ఎడారిలో సీన్ చిత్రీకరించాలా.. ఎడారి దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద తెరపై ఎడారి బ్యాక్‌గ్రౌండ్ కనిపించేలా చేసి.. దాని ముందు నటిస్తే చాలు. సినిమా చూసేటప్పుడు నిజంగానే ఎడారిలో సీన్ తీసినట్టే ఉంటుంది. దాన్ని సుసాధ్యం చేసేదే.. వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ. ఇప్పటికే విదేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీ భారతీయ చిత్ర పరిశ్రమలోకి రాబోతోంది. ఈ సాంకేతికతతో కూడిన వేదికను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో (Annapurna Studios) ఏర్పాటు చేయబోతున్నారు.
లొకేషన్, స్పేస్, బడ్జెట్ పరిమితులకు లోబడి రాసుకొన్న కథను సినిమాగా, వెబ్ సిరీస్‌గా తీర్చిదిద్దేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆన్ లొకేషన్ ప్రొడక్షన్ ఖర్చులను తగ్గించి మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు ప్రత్యక్షంగా చూడగలిగే, సమయం, డబ్బును ఆదా చేసే టెక్నాలజీ ఇది అని చెప్తున్నారు.
ఎలా పనిచేస్తుందంటే..
ఒక గదిలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. దానిపై అవసరమైన లొకేషన్లు, వస్తువులు కనిపించేలా చేస్తారు. వేదికపై దర్శకులు చెప్పినట్టు నటిస్తే చాలు. ఎలాంటి లొకేషన్ అయినా సరే అక్కడ ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. కథకు అనుగుణంగా ఎంచుకొన్న లొకేషన్ల వీడియాలను చిత్రీకరించి, ఇక్కడి ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ.. దాని ముందు నటీనటులతో నటించేలా చేస్తారు. ఉన్న చోటే ఒక సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి చేయొచ్చు. అన్నపూర్ణ స్టూడియోలో క్యూబ్ సినిమా సంస్థతో కలిసి వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ స్టేజీని ఏర్పాటు చేసేందుకు ఇటీవలే ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది.
20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో కర్వ్‌డ్ డిజైన్‌లో 2.3 ఎంఎం డాట్ పిచ్‌ను కలిగి ఉంటుంది. అల్ట్రా హై రీఫ్రెష్ రేట్, వైడ్ కలర్ గామట్, హై బ్రైట్‌నెస్ ఎల్‌ఈడీ స్క్రీన్స్‌తో వాల్‌ను కలిగి ఉంటుంది
- వర్చువల్, భౌతిక ప్రపంచాలను మిళితం చేస్తుంది
2. ఇది గేమ్ ఇంజిన్ సాయంతో రియల్ టైంలో పనిచేసేలా ఏర్పాట్లు చేస్తారు
3. బ్యాక్ డ్రాప్‌లు, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ సెట్‌లో ఉంటాయి
4. పూర్తిగా నియంత్రిత వర్చువల్ పరిసరాలలో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు
5. ఒక సినిమాలో ఉపయోగించే అన్ని లొకేషన్లు ఒకే చోటకు తీసుకువచ్చి షూటింగ్స్ చేసుకొనేలా వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ఉంటుంది.
సినిమా తీయాలంటే సన్నివేశానికి తగ్గట్టు లొకేషన్లు వెతుక్కోవాలి.. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాలి. వీసా, ప్రయాణ టికెట్లు, అకామడేషన్, ఫుడ్, షూటింగ్ మెటీరియల్, పర్మిషన్స్ ఇలా ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతా చేసి లొకేషన్‌కు వెళ్లాక వాతావరణం అనుకూలించకున్నా, పర్మిషన్ ఇబ్బంది అయినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ రోజు షూటింగ్‌కు అంతరాయం తప్పదు. దాంతో డబ్బు, సమయం అన్నీ వృథా అవుతాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టే అత్యాధునిక సాంకేతికతే.. వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ. దీనితో ఒక చిన్న గదిలో, కావాల్సిన విధంగా మొత్తం సినిమాను చిత్రీకరించొచ్చు. ఈ సాంకేతికతను దేశంలోనే తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) అందుబాటులోకి తెస్తోంది.
Follow Us