సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐదు సంవత్సరాల్లోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది రష్మికా మందాన (Rashmika Mandanna). తక్కువ కాలంలోనే నేషనల్ క్రష్‌గా పేరు సంపాదించుకుందీ కన్నడ భామ. పుష్ప సినిమాలో చేసిన శ్రీవల్లి క్యారెక్టర్‌తో యువ హృదయాల్లో నిలిచింది. ప్రస్తుతం తెలుగు, తమిళంతోపాటు హిందీలో కూడా సినిమాలు చేస్తోంది. తెలుగులో పుష్ప2, సీతారామం సినిమాల్లో నటిస్తోంది.బాలీవుడ్‌లో మూడు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి బిజీబిజీగా ఉన్న రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
సినీరంగంలోకి అరంగేట్రం చేసిన ఐదేళ్లలోనే పాన్ ఇండియా హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడం దేవుడిచ్చిన వరం. చిన్నతనం నుంచి ఆరాధించే గొప్ప నటులతో కలిసి నటించడం మంచి అనుభూతిని ఇస్తోంది. పెద్ద పెద్ద చిత్రాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. వినూత్న కథాంశాలతో తీస్తున్న సినిమాల్లో నటిస్తుండడం సంతోషంగా ఉంది. కెరీర్‌పరంగా సంతృప్తిగా ఉన్నా. ప్రతి సినిమాలో నన్ను నేను కొత్తగా నిర్వచించుకుంటున్నా.
స్కూల్‌లో చదివే రోజుల నుంచే దళపతి విజయ్ నా అభిమాన హీరో. ఆయనతో సినిమా చేసే అవకాశం అనగానే నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొదటిరోజు షూటింగ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూశా. క్లాప్ కొట్టిన తర్వాత విజయ్‌కు దిష్టి తీసి ఆయనపై నాకున్న ఆరాధన చాటుకున్నా. దిష్టి తీయగానే విజయ్ ఆశ్చర్యపోయారు. సెట్‌లో వున్న వాళ్లందరూ నవ్వులు చిందించారు. అంతటి స్టార్‌డమ్ ఉన్నప్పటికి విజయ్ చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయనలోని సింప్లిసిటీ నన్ను బాగా ఆకట్టుకుంది.
భాషాపరంగా ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. ప్రతి భాషలోనూ సినిమాలు చేయాలి. అక్కడి ప్రేక్షకుల ప్రేమను పొందాలన్నదే నా కోరిక. ప్రస్తుత సమయంలో సినిమా బాగుంటే ఏ భాషకు చెందిన సినిమా అనే విషయాన్ని ఎవరూ ఆలోచించడం లేదు. నటనతో మెప్పిస్తే చాలు ఏ నటుడినైనా ఆరాధిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ కొత్తదనంలోకి మారుతున్న సమయంలో హీరోయిన్‌గా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను.
ప్రస్తుతం సౌత్ సినిమాలను హిందీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘పుష్ప’ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ‘కేజీఎఫ్-2’ సినిమాలు సాధించిన విజయాలే అందుకు నిదర్శనం. అదంతా ఒక్క రోజులో జరిగింది కాదు. పల్లెటూర్లలో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది తాము ఎప్పటి నుంచో సౌత్ సినిమాలను టీవీల్లో చూస్తున్నామని చెప్పేవారు. ఇప్పుడు బిగ్‌స్క్రీన్‌లో చూడటం కొత్తగా ఉందని చెప్పారు. సౌత్ ప్రేక్షకులు తమ సంస్కృతి, ఆచార వ్యవహారాలను బాగా ప్రేమిస్తారని ఉత్తరాది ప్రజలు భావిస్తారు. మన సినిమాలు అక్కడ రికార్డులు సృష్టించడానికి అది కూడా కారణంగా చెప్పుకోవచ్చు.
‘గుడ్‌బై’ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ గారితో పనిచేయడం మంచి అనుభవం. షూటింగ్ గ్యాప్‌లో ఆయన గొప్ప విషయాలను షేర్ చేసుకునేవారు. కెరీర్‌లో ఎదగాలంటే మనకు ఏం అవసరమో ఆయన మాటల ద్వారా తెలుసుకున్నా. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో భారీ ఆఫర్లొస్తున్నాయి. కొందరు పెద్ద హీరోలతో ఇంకా సినిమాలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం నా కెరీర్‌పై చాలా సంతృప్తిగా ఉన్నానని చెప్పింది రష్మికా మందాన (Rashmika Mandanna).
Follow Us