రకటించింది. `ఏజెంట్ ఆనంద్ సంతోష్` వచ్చేస్తున్నాడు. కేసు వివరాలు త్వరలో ` అంటూ ఫస్ట్ లుక్‌ని సైతం పంచుకున్నారు. ఈ పోస్టర్ ల ఏజెంట్ లుక్‌లో షణ్ముఖ్ ఆకట్టుకుంటున్నారు. కాగా, ఆయన అభిమానులకు ఈ వార్త మంచి సర్‌ప్రైజింగ్ విషయమనే చెప్పాలి.
ఇదిలా ఉంటే.. ఈ వెబ్ సిరీస్ (Web Series) కు సుబ్బు కే కథ అందించగా, అరుణ్ పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు `బిగ్‌బాస్ 5`లో తనకు జోడీగా వ్యవహరించిన సిరి హన్మంత్ కూడా `ఆహా`లో ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. ఆమె అడల్ట్ కంటెంట్ `బీఎఫ్‌ఎఫ్` (BFF) పేరుతో ఓ సిరీస్ చేస్తుండగా, దాన్ని రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే ఇప్పుడు షణ్ముఖ్ వెబ్ సిరీస్ ప్రకటించడం విశేషం. మొత్తంగా వీరిద్దరు వ్యక్తిగత విషయాలను బయటపడి, కెరీర్‌పై ఫోకస్ పెట్టారని చెప్పవచ్చు. అయితే, ఈ ప్రకటనతో షణ్ముఖ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అభిమానులు ఈ వెబ్ సిరీస్‌ని, షణ్ముఖ్ జస్వంత్ ని హ్యష్ ట్యాగ్ లతో ట్రెండ్ చేస్తున్నారు. ఇక షణ్ముఖ్.. గతంలో యూట్యూబ్ వేదికగా వీడియో సాంగ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఇంతకుముందు నటించిన `ది సాఫ్ట్ వేర్ డెవలవ్‌పర్` బాగా ఆదరణ పొందింది.
Follow Us