లోకనాయకుడు కమల్‌ హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్‌’ సినిమా ట్రైలర్‌‌ రిలీజ్ అయ్యేది అప్పుడే!

కమల్‌ హాసన్ (Kamal Haasan) విక్రమ్‌ సినిమా పోస్టర్

ఇండియన్‌ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కమల్ హాసన్ (Kamal Haasan). ఏ పాత్ర చేసినా వైవిద్యం కోరుకునే నటుడాయన. కామెడీ, సీరియస్, సెంటిమెంట్‌ ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయి జీవించే నటుడిగా కమల్‌కు మంచి పేరుంది. అయితే ఇటీవల ఆయన చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. కథ, కథాంశం పరంగా అవి బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడుతున్నా.. ఆ సినిమాల్లో కూడా కమల్‌ నటనకు మంచి మార్కులే పడుతున్నాయి.

దశావతారం సినిమాలో పది పాత్రలు పోషించి మెప్పించిన కమల్.. విశ్వరూపం 1, 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా కమల్‌ చేస్తున్న సినిమా విక్రమ్. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కమల్‌ చేస్తున్న సినిమాపై ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అని ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు ఎదురుచూస్తారు అనడంలో ఏ సందేహం లేదు. ప్రస్తుతం కమల్‌ హాసన్ చేస్తున్న విక్రమ్‌ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్‌ వచ్చింది. సినిమా ట్రైలర్‌‌ను, ఆడియోను ఒకే రోజు లాంచ్ చేయబోతున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్.

ఈనెల 15వ తేదీన విక్రమ్‌ సినిమా ట్రైలర్‌‌ను రిలీజ్‌ చేసి అదే రోజు సాయంత్రం సినిమా ఆడియో లాంచ్‌ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. కమల్‌ హాసన్‌ సొంత నిర్మాణ సంస్ధ కమల్‌ ఇంటర్నేషనల్ ఫిలింస్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో విక్రమ్‌ సినిమాను నిర్మిస్తున్నాడు. లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్‌‌ విజయ్‌ సేతుపతి, మలయాళీ యాక్టర్‌‌ ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుథ్‌ మ్యూజిక్ చేస్తున్న కమల్‌ హాసన్ (Kamal Haasan) విక్రమ్‌ సినిమాను జూన్‌ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

‘మక్కల్‌ నీది మయ్యం’ పేరుతో రాజకీయ పార్టీ  స్థాపించిన కమల్‌.. 2019 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 37 స్థానాల్లో పోటీ చేసినా విజయం సాధించలేదు.

You May Also Like These