ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మపై (RGV) నిర్మాత నట్టి కుమార్ ఫైర్ అయ్యారు. ఆయన సినిమాలేవీ విడుదల కాకుండా చేస్తామని హెచ్చరించాడు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ నట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన క్రాంతి, కరుణలపై ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి కౌంటర్‌గా నట్టి కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు.
ఆ సమావేశంలో ‘డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే.. ఫోర్జరీ చేశారంటూ తన పిల్లలపై ఆర్జీవీ తప్పుడు కేసులు పెట్టాడు. డబ్బులు బాగానే తీసుకున్నాడు. ఇవ్వమని అడిగితే ఫేక్ అంటున్నాడు. తనతో పాటు చాలా మందిని ఆర్జీవీ మోసం చేశాడు. అప్పులు ఇచ్చిన వాళ్లంతా ఒక్కటయ్యాం. ఇక ఆర్జీవీ పని అయిపోయింది. ఆయన సినిమాలేవీ విడుదల కాకుండా చేస్తాం. వర్మ పేరు మీద సినిమా వస్తే.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అయినా స్టే తీసుకుంటాం’ అని నట్టి కుమార్ అన్నాడు. నిర్మాతలెవరూ ఆర్జీవీతో సినిమా చేయొద్దని కోరారు.
పంజాగుట్ట పీఎస్‌లో ఆర్జీవీ కంప్లైంట్..
నట్టి క్రాంతి, కరుణ.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో సీఐ నిరంజన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు అందించారు. ‘మా ఇష్టం’ సినిమా సమయంలో తన సంతకం ఫోర్జరీ చేశారని కంప్లైంట్‌లో పేర్కొన్నాడు ఆర్జీవీ. 2020 నవంబర్ 30న తన లెటర్‌హెడ్ తీసుకొని నకిలీ పత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకంతో వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్లు సృష్టించారన్నాడు. ఫోర్జరీ సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నిజానిజాలు తేల్చాలని అందులో కోరాడు. ఏప్రిల్‌లో ‘డేంజరస్’ సినిమా విడుదల కావాల్సిందని, ఫేక్ డాక్యుమెంట్లతో దావా వేసి సినిమా రిలీజ్‌ను అడ్డుకున్నారని పోలీసులకు చెప్పాడు ఆర్జీవీ (RGV).
Follow Us