స్టార్ రైటర్, నటుడు పరుచూరి గోపాలకృష్ణ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై సంచలన కామెంట్స్ చేశారు. పవన్‌పై ఆయన చేసిన కామెంట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. రాజకీయంగా కూడా హాట్‌టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం పవన్‌ను చూస్తుంటే గతంలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజులు గుర్తుకు వస్తున్నాయని పరుచూరి అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. రాజకీయాల్లో ఎవరు కలిసివచ్చినా.. రాకపోయినా ముందుకు పోయే వీరుడి లక్షణాలు పవన్ కల్యాణ్‌లో మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు గోపాలకృష్ణ.
సమాజాన్ని మార్చాలనే పవన్ కల్యాణ్ ఆశయం గొప్పదని చెబుతూ, ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు పరుచూరి గోపాలకృష్ణ. పవన్ కల్యాణ్ వాయిస్‌ను చట్టసభల్లో వినాలన్నదే తన కోరికని చెప్పారు. 'పరుచూరి పలుకులు' అనే తన యూట్యూబ్ ఛానల్‌లో పవన్ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్ గురించి పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.
ప్రజల కోసం పోరాడటమే..
"దక్షిణాదిలో ఎంతో మంది సినీ తారలు రాజకీయాల్లో రాణించారు. మరికొందరు రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరిక తీరగానే వెనక్కి వచ్చేశారు. అయితే నందమూరి తారకరామారావు మాత్రమే సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన, ఆశయంతో రాజకీయాల్లోకి వెళ్లారు. ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ చేస్తోంది కూడా అదేనని" తెలిపారు పరుచూరి గోపాలకృష్ణ.
"రాజకీయాల్లో ఒక్క ప్రయత్నంతోనే గెలవాలని, ముఖ్యమంత్రి కావాలనే తపన పవన్ కల్యాణ్‌కి లేదు. ప్రజలకు మేలు జరిగే వరకూ ప్రజల కోసం పోరాటం చేయాలనేదే పవన్ (Pawan Kalyan) టార్గెట్‌గా కనిపిస్తోంది. గెలుపు, ఓటములను పక్కన పెట్టి ప్రజల్లో తిరుగుతున్నారు" అని పరుచూరి వెల్లడించారు.
రాజకీయాల్లో గెలుపు, ఓటమి సహజమని.. గతంలో ఇందిరాగాంధీని గెలిపించి ప్రధానిని చేసిన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే ఆమెను ఓడించారని పరుచూరి గుర్తు చేశారు. అలాగే ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రిని చేసిన అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలే ఆయనను ఓడించిన విషయాన్ని కూడా ఉదాహరణగా చెప్పుకొచ్చారు పరుచూరి.
ముందు వరుసలో ఉంటా..
పవన్ ఆలోచన కూడా ఎన్టీఆర్‌లాగానే ఉంటుందని అన్నారు పరుచూరి. ప్రజల సమస్యలను చట్టసభల్లో వినిపించాలనే కసి పవన్ వాయిస్‌లో కనిపిస్తోందన్నారు. సమాజాన్ని బాగుచేయాలనే పవన్ కల్యాణ్ ఆలోచన కూడా గొప్పది అని ప్రశంసించారు. ఎన్నికల్లో పవన్ గెలిచి చట్టసభల్లో ఆయన వాయిస్ వినాలనుకునే వాళ్లలో తాను ముందు వరుసలో ఉంటానన్నారు గోపాలకృష్ణ. ఆ లక్ష్యం, ప్రజల కోరిక తప్పకుండా తీరాలని కోరుకుంటున్నానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టి ప్రశ్నించే హక్కును పవన్ పొందాలని కోరుకుంటున్నానని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ.
రాజకీయంగా కలిసి వస్తుంది..
యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమాలు, రాజకీయాలు, సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలపై తన అభిప్రాయాల్ని పంచుకుంటారు పరుచూరి గోపాలకృష్ణ. ప్రపంచంలో మనకు తెలియని చాలా విషయాలు పవన్ కల్యాణ్‌కి తెలుసని అన్నారాయన. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకునే ముందు "బొబ్బిలిపులి, జస్టిస్ చౌదరి" వంటి సినిమాలు ఎంతో హైప్ క్రియేట్ చేశాయని తెలిపారు.
రాజకీయంగా ప్రజల్ని చైతన్య పరచడానికి ఆ సినిమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు మరికొంత సమయం ఉంది గనుక ఎన్టీఆర్ చేసినట్లుగా పవన్ కల్యాణ్ కూడా ప్రజల్లో తన స్టామినాను నిరూపించుకునేందుకు సూపర్ హిట్ సినిమా ఒకటి తీస్తే.. రాజకీయంగా బాగా కలిసి వస్తుందని సూచించారు పరుచూరి గోపాలకృష్ణ. మరి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను సీనియర్ ఎన్టీఆర్‌తో పోల్చడంపై అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.
Read More : 51వ వసంతంలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan)..పవర్‌స్టార్ గురించిన ఆసక్తికరమైన విషయాలు మీకోసం
Follow Us