Nayanthara : నయనతార నటనా ప్రతిభను చాటిన.. టాప్ 10 చిత్రాలు మీకోసం ప్రత్యేకం !

Nayanthara as Goddess in the movie Ammoru Thalli

Nayanthara: నయనతార.. దక్షిణాది చిత్రసీమను గత చాలా సంవత్సరాల పాటు ఏలిన ఉత్తమ కథానాయిక. తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామణి పురస్కారాన్ని పొందిన అగ్ర కథానాయిక. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఈమె, ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేశారు. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు.తన నటనా ప్రతిభకు గాను ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా దక్కించుకున్నారు.

ఈ రోజు తన చిరకాల స్నేహితుడు, ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో నయన్ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా, ఉత్తమ కథానాయికగా నయనతార నటనకు అద్దం పట్టిన టాప్ 10 చిత్రాల వివరాలను మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.

నయనతార నటించిన కొన్ని ఉత్తమ చిత్రాల జాబితా

కర్తవ్యం (Karthavyam): తమిళ చిత్రం ఆఱమ్ ఈ చిత్రానికి మాతృక. ఈ సినిమాలో నయనతార (Nayanthara) ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. బోరుబావిలో పడిపోయిన పాపను రక్షించడానికి ఓ అధికారిగా శాయశక్తులా ప్రయత్నించే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ఎన్నో భావోద్వేగాలతో ముడిపడిన పాత్ర ఇది. గోపి నైనర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

శ్రీరామరాజ్యం :  శ్రీరామరాజ్యం చిత్రంలో సీతమ్మవారి పాత్రలో నయనతార నటన నభూతో నభవిష్యత్ అని చెప్పవచ్చు. బాపు లాంటి గొప్ప దర్శకుడి డైరెక్షన్‌లో ఆమె ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. 

అమ్మోరు తల్లి : తమిళ చిత్రం ముక్కూటి అమ్మన్ చిత్రాన్ని, తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో డబ్ చేశారు. ఈ సినిమాలో నయనతార సమాజంలో మూఢనమ్మకాలను రూపుమాపడానికి దిగివచ్చే శక్తి స్వరూపిణిగా తనదైన శైలిలో నటించారు. ఈ పాత్రకు గాను ఆమె విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. 

 

ఐరా : ఈ చిత్రంలో దెయ్యాల పై పరిశోధనలు చేసే ఓ మహిళా జర్నలిస్టుగా ఓ విభిన్న పాత్రలో నయనతార నటించారు. సర్జున్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

రాజా రాణి : రాజా రాణి చిత్రంలో నయనతార పాత్రలో రెండు విభిన్న కోణాలుంటాయి. తన ప్రేమను తిరస్కరించి వెళ్లిపోయిన ప్రియుడిని మర్చిపోలేని ఓ నిస్సహాయ స్త్రీగా.. మరోవైపు పెళ్లి చేసుకున్న భర్త మనసును అర్థం చేసుకోలేని ఇల్లాలిగా ఆమె నటించారు. ఈ సినిమాకు గాను ఆమె ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర సినీ పురస్కారాన్ని అందుకున్నారు. 

మయూరి : తమిళ చిత్రం మాయ తెలుగులో మయూరి పేరుతో డబ్బింగ్ చేయబడింది. భర్తతో బంధాలు తెంచుకొని, బిడ్డ కోసం జీవిస్తున్న ఓ తల్లిగా.. మరోవైపు తనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకొనే ఆత్మగా రెండు విభిన్న పాత్రలలో నయనతార నటించారు. ఈ సినిమాలో నటనకు గాను ఆమె విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. 

 

నేను రౌడీనే : నానుమ్ రౌడీ తాన్ అనే తమిళ చిత్రం.. తెలుగులో 'నేను రౌడీనే'పేరిట విడుదలైంది. ఈ చిత్రంలో నయనతార కాదంబరి అనే చెవిటి అమ్మాయి పాత్రలో నటించింది. తన తండ్రి హత్యకు పగ తీర్చుకొనేందుకు, ఆమె పాండీ (విజయ్ సేతుపతి) సహాయం తీసుకుంటుంది. ఈ చిత్రానికి నయన్ భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించడం విశేషం. 

నేత్రికన్ : ప్రమాదంలో కంటిచూపు కోల్పోయిన దుర్గ అనే సీబీఐ ఆఫీసర్ పాత్రలో ఈ సినిమాలో నయనతార నటించింది. కళ్లు లేకపోయినా ఓ సైకో కిల్లర్‌ను ఆమె ఎలా పట్టుకుందన్న కథాంశంతో ఈ సినిమా నడుస్తుంది. మిలింద్ రావ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

కోకో కోకిల : కొలమావు కోకిల అనే తమిళ చిత్రం తెలుగులో.. కోకో కోకిల పేరుతో డబ్ చేయబడింది. ఈ సినిమాలో తల్లి క్యాన్సర్ ఆపరేషనుకి డబ్బులు సమకూర్చడం కోసం ఓ పేదింటి అమ్మాయి, డ్రగ్స్ ముఠాలో చేరుతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార నటనకు మంచి మార్కులే పడ్డాయి. 

 

వాసుకి : మలయాళ చిత్రం పుతియ నియమం తెలుగులో వాసుకి పేరుతో డబ్ చేయబడింది. తన భర్త ఇంట్లో లేని సమయంలో, కొందరు యువకుల చేతిలో అత్యాచారానికి గురైన గృహిణి మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందన్న కోణంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఏకే సజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

ఇలా చెప్పుకుంటూ పోతే నయనతార నటనా కౌశలానికి అద్దంపట్టిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఏదేమైనా, ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న నయన్‌కు మనం కూడా తన వివాహ మహోత్సవం సందర్భంగా, శుభాకాంక్షలు చెప్పేద్దామా !

ఆల్ ది బెస్ట్ .. నయన్ !

Read More : న‌య‌న‌తార‌, విఘ్నేష్‌ల క‌ళ్యాణ వైభోగం !

Credits: Instagram
You May Also Like These