తెలంగాణ రాష్ట్రంలో సంగీత వాయిద్యం '12 మెట్ల కిన్నెర'ను వాయిస్తున్న ఏకైక కళాకారుడు మొగులయ్య (Mogulaiah). ఆయన తాను నివసించే చుట్టుపక్కల గ్రామాల్లో, అక్కడక్కడా కిన్నెర వాయించుకుంటూ పొట్ట నింపుకుంటూ ఉంటాడు. దర్శకుడు ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన "అంపశయ్య" చిత్రం ద్వారా, మొగులయ్య గానం తొలుత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.
కొన్ని రోజుల తర్వాత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 'భీమ్లా నాయక్ (Bheemla nayak)' లో మొగులయ్యకు టైటిల్ సాంగ్ పాడే అవకాశం వచ్చింది. దీంతో ఆయన ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. అంతకు ముందు వరకు, మొగులయ్య కొంతమందికే తెలిసినా.. ‘భీమ్లా నాయక్’ సినిమా పాటతో ఇంకా బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి.. దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో మొగులయ్యను సత్కరించింది.
ఈ నేపథ్యంలో మొగులయ్య (Mogulaiah) తాజాగా పలువురు రాజకీయ నాయకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశాడు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. కోటిని ప్రస్తావిస్తూ.. తన నోట్ల మన్ను కొట్టవద్దని వేడుకున్నాడు. అవసరమైతే పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని చెప్పుకొచ్చాడు. తనకు వెనుకా ముందూ ఏమీ లేదని, పేద కుటుంబం ఉన్నవాడినని పేర్కొంటూ, తనను రాజకీయాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశాడు.
"నన్ను ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. సీఎం కేసీఆర్ నా కళను గుర్తించి, రవీంద్ర భారతిలో ఆరేళ్ల క్రితమే సత్కరించారు. అప్పుడే నేను బయట లోకానికి తెలిశాను. ఈ అవార్డు కోసం కూడా మా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సహకరించి నన్ను ఢిల్లీకి పంపించారు. అలాగే మొన్నామధ్య ఓ పాట పాడితే, పద్మశ్రీ అవార్డు వచ్చింది. సాక్షాత్తూ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నాను. హైదరాబాద్‌లో 300 గజాల స్థలం, కోటి రూపాయలు ఇచ్చారు. నాకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సాబ్ ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటున్నారు" అని మొగులయ్య తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ రాజకీయ పార్టీకి చెందిన వారు మొగులయ్యను విమర్శించారని ఆయన చెప్పుకొచ్చారు. "ముఖ్యమంత్రి తన ఇంట్లో నుంచి కోటి రూపాయలు తీసి నీకు ఇస్తున్నడా?" అని నాతో గొడవపడ్డారు. "పద్మశ్రీ ఆ పార్టీ వాళ్లదంట. నాకు ఆ పతకం అవసరం లేదు. నాకు ఎందుకీ బద్నాం.. పద్మశ్రీ ఎవరిదైనా సరే,, అది తిరిగి ఇచ్చేస్తా. కానీ పేదోడిని అయిన, నా నోట్లో మన్ను పోస్తే పాపం తగులుతది" అని మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.
Follow Us