F3 Movie Premier Show: "ఎఫ్ "2 సినిమాకు సీక్వెల్‌గా తీసిన "ఎఫ్ 3" సినిమా ప్రేక్షకుల ముందుకు ఈ రోజు వచ్చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి అండ్ టీమ్ కనీవినీ ఎరుగని ఖతర్నాక్ కామెడీతో ఈ సినిమాలో వినోదాన్ని పంచారు. వెంకటేష్ (Venkatesh), వరుణ్ తేజ్(Varun Tej), తమన్నా, మెహ్రీన్‌ల కాంబినేషన్, మరోసారి వెండితెరపై నవ్వులు పూయించేసింది. ఈ క్రమంలో మనం కూడా ఎఫ్ 3 సినిమా ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం . !
"నవ్వించడం ఒక యోగం" అంటారు నాటి మేటి దర్శకుడు జంధ్యాల. ఈ మాటలు దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా వర్తిస్తాయి. ఎందుకంటే, తన సినిమాలతో ఆయన ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా.. కవ్విస్తుంటారు కూడా. అలాగే "సంతోషం సగం బలం" .. అనే పాయింట్‌ను ప్రధానంగా బేస్ చేసుకుని అనిల్ రావిపూడి సినిమాలు తీస్తుంటారు. టాప్ హీరో, హీరోయిన్లతో కూడా క్రేజీ కామెడీ చేయించగలిగే, టాలెంట్ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడే. కామెడీ కథతో ఎఫ్ 2 సినిమా తీసి ఓ రేంజ్‌లో హిట్ అందుకున్న ఈ దర్శకుడు.. ఇప్పుడు ఎఫ్ 3 సినిమాతో నవ్వుల పువ్వులు పూయించాడు.
ఎఫ్ 2 సినిమా సీక్వెల్ ఈ రోజే విడుదలైంది. అలాగే ఈ సినిమా ప్రీమియర్ షో టాక్ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా అయింది. డబ్బు ప్రతీ మనిషికి అవసరమే. కానీ మధ్యతరగతి ప్రజలు లగ్జరీల కోసం, అదనపు డబ్బు సంపాదించడానికి ఏం చేస్తారనే స్టోరితో ఎఫ్ 3 సినిమా తెరకెక్కింది. ఇందులో కథానాయకులు డబ్బుల కోసం పడే పాట్లను చాలా ఫన్నీ యాంగిల్‌లో అనిల్ చూపించారు. బంగ్లాలు, నగలు, కార్లు .. ఇలా తమ స్థాయికి మించి ఆశ పడే జనాల పాట్లు ఏవైతే ఉన్నాయో.. అవి స్టోరీకి అదనపు బలాన్ని అందించాయి. ఇదే క్రమంలో వెంకటేష్, వరుణ్‌ల చేసిన కామెడీ అదిరిపోయింది.
ఎఫ్3 (F3) సినిమా ఫస్ట్ ఆఫ్ సూపర్ డూపర్‌గా ఉందని టాక్. వెంకటేష్, వరుణ్, తమన్నా, మెహ్రీన్ .. వీరందరూ ఎఫ్ 2 సినిమాని మించి ఇందులో కామెడీ పండించారట. ఇక సెకండ్ ఆఫ్ కాస్త స్లోగా ఉన్నా.. దర్శకుడు ఆ ల్యాగ్‌ను కామెడీతో కవర్ చేశారట. అయితే, క్లైమాక్స్‌లో ఇంకాస్త ఫన్ జోడిస్తే బాగుంటుందని టాక్. ఎఫ్ 3 సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. ఈ సారి అది మైనస్ అయిందని టాక్. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ మాత్రం డబుల్ ప్లస్ అంటున్నారు. ఇక, పూజ హెగ్డే స్పెషల్ సాంగ్‌కు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదట.
ఎఫ్ 3 సినిమాలో సునీల్, ఆలీ, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ వంటి కామెడీ స్టార్స్ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీరు చేసిన కామెడీ మాములుగా లేదంటున్నారు. కమెడియన్లను ఒక చోట చేరిస్తే.. ఆ కిక్కే వేరంటున్నారు ఆడియన్స్. ఎఫ్2, ఎఫ్3 (F3).. ఈ రెండు సినిమాలను పోల్చి చూడలేమని.. దేనికదే నవ్వులు పండించిందనేది ఓవరాల్ ఆడియన్స్ టాక్. ఇక ఎఫ్ 3 సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow Us