తెలుగు బుల్లితెరపై మోస్ట్ సక్సెస్ ఫుల్ యాంకర్ ఎవరంటే.. ఠక్కున గుర్తొచ్చే పేరు సుమ కనకాల (Suma Kanakala). హోస్ట్ గా పలు షోలు, సినిమా ఈవెంట్లు చేస్తూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సైతం ఆమెతో మాట్లాడటం కష్టమని తేల్చేశాడు. ఎంతో సమయస్ఫూర్తితో, స్పాంటేనియస్ గా గలగలా మాట్లాడే సుమ ప్రధాన పాత్రలో తాజాగా ఓ సినిమా రూపొందింది.
మే 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సుమ ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజయింది. ఇందులో ఆమె తన తనయుడు రోషన్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.
రోషన్ (Roshan) హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇదే విషయంపై ఆమెను ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా సుమ స్పందిస్తూ.. చిన్నప్పటి నుంచీ రోషన్ కు సినిమాలంటే ఇష్టం. 'స్టూడెంట్ నెంబర్ వన్', 'ఆది' సినిమాలు చూస్తూ పెరిగాడు. దీంతో వాడు ఏదైనా మాట్లాడితే చాలు ఎన్టీఆర్ డైలాగ్ 'అమ్మతోడు అడ్డంగా నరికేస్తా' అని అనేవాడంటూ చెప్పుకొచ్చింది.
ఇక రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చే విషయంపై త్వరలోనే ఓ ప్రకటన చేస్తానని పేర్కొంది.
Follow Us