Tribute to NTR: నంద‌మూరి అభిమానుల‌కు తీపిక‌బురు.. వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ!

మహా నటుడు నందమూరి తారకరామారావు శ‌త జ‌యంతి (NTR)

మహా నటుడు, మహా నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి (NTR), తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శ‌త జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న శ‌త‌జయంతిని అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్ప‌టికే శత జయంతి వేడుకలు మొదలుకావడంతో... తెలుగురాష్ట్రాలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా అన్నగారి అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.

హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గరున్న ఎన్టీఆర్ ఘాట్లో ఆయ‌న‌ కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్య‌కర్త‌లు, అన్నగారి అభిమానులు హాజరై నివాళి అర్పించారు. కాగా, హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తెల్ల‌వారు జామునే ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. అక్క‌డ‌ తారకరాముడి సమాధి దగ్గర పులమాలలు ఉంచి తాతను స్మరించుకున్నారు.

మ‌రోవైపు ఎన్టీఆర్ కూతురు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ‌రేశ్వరి దంపతులు, నందమూరి రామకృష్ణ, సుహాసిని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు.

ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వ‌ద్ద‌ నివాళి అర్పించిన తర్వాత, మీడియాతో మాట్లాడిన దగ్గుబాటి పురంధ‌రేశ్వరి.. ఎన్టీఆర్ ఒక సంచలనం అని అన్నారు. ఈ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు జరుపుతామని తెలిపారు. నేటితో ప్రారంభ‌మ‌య్యే వేడుక‌లు వచ్చే ఏడాది మే 28న ముగుస్తాయ‌ని తెలిపారు. ఆ వేడకను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణలోని 12 కేంద్రాల్లో ఈ వేడుకలు జరుపుతామని పురంధ‌రేశ్వరి వెల్లడించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు నంద‌మూరి బాలకృష్ణ, ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్రరావు వంటి ప్రముఖులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో ప్రముఖులైన వారిని గుర్తించి, ఘనంగా సన్మానిస్తామని అన్నారు. ఈ సంద‌ర్భంగా.. ఆమె వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించే విషయమై భారతీయ రిజర్వు బ్యాంకుతో చర్చలు జరుపుతున్నట్టు అభిమానుల‌కు తీపి క‌బురు చెప్పారు. 

మ‌రోవైపు.. తన తండ్రికి ఘనంగా నివాళి అర్పించారు హీరో నంద‌మూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఎన్టీఆర్ స్వగ్రామం అయిన‌ కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని నిమ్మకూరుకు వెళ్లిన బాలయ్య, గ్రామస్థులతో కలిసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నిమ్మకూరులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న‌.. తెలుగు ప్రజల గుండెల్లో అన్నగారు చిరస్థాయిలో నిలిచిపోయారని  అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన ఎన్టీఆర్.. పేద ప్ర‌జ‌ల కొర‌కు రూ.2 కు కిలో బియ్యం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని అన్నారు. 

You May Also Like These