రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శేఖర్’. మే 20న రిలీజైన ఈ చిత్రాన్ని నిలిపి వేయాలంటూ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జీవితా రాజశేఖర్ తనకు ఇవ్వాల్సిన రూ.65 లక్షలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేస్తూ, ఫైనాన్షియర్ పరంధామరెడ్డి ఇటీవలే కోర్టుని ఆశ్రయించారు.
పరంధామ రెడ్డికి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చే వరకు, శేఖర్ సినిమాను థియేటర్స్, డిజిటల్, శాటిలైట్, యూ ట్యూబ్స్ వేదికలపై ప్రసారం చేయకూడదని కోర్టు తెలిపింది. అలాగే నెగెటివ్ రైట్స్‌ను అటాచ్ చేస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం జీవితా రాజశేఖర్ కూడా ‘శేఖర్ ‘ సినిమా విషయంలో కోర్టుకు వెళ్లబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఫైనాన్షియర్ పరంధామరెడ్డి ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు.
‘రెండున్నర సంవత్సరాల క్రితం జీవితా రాజశేఖర్‌కు రూ.65 లక్షలు ఇచ్చాను. తాము తీసే తర్వాతి సినిమా ‘శేఖర్’ రిలీజ్‌కు వారం రోజుల ముందే తీసుకున్న డబ్బులతో పాటు, మంచి బెనిఫిట్ ఇస్తామని చెప్పారు. ఇటీవలే మే 20న ‘శేఖర్’ మూవీ రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. దాంతో డబ్బుల కోసం వాళ్లింటికి పదిసార్లు తిరిగాను. అయితే, జీవిత ఏ విషయమూ చెప్పలేదు. దాంతో నా దగ్గరున్న డాక్యుమెంట్లతో సిటీ సివిల్ కోర్టులో కేసు వేశాను. కోర్టు ‘శేఖర్’ సినిమా నెగెటివ్ రైట్స్‌ను ఎటాచ్ చేస్తూ తీర్పునిచ్చింది. అయినా, ఇంత వరకు ఆమె చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదు. సోమవారం జీవితా రాజశేఖర్‌పై 'కంటెంప్ట్ ఆఫ్ కోర్టు' కేసు ఫైల్ చేయబోతున్నాం’ అని పరంధామరెడ్డి తెలిపారు.
'ఇంతకుముందు రాజశేఖర్‌తో ‘మహంకాళి’ సినిమా నిర్మించాను. ఆ పరిచయంతోనే జీవితా రాజశేఖర్‌కు డబ్బులు ఇచ్చాను. 'మహంకాళి ' సినిమాతో కూడా నాకు చేదు అనుభవం ఉంది. కానీ మళ్లీ వచ్చి రిక్వెస్ట్ చేయడంతో, డబ్బులు ఇచ్చాను. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని.. మంచి బెనిఫిట్ ఇస్తామని చెప్పడంతో నేను కూడా డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బులు అడిగితే, తర్వాత ఇస్తానని పోస్ట్‌పోన్ చేస్తోంది జీవిత. ఆమె డబ్బులు తీసుకుంటే ఎగ్గొట్టే రకం. ఇప్పటికే నగరి కోర్టులో జీవితపై ఒకరు కేసు వేశారు. ఆ కేసులో జీవితపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ అయ్యింది. ఇక నా డబ్బుల గురించి రాజశేఖర్, జీవిత ఎవరూ మాట్లాడటం లేదు.
ఈ విషయంపై ఛాంబర్‌లో కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఛాంబర్‌లో ఇష్యూ సెటిల్ కాదు. జీవితను డబ్బులు చెల్లించమని చాంబర్ వాళ్లు డైరెక్ట్ చేయలేరు. ఇంతకుముందు రాజశేఖర్‌తో ‘మహంకాళి’ సినిమా విషయంలో కూడా జీవిత (Jeevitha Rajasekhar) నన్ను మోసం చేసింది. ఆమె తత్వం నాకు తెలుసు. ఈ విషయంలో నేను కాంప్రమైజ్ కాను. అసలు రూ.65 లక్షలు, వడ్డీ రూ.22 లక్షలు చెల్లించాల్సి ఉందని ' పరంధామరెడ్డి ఇంటర్వ్యూలో తెలిపారు.
Follow Us