టాలీవుడ్ సీనియర్ నటులు కృష్ణంరాజు (Krishnam Raju) మృతి తీరని లోటని సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) అన్నారు. కృష్ణంరాజుతో తనకు 50 ఏళ్ల స్నేహబంధం ఉందని కృష్ణ తెలిపారు. కృష్ణంరాజు మరణం తనను కలిచివేసిందన్నారు. 'తేనె మనసులు' సినిమా హీరోల కోసం ప్రకటన వెలువడినప్పుడు.. ఆ సినిమా ఆడిషన్స్‌కు కృష్ణంరాజు, తాను వెళ్లామని కృష్ణ గుర్తు చేసుకున్నారు. 'చిలకా గోరింక' సినిమాతో కృష్ణంరాజు పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారన్నారు. అలాగే తాను కథానాయకుడిగా నటించిన 'నేనంటే నేనే' సినిమాలో కృష్ణంరాజు మొదటి సారి ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించారని చెబుతూ, ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
కృష్ణంరాజు మృతికి కృష్ణ నివాళి
కృష్ణంరాజు (Krishnam Raju) హీరోగానే కాకుండా విలన్, సెకెండ్ హీరో పాత్రల్లో కూడా నటించి మెప్పించారన్నారు. తనతో కలిసి 'ఇంద్రభవనం', 'యుద్ధం', 'అడవి సింహాలు' వంటి సినిమాల్లో నటించారన్నారు. 50 ఏళ్లు ఇద్దరం కలిసి సినీ ప్రయాణం చేశామని.. కృష్ణం రాజు మరణం తనకు చాలా బాధ కలిగించిందని కృష్ణ తెలిపారు. కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు
కృష్ణంరాజు (Krishnam Raju) సెప్టెంబర్ 11 తెల్లవారుఝామున 3.16 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కృష్ణంరాజు పార్థివదేహాన్ని సెప్టెంబర్ 11 మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నివాసానికి తీసుకొస్తారు. ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతారు. అలాగే రేపు ఉదయం కృష్ణంరాజు పార్థివ దేహాన్ని ఫిలిమ్ ఛాంబర్‌కు తరలించనున్నారు. ఆ తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Follow Us