దక్షిణాది, ఉత్తరాది అనే తేడాలేకుండా రీమేక్‌ల పర్వం సాగుతూనే ఉంది. ఇదివరకు బాలీవుడ్లో హిట్ కొట్టిన సినిమాలను ఇతర భాషల్లో రూపొందించేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. దక్షిణాదిన రూపొందుతున్న సినిమాలన్నీ బ్లాక్బస్టర్లుగా బాక్సాఫీస్ రికార్డులు తిరగ రాస్తుండడంతో ఇక్కడ హిట్ అయిన సినిమాలు బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. తాజాగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో మల్టీసారర్‌గా తెరకెక్కిన భీమ్లానాయక్‌ని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మళయాలంలో విజయం సాధించిన ‘ అయ్యప్పన్ కోషియమ్’ సినిమానే తెలుగులో ‘భీమ్లా నాయక్’గా రీమేక్ చేశారు. పవన్‌కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా రావురమేష్, మురళిశర్మ ముఖ్యపాత్రలు పోషించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా రిలీజ్ అప్పుడే హిందీలోనూ విడుదల చేస్తామని నిర్మాత నాగవంశీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. హిందీ థియేట్రికల్ రిలీజ్ హక్కులు బి4యూ మోషన్ పిక్చర్స్ వారు సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాని జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ కాంబినేషన్లో రీమేక్ చేయనున్నట్లు తాజా సమాచారం.
జాన్ అబ్రహాంతో పాటూ మొదట అర్జున్ కపూర్ ని అనుకున్నారు. కానీ, డేట్స్ ఇష్యూతో ఇప్పుడు అర్జున్ సినిమా నుంచీ తప్పుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. జాన్ అబ్రహాం నిర్మించి, నటిస్తోన్న మల్టీ స్టారర్ రీమేక్ నుంచీ అర్జు్న్ కపూర్ తాజాగా తప్పుకోవటంతో మేకర్స్ అభిషేక్ బచ్చన్‌ని తీసుకున్నారట. అసలు విషయం ఏంటంటే అర్జున్ కంటే ముందు అభిషేక్ దగ్గరికే వెళితే నో చెప్పాడంట జూనియర్ బి. కానీ, మళ్లీ ఇప్పుడు దర్శకనిర్మాతలు అభిషేక్ బచ్చన్ వద్దకే వెళ్లడంతో ఒప్పుకున్నాడని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
మలయాళ హీరోలు పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మెనన్, తెలుగు హీరోలు పవన్ కళ్యాణ్, రానా.... వీరి కంటే జాన్, అభిషేక్ ఎక్కువగా అభిమానులను అలరిస్తోరో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.
‘అయ్యప్పనుమ్ కోశియమ్’ హిందీ రీమేక్ తో పాటూ జాన్ అబ్రహాం షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాలోనూ కనిపించబోతున్నాడు. అభిషేక్ బచ్చన్ ఆర్. బాల్కీ దర్శకత్వంలో ‘గూమర్’ సినిమాలో నటిస్తున్నాడు.
మల్టీస్టారర్‌గా రూపొందిన 'భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లోనే రూ. 97.63 కోట్లు వసూలు చేసింది. నైజాం, ఓవర్ సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన భీమ్లా నాయక్ ఏపీ, రెస్టాఫ్ ఇండియా నష్టాలు మిగిల్చింది. మొత్తంగా రూ. 10.37 కోట్ల నష్టాలు మిగిల్చింది.
Follow Us