ఎఫ్ 3 (F3) తర్వాత ఎఫ్‌ 4 సందడి?

ఎఫ్‌3 సినిమా పోస్టర్‌‌, డైరెక్టర్ అనిల్ రావిపూడి

ఎఫ్2తో 2019 సంక్రాంతి అల్లుళ్లుగా వచ్చి ఊహించని హిట్ కొట్టారు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కామెడీలో ట్రెండ్ సెట్టర్‌గా మిగిలింది. ఎఫ్2 విజయం తర్వాత  ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించింది సినీ బృందం. ఎఫ్3గా రాబోయే సీక్వెన్స్‌లో మరింత కామెడీతో అలరిస్తామని చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత అనిల్.. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు తీసి మరో హిట్ సాధించారు.

ఆ తర్వాత వెంకటేష్ కూడా దృశ్యం–2, నారప్ప సినిమాలతో..  వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్, గని సినిమాలతో బిజీ అయ్యారు. కరోనా, లాక్డౌన్ కారణంగా సినిమాలన్నీ వాయిదా పడడంతో ఎఫ్3 (F3) నిర్మాణం కూడా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకూ ఎఫ్ 3 ని పూర్తి చేసి మే 27న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇంతటితో ఫన్ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌కి శుభం కార్డు పడడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్4 కూడా రాబోతుందని సమాచారం.

సినిమా హిట్ అయితే చాలు.. దానికి సీక్వెల్ తీయడం చాలాకాలంగా బాలీవుడ్‌లో సాగుతున్న ట్రెండ్. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ టాలీవుడ్‌లోనూ జోరందుకుంది.  ఆర్యకి సీక్వెల్‌గా "ఆర్య 2" వచ్చినా కూడా, రెండు సినిమాల కథలకీ సంబంధం లేదు. సస్పెన్స్తో మొదటి భాగం ఆపేసి. రెండో భాగంలో దాన్ని రివీల్ చేయడం బాహుబలితో మొదలైంది. అది కాస్త హిట్ కొట్టడంతో, ప్రతి సినిమాకీ సీక్వెల్ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే కథల్ని తయారుచేస్తూ అలరిస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా వచ్చిన కేజీఎఫ్–2 మొదటి భాగం కంటే, పెద్ద హిట్‌గా నిలిచి రికార్డులను తిరగరాస్తోంది.  అల్లుఅర్జున్‌ని కొత్తగా చూపించిన "పుష్ప"కి కూడా సీక్వెల్ రెడీ అవుతోంది.

అయితే మిగతా సీక్వెల్స్​‌తో పోలిస్తే,  ఎఫ్3 భిన్నంగా ఉండబోతోందంటున్నాడు అనిల్.  అంతేకాదు దీనికి సీక్వెల్‌గా ఎఫ్4 కూడా తీయనున్నారనీ, దానికి కూడా దిల్ రాజే నిర్మాత అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తి చేయడానికి సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే ఎఫ్3 రిలీజ్ తర్వాత, అనిల్ బాలకృష్ణతో తీయబోయే సినిమాని పట్టాలెక్కించనున్నాడు. అంతేకాదు మహేష్ బాబుతో మరో సినిమాకి స్క్రిప్ట్ వర్క్ రెడీ చేస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలా అనిల్ కమిట్ అయిన సినిమాలు పూర్తయి.. ఎఫ్4 ప్రారంభమవడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేలా ఉంది.

కాగా,  మే 27న ఎఫ్3 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాని మే 9 న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగంలో భార్యల గోల చూపించిన అనీల్.. రెండో భాగంలో డబ్బుల కష్టాలు చూపించనున్నాడు.  ఇందులో సునీల్ మార్క్ కామెడీ కూడా ఉండబోతోందని తెలుస్తోంది.   ఈ రెండిటికి మరో ఎఫ్ ను జోడించి.. కొత్తకథను రెడీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కథ పూర్తిగా ‘ఎఫ్ 3’(F3) విజయంపైనే ఆధారపడి ఉందని టాక్. ఈ సినిమా కనుక విజయ డంకా మోగిస్తే ‘ఎఫ్ 4’ ను వెంటనే పట్టాలెక్కిస్తాడంట. ఒకవేళ రిజల్ట్ తేడా కొడితే, కొంచెం గ్యాప్ తీసుకొని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Credits: Instagram
You May Also Like These