RIP Super Star Krishna Garu: సూపర్ స్టార్ కృష్ణ (Krishna) మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరనిలోటు. కృష్ణ రీల్ హీరోనే కాదు రియల్ హీరో అని ఆయన అంతిమ యాత్ర చూస్తేనే అర్థమవుతుంది. తనతో కలిసి పని చేసే నిర్మాతలు, తోటి నటీనటులకు కష్టం వస్తే చలించిపోయేవారు. తనవంతు సహాయాన్ని అందించి ఎంతో మందిని సినిమా జీవితంలో ముందుకు సాగేలా చేశారు.
హీరోగా తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచిన సూపర్ స్టార్ కృష్ణ.. ప్రేక్షకులకు కష్టం వస్తే ఆదుకోవడంలో ముందే ఉండేవారు. సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిత్వానికి సంబంధించిన పలు విషయాలపై పింక్ విల్లా స్పెషల్ స్టోరి.
సూపర్ స్టార్ కృష్ణ మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే ముక్కుసూటిగా ఉంటారని చాలా మంది అంటుంటారు. తన సినిమా ఫ్లాప్ అయితే ఆ విషయాన్ని నిర్మొహమాటంగా ఒప్పుకునేవారు. నష్టపోయిన నిర్మాతలకు తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసేవారు.
కొత్త నిర్మాతలకు కృష్ణ అవకాశం కల్పించేవారు. ఒక వేళ ఏ నిర్మాతకైనా తన సినిమా వల్ల నష్టం వస్తే రెమ్యునరేషన్ తీసుకునేవారు కాదట. అంతేకాదు ఆ నిర్మాతతో మరో సినిమా చేసేవారట. తన బలాలపైన, లోపాలపైన కృష్ణకు అవగాహన ఉండేది.
సూపర్ స్టార్ కృష్ణ (Krishna) హీరోగా పైకి రావడానికి ఆయన మంచితనమే కారణమని టాలీవుడ్ ప్రముఖులు ఎప్పుడూ చెబుతుంటారు.
సినిమా సక్సెస్ కోసం సూపర్ స్టార్ కృష్ణ ఎంత రిస్క్ అయినా చేసేవారట. ఫైట్ సన్నివేశాల్లో దెబ్బలు తగిలించుకుని మరీ సీన్లను పండించేవారట. అందుకే నటశేఖరుడిని డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని పిలిచేవారు.
జేమ్స్ బాండ్, కౌబాయ్ సినిమాల షూటింగ్ సమయంలో కృష్ణ బైక్ రేసులు, గుర్రాలపై స్వారీలు సన్నివేశాలను అలవోకగా చేసేవారు. ఒక్కోసారి ప్రమాదకరమైన సన్నివేశాలలో కూడా దెబ్బలు తగిలినా కూడా ధైర్యంగా నటించేవారు.
సిరిపురం మొనగాడు సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా కృష్ణ సాహసంతో ముందుకు సాగేవారు.
జై ఆంధ్ర ఉద్యమానికి తెలుగు సినిమా పరిశ్రమ మద్దతు తెలిపేందుకు భయపడింది. కానీ కృష్ణ మాత్రం జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతు తెలపడంతో పాటు ఒక రోజు నిరాహార దీక్ష కూడా చేశారు. అప్పటి నుంచి కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా మారారు.
సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సహాయ కార్యక్రమాలను నిర్వహించేవారు. 1972లో ఆంధ్రప్రదేశ్‌లో కరువుతో అల్లాడుతున్న ప్రజల కోసం విరాళాలు ఇవ్వడమే కాకుండా విరాళాలను సేకరించి మరీ సహాయం అందించారు.
ప్రతీ సంవత్సరం ఎండాకాలం ఉటీలోనే తన షూటింగ్ షెడ్యూల్ ఉండేలా ప్లాన్ చేసేవారు. ఊటీలో కృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి వేసవిని సరదాగా గడిపేవారు.
తనకు హీరోగా అవకాశం కల్పించిన ఆదుర్తి సుబ్బారావు చనిపోయిన సమయంలో ఆయన్ను కడసారి చూసేందుకు పెద్ద సాహసమే చేశారు కృష్ణ. అవుట్‌డోర్ షూటింగ్ కోసం వెళ్లిన కృష్ణ ఆదుర్తి సుబ్బారావు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఏ దారీ లేకపోవడంతో.. ద హిందూ పత్రిక వాళ్ళు వాడే ప్రత్యేక విమానంలో ప్రయాణించి మరీ వెళ్లారు.
ఆదుర్తి సుబ్బారావు మరణంతో కష్టాల్లో ఉన్న ఆయన కుటుంబాన్ని ఆదుకున్నారు కృష్ణ. అలాగే తన తోటి నటీనటులకు ఎంతో మందికి అన్ని రకాలుగా సహాయాన్ని అందించి.. రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.
అల్లూరి సీతారామరాజు దర్శకుడు వి.రామచంద్రరావు ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన కొన్ని రోజులకు అనారోగ్యంతో మరణించారు. ఆ సినిమాను కృష్ణ (Krishna) స్వయంగా దర్శకత్వం వహించి పూర్తి చేశారు. కానీ దర్శకుడిగా వి.రామచంద్రరావు పేరే వేయించి.. మనసున్న గొప్ప వ్యక్తిగా సినిమా రంగంలో నిలిచిపోయారు.
తెలుగు సినీ రంగాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లడంలో కృష్ణ ఎంతో కృషి చేశారు. హాలీవుడ్ తొలి జేమ్స్ బాండ్ సినిమా విడుదలైన నాలుగేళ్లకు తెలుగులో తెరకెక్కించిన ఘనత కృష్టదే.
కృష్ణ డాన్సులు వేయడంలో కాస్త కష్టపడేవారు. నాగేశ్వరరావు వంటివారితో డాన్స్ చేసేప్పుడు డాన్స్ డైరెక్టర్‌తో నాగేశ్వరరావును కాస్త ముందు నిలబెడితే ఆయన్ను అనుసరించేస్తానని కృష్ణే స్వయంగా సూచించేవారట.
సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు 21 సంవత్సరాలు వరుసగా సంక్రాంత్రికి విడుదలైన రికార్డుకెక్కాయి.
Read More: RIP Superstar Krishna: కృష్ణ తన కుమారుడు మహేష్ బాబుతో కలిసి నటించిన టాప్ 10 సినిమాలు
Follow Us