నా సంపాదన ప్రజల కోసమే ఖర్చు చేస్తా.. ‘విక్రమ్’ సినిమా ప్రమోషన్స్‌లో కమల్‌ హాసన్ (Kamal Haasan)

విక్రమ్ సినిమా ఈవెంట్‌లో పీఆర్‌‌వో డైమండ్‌ బాబును సన్మానిస్తున్న కమల్‌ హాసన్

ఇంత కాలం సినిమాల్లో తాను సంపాదించిన డబ్బులను తిరిగి ఇండస్ట్రీలోనే పెడుతున్నానని, ఇకపై వాటిని ప్రజల కోసం ఖర్చు చేస్తానని కమల్‌ హాసన్ (Kamal Haasan) చెప్పాడు. ఆయన హీరోగా చేసిన కొత్త సినిమా ‘విక్రమ్’. తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ బ్యానర్‌‌పై లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్‌ విక్రమ్ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. జూన్‌ 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను తెరకెక్కించారు. 

విక్రమ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో కమల్‌ హాసన్, దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఇటీవల మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కమల్‌ హాసన్‌ తన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. తన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిందని, ఆలస్యానికి సారీ చెబుతున్నానని అన్నాడు కమల్.

ఇన్నాళ్లూ నేను సంపాదించింది తిరగి ఇండస్ట్రీలోనే పెట్టుబడి పెడుతున్నాను. ఈసారి నుంచి ఆ డబ్బును ప్రజల కోసం ఖర్చు చేస్తాను. మే 3న కరుణానిధి జయంతి సందర్భంగా విక్రమ్ సినిమాను రిలీజ్‌ చేయడం లేదు. ఆ రోజు విడుదల చేయడం అనేది కేవలం యాదృచ్చికమే. కరుణానిధి నాకు నచ్చిన నాయకుడు . లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విక్రమ్‌-3 చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కాగా, పీఆర్‌వోగా 600 సినిమాలు పూర్తి చేసిన డైమండ్‌ బాబును కమలహాసన్‌ ఘనంగా సత్కరించారు.

ఏ పాత్ర చేసినా వైవిద్యం కోరుకునే నటుడాయన. కామెడీ, సీరియస్, సెంటిమెంట్‌ ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయి జీవించే నటుడిగా కమల్‌కు మంచి పేరుంది. అయితే ఇటీవల ఆయన చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. కథ, కథాంశం పరంగా అవి బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడుతున్నా.. ఆ సినిమాల్లో కూడా కమల్‌ నటనకు మంచి మార్కులే పడుతున్నాయి.

దశావతారం సినిమాలో పది పాత్రలు పోషించి మెప్పించిన కమల్.. విశ్వరూపం 1, 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా కమల్‌ చేస్తున్న సినిమా విక్రమ్. అనిరుథ్‌ మ్యూజిక్ చేస్తున్న కమల్‌ హాసన్ (Kamal Haasan) విక్రమ్‌ సినిమాను జూన్‌ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ‘మక్కల్‌ నీది మయ్యం’ పేరుతో రాజకీయ పార్టీ  స్థాపించిన కమల్‌.. 2019 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 37 స్థానాల్లో పోటీ చేసినా విజయం సాధించలేదు.

You May Also Like These