కరోనా విపత్కర పరిస్థితులు, దాని పర్యవసనాల కారణంగా తాను నటించిన రెండు సినిమాలు నారప్ప, దృశ్యం2 ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చిందని చెప్పారు విక్టరీ వెంకటేష్ (Venkatesh). కానీ, ఈసారి అభిమానులను నిరాశ పరచబోనని అన్నారు. వరుణ్ తేజ్‌తో కలిసి వెంకీ నటించిన సినిమా ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్3 సినిమాలో తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘ఎఫ్3 ఫన్‌టాస్టిక్’ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
‘మూడేళ్ల క్రితం నా సినిమా థియేటర్‌లో విడుదలైంది. పరిస్థితుల కారణంగా, ‘నారప్ప’, ‘దృశ్యం2’ ఓటీటీల్లోనే రిలీజ్ చేయవలసి వచ్చింది. థియేటర్‌లో నా సినిమా చూడాలని ఎదురుచూసిన అభిమానులు చాలావరకు నిరాశపడ్డారు. వారందరికీ ‘ఎఫ్3’ మంచి ట్రీట్. నన్ను అభిమానించే ఫ్యామిలీ అభిమానులు తప్పకుండా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. అనిల్ అద్భుతమైన స్క్రిప్ట్‌తో సినిమాను తెరకెక్కించాడు. ఇలాంటి సినిమాలను గతంలో కూడా ఆదరించారు. అలాగే ‘ఎఫ్3’ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక బృందానికి అభినందనలు. మే 27న ‘ఎఫ్3’ని థియేటర్లలో చూసి ఆనందించండి’’ అని వెంకటేశ్ అన్నారు.
‘ఎఫ్3’ షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత రెండు వేసవి కాలాలు పూర్తయ్యాయి. మరోవైపు పూర్తిస్థాయి కామెడీ చిత్రం వచ్చి కూడా చాలా రోజులు గడిచింది. సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు. వెంకటేష్ గారు చాలా మందితో మల్టీస్టారర్ సినిమాలు చేశారు. కానీ, రెండోసారి చేసే అవకాశం నాకు మాత్రమే దక్కింది. వెంకటేష్, అనిల్ రావిపూడి వల్ల ‘ఎఫ్3’ నాకు మరో ప్లస్ అవుతుంది’ అని వరుణ్ తేజ్ చెప్పాడు.
ఎఫ్2కి మించి ఉండాలనుకున్నాం: అనిల్ రావిపూడి
‘2020 తర్వాత రెండు సంవత్సరాలు అందరికీ రెస్ట్. మిమ్మల్ని నవ్వించడానికి చాలా కష్టపడ్డాం. మా ముందు ‘ఎఫ్2’ అనే పెద్ద శత్రువు ఉంది. దానికి మించేలా ఈ సినిమా ఉండాలనుకున్నాం. నవ్వడం చాలా సులభం.. కానీ, కామెడీని క్రియేట్ చాలా కష్టం. నా కోసం, సినిమా కోసం నా టీమ్ చాలా ఇబ్బందులు పడింది. ఈ సినిమాలో 35 మందికి పైగా ఆర్టిస్టులు ఉన్నారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ వారంతా చాలా కష్టపడి పనిచేశారు. ‘ఈ సినిమాను కామెడీ ఫిల్మ్ అనకండి’ అని దేవిశ్రీ అన్నారు. దానికి కనెక్ట్ అయి, మంచి సంగీతం అందించారు. వరుణ్ నాకొక బ్రదర్‌లాంటివాడు. ‘ఎఫ్2’లో కనిపించిన వరుణ్, ‘ఎఫ్3’లో కనిపించే వరుణ్ వేరు. చాలా చక్కగా కామెడీ చేశాడు. వెంకటేష్ గారు నా ఆల్‌టైమ్ ఫేవరెట్. స్టార్ హీరో అయినా, కామెడీ చేసేటప్పుడు ఆ ఇమేజ్‌ను పక్కన పెడతారు.. లవ్ యూ వెంకటేష్ గారు.. ‘నవ్వడం ఒక యోగం.. నవ్వలేకపోవడం రోగం.. నవ్వించడం ఒక భోగం’ ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ చేసిన పని ఇదే’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నాడు.
‘తొలి సన్నివేశం నుంచి చివరి వరకూ అనిల్ రావిపూడి మిమ్మల్ని నవ్విస్తారు. నిర్మాతల కుమారుడు వెంకటేష్ (Venkatesh), వరుణ్ మామూలుగా నవ్వించరు. ఎఫ్2లో ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఇందులో నలుగురు ఉన్నారు. సాంకేతిక బృందం కూడా కష్టపడి పనిచేసింది. ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అని నిర్మాత దిల్‌రాజు అన్నారు.
Follow Us