టాలీవుడ్‌లో కమెడియన్స్ లిస్ట్ తీస్తే అందులో టాప్ 5లో ఉండే పేరు అలీ (Ali). చిన్ననాటి నుంచి నేటివరకు ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలతో నటించి, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని చోటు సంపాదించుకున్నాడు అలీ. వెండితెరపై కొంతకాలంగా తక్కువగా కనిపిస్తున్న అలీ.. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న ఎఫ్ 3 సినిమాలో నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అలీ ఇటీవలే మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆయన సంచలన కామెంట్లు చేశాడు.
'సౌత్ సినిమాలంటే నార్త్ వాళ్లకు ఒకప్పుడు బాగా ప్రేమ ఉండేది. ఇప్పుడు అది మరింత పెరిగింది. అలాగే వీళ్లు మనల్ని తొక్కేస్తున్నారనే భయం కూడా, వాళ్లకు ఇప్పుడు మొదలైంది. ఇండస్ట్రీలోకి వచ్చి 43 సంవత్సరాలు గడిచింది. ప్రస్తుతం బుల్లితెరపై ఒక షో చేస్తున్నాను. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారి కోసమే 'యమలీల' సీరియల్ చేశాను. స్టార్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో అందరినీ ఒప్పించి ఆయన నన్ను హీరో చేశాడు. ఎస్వీ కృష్ణారెడ్డి ఏం చెప్పినా తప్పకుండా చేసేస్తాను.
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో క్యారెక్టర్లు వస్తున్నాయి. సినిమా కథ చెప్పకుండానే క్యారెక్టర్ ఇస్తున్నారు. తీరా సినిమా చూసిన తర్వాత 'అలీ' ఈ సినిమాలో ఎందుకు నటించాడు అని చాలామంది అనుకుంటున్నారు. అభిమానుల నుంచి ఆ మాట రాకూడదనే, కొన్ని సినిమాలు చేయడం లేదు. కథ విని, నా క్యారెక్టర్ బాగుంటేనే సినిమా చేస్తాను. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన వాళ్లు ఏ క్యారెక్టర్ చేసినా పర్లేదు. కానీ నాకు అలాంటి అవసరం లేదు' అని అలీ చెప్పాడు.
'ఎఫ్ 3 లో పాత అలీని చూస్తారు. నా క్యారెక్టర్‌లో అంత సత్తా ఉంది. ఎఫ్ 3 సినిమా షూటింగ్ లొకేషన్‌లో టెక్నీషియన్స్ కూడా నా క్యారెక్టర్‌ను ఎంజాయ్ చేశారు. శిరీష్ అయితే కిందపడి మరీ నవ్వుకున్నాడు. ముఖ్యంగా నా క్యారెక్టర్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు' అన్నాడు అలీ.
'ఎఫ్ 3 సినిమాలో డబ్బులు వడ్డీకి తిప్పే పాల బేబీ క్యారెక్టర్ చేశాను. ఆడవాళ్లు అంటే అపారమైన గౌరవం ఉన్న క్యారెక్టర్ నాది. ఆ విషయం మీకు సినిమా చివరిలో తెలుస్తుంది. సుమారు 45 నిమిషాలు నా క్యారెక్టర్ ఉంటుంది. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వారంతా ఒకరికి మించి ఒకరు నటించారు. చిన్న క్యారెక్టర్ కూడా సినిమాలో కీ రోల్ పోషిస్తుంది. మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా ఉంటుంది సినిమా.
సినిమాలో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉంటే డైరెక్టర్‌కు కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ అనిల్‌లో అది కనిపించదు. చిన్న వయసులో, ఇంతమంది ఆర్టిస్టులతో సినిమా చేయడం గొప్ప విషయం. రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యనారాయణ, దాసరి నారాయణరావు సినిమాల్లో ఇలాంటి వాతావరణం ఉండేది. వెంకటేష్ గారితో నేను చేసిన సినిమాలు అన్నీ కామెడీ చిత్రాలే. కామెడీ చేయడంలో చిరంజీవి, వెంకటేష్, మోహన్‌బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్‌బాబు ఎక్స్‌పర్ట్స్. ఎఫ్ 3 అద్భుతమైన సినిమా. వంద రూపాయలతో సినిమా చూస్తే... మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది' అన్నాడు అలీ.
అంటే సుందరానికీ, లైగర్, ఖుషి, ఒకే ఒక జీవితం సినిమాలతో పాటు, ప్రస్తుతం ఓ తమిళ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు అలీ. కన్నడలో ధృవ సర్జా మూవీలో, అలాగే ఓ నేపాలీ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఒకప్పుడు మనం సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లేవాళ్లం. ఇప్పుడు వాళ్లే మన దగ్గరకు వస్తున్నారు. ఒకప్పుడు నార్త్‌వాళ్లను మనం తెచ్చుకునేవాళ్లం. యాక్టింగ్ నేర్పించి, డబ్బింగ్ చెప్పించి డబ్బులిచ్చేవాళ్లం. ఇప్పుడు సౌత్ వాళ్ల సత్తా ఏంటో అందరికీ తెలిసింది. అక్కడి సినిమాల కోసం ఇప్పుడు మమ్మల్ని పిలుస్తున్నారని అంటున్నాడు అలీ.
Follow Us